Share News

చెవిరెడ్డి చికాకు!

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:30 AM

ఒంగోలు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఆపార్టీ నేతలు చిటపటలాడుతున్నారు. మమ్మల్ని నమ్మడు, మాకేం చెప్పడు, పెత్తనమంతా పరాయి వాళ్లకే ఇస్తున్నాడంటూ కిందిస్థాయిలోని నాయకులు గగ్గోలుపెడుతున్నారు.

చెవిరెడ్డి చికాకు!
ఒంగోలులో నిర్వహించిన చెవిరెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగానే ఖాళీగా ఉన్న కుర్చీలు (ఫైల్‌)

అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహారశైలి

వైసీపీ ఎంపీ అభ్యర్థిపై కేడర్‌ చిటపట

అసెంబ్లీ అభ్యర్థులతో సమన్వయలోపం

పెత్తనమంతా పరాయి జిల్లావారికే..

మాకేమీ చెప్పడు.. ఎవరినీ నమ్మడు అంటూ నాయకుల గగ్గోలు

డబ్బు పంపిణీలో వ్యత్యాసంపై ద్వితీయ శ్రేణి అసంతృప్తి

ఒంగోలు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఆపార్టీ నేతలు చిటపటలాడుతున్నారు. మమ్మల్ని నమ్మడు, మాకేం చెప్పడు, పెత్తనమంతా పరాయి వాళ్లకే ఇస్తున్నాడంటూ కిందిస్థాయిలోని నాయకులు గగ్గోలుపెడుతున్నారు. ఆయా పదవుల్లో ఉన్న వారికిచ్చే డబ్బు విషయంలోనూ వ్యత్యాసం చూపుతుండటంతో రగిలిపోతున్నారు. ఇంకోవైపు అసెంబ్లీ అభ్యర్థులతోనూ సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వీటన్నింటికీతోడు తాము చెవిరెడ్డి దూతలమంటూ ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న వ్యక్తుల హడావుడితో నేతలు చికాకుపడుతున్నారు. పరిస్థితిని గమనించిన ముఖ్య నాయకులు మద్యం, డబ్బుతో మంచి ఊపు తెస్తాడు.. చూస్తుండండి అంటూ కిందిస్థాయి శ్రేణులకు ఆశలు పెట్టి వారిని సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత సమస్యలు పెరిగిపోయి అలజడి ఆరంభమైంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాజకీయంగా ఏపార్టీలోనైనా ఆయా స్థాయిలోని నాయకులు వారివారి ప్రాంతాల్లో తమ పెత్తనమే కొనసాగాలని ఆశిస్తుంటారు. ఒకరికి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటే వారిని సమన్వయం చేసుకోవడం లేక వారిపై ఒక సమన్వయకర్తను నియమించడం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులు ముందు కెళ్తుంటారు. అయితే ఇంతకు ముందు ఈ ప్రాంత నాయకులతో ఏమాత్రం పరిచయం లేని, ఇక్కడి పరిస్థితులు, వ్యవహారాలపై కనీస పరిజ్ఞానం లేని చెవిరెడ్డిని వైసీపీ రంగంలో దింపింది. రాజకీయ అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి తదనుగుణంగా ముందుకుపోకుండా తనదైన శైలిలో సాగుతున్నారు. ఆయా ప్రాంతాల వారితో పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తే వంట మనుషులను సైతం తమ వారినే తెచ్చి భోజనాలు ఏర్పాటుచేయడంతోపాటు వేదికల ఏర్పాట్లలోనూ స్థానిక నాయకులను పక్కనపెట్టారు. ఆయా గ్రామాల వారీ కార్యకర్తల సమీకరణకు వాహనాల విషయంలోనూ స్థానిక నేతల పాత్రకు అవకాశమే ఇవ్వలేదు. దీంతో కీలక నాయకులు కూడా సాధారణ కార్యకర్తల్లా ఇలా వచ్చి అలా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పరిచయ కార్యక్రమాల్లోనూ కనీసం మండలంలో పదిమందిని అయినా ఆయన పరిచయం చేసుకోకుండా నేను జగన్‌కు ముఖ్యుడిని, ఆయన పంపాడు ఓట్లు వేయండి అంటూ దండంపెట్టి మూడు ముక్కలతో ప్రసంగాన్ని ముగించారు.

కొన్నిచోట్ల వలంటీర్లకు గిఫ్ట్‌లు ఇవ్వకపోవడంతో అసంతృప్తి

లోక్‌సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వలంటీర్లకు రెండు నెలల నుంచి చెవిరెడ్డి డబ్బులు పంపిస్తున్నట్లు బహిరంగంగా చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.5వేల చెప్పున మొదటి నెలలో డబ్బులతోపాటు గిప్టులు కూడా ఇచ్చారు. ఈనెలలో కేవలం డబ్బులు పంపారు. అయితే మార్చిలో గిప్టులు రాని చోట వలంటీర్లు స్థానిక నాయకులను ప్రశ్నించగా మనకు పంపలేదని వారు చేతులెత్తేశారు. దీంతో రెండు రకాలైన పంపిణీ ఏమిటంటూ వలంటీర్లలోనే చర్చ నడిచింది. దీనిపై కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

డబ్బు విషయంలో మరింత గగ్గోలు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వైసీపీ కౌన్సిలర్లు, లేనిచోట ఇన్‌చార్జిలకు కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ డివిజన్‌ అధ్యక్షులకు డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. అలా గిద్దలూరులో తొలుత ఒక్కక్కరికి రూ.2లక్షలు ఇచ్చారు. మార్కాపురం, కనిగిరిలో ఒక్కొక్కరికి లక్ష పంపిణీ చేశారు. ఆ సందర్భంగా త్వరలో మరో లక్షా లేక రెండు లక్షలు మీకు వస్తామని స్థానిక నాయకులు చెప్పారు. మార్కాపురంలాంటి మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌కు లక్ష ఇచ్చి అతనితో ఉండే 10మంది ముఖ్యులకు ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రకారం ఇమ్మని మరో లక్ష ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి ఇస్తారో ముందుగా పేర్లు ఇవ్వాలని అడిగి వెరిఫై చేసుకొని మరీ పంపిణీ చేశారు. తాజాగా ఒంగోలులో ఒక్కో కార్పొరేటర్‌కు రూ.3లక్షల ప్రకారం ఇచ్చారు. కొంత తక్కువగా డివిజన్‌ అధ్యక్షులకు చెల్లించారు. దీంతో పశ్చిమప్రాంతంలోని ఆయా మునిసిపాలిటీల్లోని కౌన్సిలర్లు తమకు లక్ష ఇచ్చి అక్కడ మూడు లక్షలు ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తూ వెంటనే తమకూ అలాగే ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. అంతేకాక పశ్చిమ ప్రాంతంలోని మునిసిపాలిటీల్లో మరికొందరికి రూ.లక్ష ఇస్తే కొందరికి రెండు లక్షలు ఇచ్చినట్లు బయటపడింది. దీంతో అక్కడ కౌన్సిలర్లు తమ అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇది గమనించి అభ్యర్థులు మీకు కూడా మరికొంత ఇస్తారు. కాకపోతే మరో వారంరోజులు ఓపిక పట్టండి అంటూ సముదాయిస్తున్నట్లు తెలిసింది.

ప్రైవేటు వ్యక్తులతో హడావుడి

ప్రస్తుతం చెవిరెడ్డి పొదిలి కేంద్రంగా నడుస్తూ రోజువారీ ఏదో ప్రాంతానికి వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో కాసేపు కారులోనే వేచి ఉండటం, మరికొన్ని పాంత్రాల్లో కిందకు దిగి కనిపించిన ప్రజలను ఆలింగనం చేసుకొని మాటలు చెప్పి వెళ్లిపోవడం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల స్ధానిక నాయకులకు ఎవరో చెబితే గాని చెవిరెడ్డి వచ్చిపోయిన విషయం తెలియడం లేదు. దీనికి తోడు పొదిలి కేంద్రంగా ఆయన సుమారు 80మంది ప్రైవేట్‌ వ్యక్తులను ఉంచి వారిని రోజువారీ ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపుతున్నారు. వారు సాయంత్రానికి ఏదో ఒక సమాచారాన్ని చెవిరెడ్డికి ఇస్తున్నారు. తదనుగుణంగా ఆయన అక్కడ ఇది జరుగుతుంది.. ఇక్కడ ఇది జరుగుతుంది అంటూ అసెంబ్లీ అభ్యర్థులకు సమాచారం పంపుతున్నారు. కొన్నిచోట్ల కిందిస్థాయి నాయకులకు ఫోన్లు చేసి చెప్పడం ప్రారంభించారు. దీంతో కిందిస్థాయిలోని వైసీపీ నాయకులు ఈ పరాయి పెత్తనం ఇలాగే సాగితే భరించలేమంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

సీనియర్ల జోలికెళ్లడు.. జూనియర్లను పట్టించుకోడు

అసెంబ్లీ అభ్యర్థులతోనూ చెవిరెడ్డికి సమన్వయం లోపించింది. కొందరు అభ్యర్థుల విషయంలో అణిగి మణిగి వ్యవహరిస్తున్న ఆయన రాజకీయంగా జూనియర్లు అయిన కొందరిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు బహిరంగంగానే ఉన్నాయి. మీ పని మీరు చేయండి నేను ఏమి చేయాలో చేస్తానన్న చందంగా కొందరితో మాట్లాడుతున్నారని ఆ పార్టీశ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఏడు నియోజకవర్గాల్లో రెండుచోట్ల తానేమీ చేయూ త ఇవ్వలేనని సంకేతం ఇచ్చినట్లు సమాచారం. దీంతో బదిలీపై తూర్పు ప్రాంతానికి వచ్చి పోటీచేస్తున్న ఒక అభ్యర్థి.. విషయాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పైకి మాత్రం తానే అన్నీ సమకూర్చుతున్నాను అన్న తరహాలో చెవిరెడ్డి హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొందరు అధికారుల మద్దతుతో బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం నిల్వలను అక్రమంగా పెడుతున్నట్లు తెలిసింది. అందుకు సహకరించని బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై అధికారులతో తనిఖీలు చేయించి కేసులు రాయించడం, వాటిని సీజ్‌ చేయించడంలాంటి చర్యలకు శ్రీకారం పలికారు. ప్రజలను కాకపోయినా పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులను కూడా కలవని చెవిరెడ్డితో మున్ముందు మరింత ఇబ్బందులు తప్పకపోవచ్చన్న భావన ఆపార్టీ నాయకుల్లో పెరిగిపోతోంది.

Updated Date - Apr 29 , 2024 | 01:30 AM