Share News

ముగిసిన ఓట్ల నమోదు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:35 AM

జిల్లాలో వచ్చేనెల 13వతేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఇప్పటివరకు ఓటు లేని వారు, 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు కొత్తగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది.

ముగిసిన ఓట్ల నమోదు

జిల్లావ్యాప్తంగా 8,320 దరఖాస్తులు

వారంరోజుల్లో విచారణ పూర్తి

అర్హత ఉంటే వెంటనే ఓటు హక్కు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15 : జిల్లాలో వచ్చేనెల 13వతేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఇప్పటివరకు ఓటు లేని వారు, 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు కొత్తగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. గత ఆరునెలల నుంచి ఈ ప్రక్రియ జరుగుతోంది. అయితే షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఈ నెలరోజుల నుంచి ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఓటు నమోదు కోసం ఫాం-6 దరఖాస్తులను ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్‌గా బీఎల్వోల వద్ద చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. అలా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఓటుహక్కు నమోదు కోసం 8,320 దరఖాస్తులు వచ్చాయి. వాటిని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు మండలాల వారీగా విభజించి సంబంధిత తహసీల్దార్లు, బీఎల్వోలకు పంపారు. వారంరోజుల్లో ఓటుహక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి అర్హత ఉంటే ఓటుహక్కు కల్పించనున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:35 AM