Share News

బ్యాంకు ఖాతాలకే పింఛన్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:26 AM

ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో నెలకో నిర్ణయం తీసుకుంటోంది. ఈ నెలలో సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేయగా, వచ్చే నెలలో డీబీటీ పద్ధతిలో వీటిని జమచేయాలని నిర్ణయించింది.

బ్యాంకు ఖాతాలకే పింఛన్‌

ఆధార్‌తో అనుసంధానమైతే డీబీటీ పద్ధతిలో జమ

1వతేదీ నుంచి అమలు

దివ్యాంగులు, మంచంలో ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దనే అందజేత

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 28: ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో నెలకో నిర్ణయం తీసుకుంటోంది. ఈ నెలలో సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేయగా, వచ్చే నెలలో డీబీటీ పద్ధతిలో వీటిని జమచేయాలని నిర్ణయించింది. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయడాన్ని నిలిపివేయడం తగదంటూ టీడీపీ నాయకులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత నెలకు సంబంధించిన పింఛన్లను ఈ నెల మొదటివారంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చెల్లించారు. గతంలో వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛన్‌ సొమ్మును తీసుకుపోయి అందించేవారు. అయితే ఎన్నికల కమిషన్‌ వలంటీర్లను ఆబాధ్యతల నుంచి తప్పించింది. దీంతో గత నెలలో పింఛన్లను సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు అందించారు. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిపై టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేశారు. సచివాలయ సిబ్బంది ద్వారానే పింఛన్‌ సొమ్మును లబ్ధిదారుల ఇళ్లకు పంపించి అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ పింఛన్‌దారులను ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం గతనెల పింఛన్‌ను సచివాల యాల దగ్గరే పంపిణీ చేసింది. దీంతో వృద్ధులు, వితంతువులు, వ్యాధులతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు నానా అవస్థలు పడ్డారు. ఎండ వేడిమికి తట్టుకోలేక రాష్ట్రంలో కొంతమంది మృత్యువాతపడ్డారు. అయితే ఈనెల సొమ్ము అయినా ఇంటికి వచ్చి అందజేస్తారని పింఛన్‌దారులు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం తాజాగా డీబీటీ పద్ధతిపై మే 1న అందజేస్తామని ప్రకటించింది. పింఛన్‌ పొందుతున్న వారి ఆధార్‌ కార్డుల ఆధారంగా లింకు అయిన బ్యాంకు ఖాతాలకు సొమ్మును జమ చేయనున్నారు. ఆ వివరాలను సెర్ప్‌ అధికారులు బ్యాంకుల నుంచి సేకరించనున్నారు. ఆ మేరకు ఏప్రిల్‌ మాసానికి సంబంధించిన పింఛన్‌ సొమ్మును మే 1వ తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు.

మంచంలో ఉన్న వృద్ధులు, రోగులు, దివ్యాంగులకు ఇంటికే పింఛన్‌

బ్యాంకులకు వెళ్లి పింఛన్‌ సొమ్మును తీసుకునే స్థితిలో లేని వృద్ధులు, మంచానికి పరిమితమై ఉన్న రోగులు, దివ్యాంగులకు మాత్రం సచివాలయం సిబ్బంది ఇంటికే వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరికి ఇంటి వద్దనే పింఛన్‌ ఇచ్చేందుకు ఈనెల 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయనున్నారు. ఎంతమందికి ఇంటికి పింఛన్‌ అందజేయాలి, ఎంతమందికి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నారనే వివరాలను ప్రభుత్వం సోమవారం నాటికి జిల్లా అధికారులకు తెలియజేయనుంది. జిల్లాలో 2,92,522మందికి ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లను అందజేస్తుంది. అందుకోసం ప్రతినెలా రూ.87.49 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. మొత్తం 2,92,522 మందిలో 75శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలకు ఆధార్‌తో లింకై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన వారికి ఇంటికే తీసుకెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేయాల్సి ఉందని డీఆర్‌డీఏ అధికారులు అంటున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 01:26 AM