Share News

సినీ ఫక్కీలో హత్య

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:57 PM

సినీ ఫక్కీలో హత్య

సినీ ఫక్కీలో హత్య

బీమా డబ్బు కోసం ఓ వ్యక్తిని బలి చేసిన వైనం

ఎట్టకేలకు హత్య కేసును ఛేదించిన పోలీసులు

తండ్రీ కొడుకులకు రిమాండ్‌

ఆత్మకూరు, ఏప్రిల్‌ 15: ధాన్యం కొనుగోలు చేసే ఓ వ్యాపారి రైతుల నుంచి దిగుబడులను కొనుగోలు చేసి వారికి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పన్నాగం పడి ఏకంగా తానే మరణించినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు.. తన చావుకు బీమా డబ్బు వచ్చేలా ముందుగానే డెత్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేసుకున్నాడు. సినీఫక్కీలో తనకు బదులు మరో అమాయక వ్యక్తిని హత్య చేసి అటు రైతులను మోసం చేయడమే కాకుండా.. ఇటు ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి డబ్బు కాజేయాలనుకున్నాడు. చివరకు అతని ఎత్తుగడ బయటపడి పోలీసులు దొరికారు. సోమవారం ఆత్మకూరు రూరల్‌ సర్కిల్‌ పోలీసుస్టేషన్‌లో నంద్యాల జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.

మండల కేంద్రమైన పాములపాడుకు చెందిన ఫారూక్‌బాషా ఏకే ట్రేడర్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవాడు. ఈక్రమంలోనే రైతులకు సుమారు రూ.కోటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి డబ్బు చెల్లించాల్సి ఉంది. ఎలాగైనా రైతులకు చెల్లించాల్సిన డబ్బు ఎగ్గొట్టాలని ఫారూక్‌బాష నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను తాను మరణించినట్లు సృష్టించి జనాన్ని మోసగించాలనుకున్నాడు. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితమే తన మరణానికి సంబంధించి యాక్సెస్‌ బ్యాంకులో రూ.50 లక్షలు, ఎల్‌ఐసీ ద్వారా మరో రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి డెత్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకున్నాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 1వ తేదీన రాత్రి 10గంటల సమయంలో పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్‌(35) అనే అమాయకుడిని షాప్‌కు పిలిపించుకున్నాడు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న ప్రతా్‌పను గొనెసంచులు కుట్టే ప్లాస్టిక్‌ తాడుతో మెడకు గట్టిగా బిగించాడు. అతను అపస్మారక స్థితికి చేరుకోవడంతో గొంతు నులిమి హత్య చేశాడు. తాన అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏకే ట్రేడర్స్‌ షాప్‌లో తాను ముందే తెచ్చుకున్న పెట్రోల్‌ను చల్లి శెట్టి ప్రతాప్‌ మృతదేహం మీద కూడా పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. మంటలు చెలరేగడంతో తానే ఈ ప్రమాదంలో మరణించినట్లు నమ్మించేలా అతడి సెల్‌ఫోన్‌, చెప్పులు, బైక్‌ను వదిలేసి పరారయ్యాడు. అయితే ఈ కుట్రలో భాగమైన ఫారూక్‌బాషా కుమారుడు అక్బర్‌బాషా పక్కా ప్లాన్‌ ప్రకారం అక్కడికి చేరుకుని షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తన తండ్రేనని పాములపాడు పోలీసులను నమ్మించాడు. ఆ మేర కు ఫిర్యాదు చేశాడు. దీనిపై పాములపాడు పోలీసులు యాక్సిడెంటల్‌ డెత్‌గా కేసు నమోదు చేశా రు. ఆతర్వాత మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. దీంతో ముస్లిం సంప్రదాయపద్ధతిలో ముస్లిం శ్మశాన వాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.

భర్త కనిపించలేదని ఫిర్యాదు

ప్రతిరోజూ పాములపాడుకు వెళ్లి వచ్చే తన భర్త శెట్టి ప్రతాప్‌ నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో ఏప్రిల్‌ 5 తేదీన మృతుని భార్య స్వరూప పాములపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అప్పటికే ఫారూక్‌ బాషా మోసపూరితమైన కుట్ర గ్రామంలో ప్రచారమైంది. దీంతో ఏకే ట్రేడర్స్‌లో మరణించిన శెట్టి ప్రతా్‌ప్‌కు ఉన్న దుస్తులను ఆమె పరిశీలించి తన భర్తవిగా నిర్ధారించింది. దీనిపై ఆమె ఈ నెల 12వ తేదీన మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి మిస్టరీని ఛేదించాలని అడిషనల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పాములపాడుకు పంపించారు. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి మరోసారి శవపంచనామా చేశారు. మృతదేహానికి ఉన్న ఆనవాళ్లను గుర్తించి మృతుడు శెట్టి ప్రతా్‌పగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పరారీలో ఉన్న ఫారూక్‌బాషా కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే ఎట్టకేలకు ఫారూక్‌బాషా, ఆయన కుమారుడు అక్బర్‌బాషాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరి నిందితులను కోర్టులో హాజరుపర్చగా మెజిస్ర్టేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు. కేసును ఛేదించిన ఆత్మకూరు రూరల్‌ సీఐ నాగభూషణ్‌, పాములపాడు ఎస్సై అశోక్‌, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Apr 15 , 2024 | 11:58 PM