Share News

జన‘చంద్ర’ం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:22 AM

కౌతాళం జనంతో కిక్కిరిసింది.. గూడూరులో తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు..

జన‘చంద్ర’ం

దోపిడీకి కేరాఫ్‌ వైసీపీ ఎమ్మెల్యేలు

జగన్‌ పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు

రాబోయేది మన ప్రభుత్వమే

మంత్రాలయంలో వలసలు ఆపేందుకు ప్రత్యేక ప్రణాళిక

కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తా

గూడూరు, కోడుమూరులో ఎస్‌ఎస్‌ ట్యాంకులు నిర్మిస్తా

డిగ్రీ కళాశాలను మంజూరు చేయిస్తా

కౌతాళం, గూడూరు ప్రజాగళంలో చంద్రబాబు

కర్నూలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి)/కౌతాళం/గూడూరు: కౌతాళం జనంతో కిక్కిరిసింది.. గూడూరులో తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు.. చంద్రబాబు రాకతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం... మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో కౌతాళం, గూడూరు ‘ప్రజాగళం’ సభలు జనంతో కళకళలాడాయి. ఆదివారం ప్రజాగళం యాత్రలో భాగంగా కౌతాళం, గూడూరులో జరిగిన బారీ బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆయా సభలకు పల్లెల నుంచి జనం వెల్లువలా తరలి వచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ వృద్ధులు, మహిళలు, రైతులు, యువతరం ఇలా అన్ని వర్గాల ప్రజలు దండుకట్టి జెండా పట్టి ప్రజాగళమై తరలివచ్చారు. ఇక ఉప్పొంగిన జనం ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు సీఎం జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. అదే క్రమంలో జూన్‌ 4 తర్వాత ప్రమాణస్వీకారం చేయబోయే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జనపాలన ప్రభుత్వంపై ప్రజా ప్రభుత్వం వచ్చాక చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. జగన్‌ ప్రభుత్వాన్ని తుక్కుతుక్కుగా ఓడించి సైకోను ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘జగన్‌ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి.. గెలుపు టీడీపీదే అని అర్థమైపోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే.. ఫ్యాన్‌ పార్టీని తుక్కుతుక్కుగా ఓడిస్తారు.. కర్నూలు పార్లమెంటు సహా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనమే గెలుస్తున్నాం..’ అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ప్రారంభించారు. అదే సమయంలో ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు వై. సాయిప్రసాద్‌ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై విరుచుకుపడ్డారు. వైసీపీ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యేలు దోపిడీదారులన్నారు. ఎమ్మెల్యే బ్రదర్స్‌ దోపిడీకి కేరాఫ్‌గా నిలిచారన్నారు. ఆ ఎమ్మెల్యేల దోపీడీలు హద్దులు మీరాయని, ఇసుక మాఫియాను పెంచి పోషిస్తూ తుంగభద్ర ఇసుకను గుల్ల చేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘వలసల నివారణకు కార్యాచరణ’

కౌతాళంలో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌. రాఘవేంద్రరెడ్డిలతో కలిసి చంద్రబాబు మాట్లాడారు. మూడు సార్లు మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని గెలిపిస్తే.. ఒక్క రోడ్డయినా వేశాడా..? ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించాడా..? ఒక్క అభివృద్ధి పనైనా చేశాడా? అంటూ చంద్రబాబు నిలదీశాడు. రాబోయే మన ప్రభుత్వంలో సాగు నీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో వలసల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు లిఫ్టులను మరమ్మతులు చేయిస్తాం.. ఆర్డీఎస్‌ కుడి కాలువను పనులు మొదలు పెట్టి పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధిని పెంపొందించి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తామన్నారు. కర్నూలు ఎంపీగా కురువ సామాజిక వర్గానికి చెందిన నాగరాజుకు, మంత్రాలయం ఎమ్మెల్యేగా బోయ సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డికి, ఆదోనిలో అదే వర్గానికి చెందిన పార్ధసారథికి, ఆలూరులో లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వీరభద్రగౌడ్‌కు, కోడుమూరు ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన బొగ్గుల దస్తగిరికి, పత్తికొండలో ఈడిగ సామాజిక వర్గానికి చెందిన కేఈ శ్యాంబాబుకు, కర్నూలులో ఆర్యవైశ్య వర్గానికి చెందిన టీజీ భరత్‌కు, నంద్యాలలో ఫరూక్‌కు టికెట్లు ఇచ్చామన్నారు. ఇది సామాజిక న్యాయం అంటే అని వివరించారు. మన ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

కోడుమూరులో ఎస్‌ఎస్‌ ట్యాంకుల నిర్మాణం

గూడూరు భారీ బహిరంగ సభలో టీడీపీ సీనియర్‌ నాయకులు విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కోడుమూరు, గూడూరు పట్టణాల్లో ఎస్‌ఎస్‌ ట్యాంకులు నిర్మించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే క్రమంలో యువతరానికి ఉపాధి చూపే స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. కోడుమూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉందని, ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరిని గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గం పక్కనే తుంగభద్ర ఉంది. వైసీపీ నాయకులు ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారు. వాళ్లకు దోపిడీపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదంటూ ఘాటుగా స్పందించారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. అదే క్రమంలో గురు రాఘవేంద్ర, పులకుర్తి ఎత్తిపోతల పథకాలకు మరమ్మతు చేయించి నిర్వహణకు నిధులు ఇస్తామని చెప్పారు. అలాగే కోడుమూరు, గూడూరులో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, యువతకు ఉన్నత విద్య అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

గూడూరులోనే రాత్రి బస: ప్రజాగళం సభల్లో భాగంగా ఆదివారం రాత్రి గూడూరులోనే చంద్రబాబు బస చేశారు. సోమవారం నందికొట్కూరు, డోన్‌ పట్టణాల్లో జరిగే జరిగే ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.

Updated Date - Apr 29 , 2024 | 12:22 AM