Share News

నేడు డీఎంహెచ్‌వోపై విచారణ

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:31 AM

జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మిపై మంగళవారం విచారణ జరగనుంది. ఈ మేరకు విచారణాధికారి అయిన రాజమహేంద్రవరం వైద్యారోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.పద్మశశిధర్‌ నోటీసులు జారీచేశారు.

నేడు డీఎంహెచ్‌వోపై విచారణ

రాజమండ్రి ఆర్డీకి బాధ్యతలు

పలు ప్రైవేటు ఆస్పత్రులకు పర్మిషన్లపై ఫిర్యాదులు

ఫైళ్లు సిద్ధంగా ఉంచాలంటూ ఆదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15: జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మిపై మంగళవారం విచారణ జరగనుంది. ఈ మేరకు విచారణాధికారి అయిన రాజమహేంద్రవరం వైద్యారోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.పద్మశశిధర్‌ నోటీసులు జారీచేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. టంగుటూరుకు చెందిన టంగుటూరి శ్రీనివాసులు, ప్రొద్దుటూరుకు చెందిన అడ్వకేట్‌ విజయభాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వోపై విచారణ జరుగుతుంది. ఫిర్యాదులకు సంబంధించిన ఫైళ్లు సిద్ధంగా ఉంచాలని, సంబంధిత సెక్షన్‌ బృందాన్ని కూడా కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోను అధికారులు ఆదేశించారు. జిల్లాలోని ఆసుపత్రుల జాబితా, వాటికి అనుమతులు, డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేసి వివాదాలు, ఏసీబీ కేసుల్లో చిక్కుకున్న వారి ఫైళ్లు అందుబాటులో ఉంచాలని ఆర్డీ తన నోటీసుల్లో ఆదేశించారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి అవినీతి, అక్రమాలపై మంగళవారం జరిగే విచారణకు హాజరై బాధితులు సాక్ష్యం చెప్పాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్‌ మాదిగ కోరారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖాధికారి అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే సమయం వచ్చిందన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:31 AM