Share News

18న ఎన్నికల నోటిఫికేషన్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:34 AM

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజన ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.

18న ఎన్నికల నోటిఫికేషన్‌

ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ

జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజన ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 18న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చే వారి వాహనాలను 200 మీటర్ల దగ్గరే నిలిపివేస్తామన్నారు. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులకు మాత్రమే నామినేషన్లు వేయడానికి అనుమతి ఉంటుందన్నారు. పబ్లిక్‌ హాలిడేల్లో, ఆదివారం రోజున నామినేషన్లు స్వీకరించడం జరగదని వెల్లడించారు. ఈ నెల 12న ఈవీఎంల రాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, ఈవీఎంలను అన్ని నియోజకవర్గాలకు పంపించామన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈవీఎంలను కమిషనింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బ్యాలెట్‌ యూనిట్‌ మీద బ్యాలెట్‌ పేపర్లు అతికించడం, వీవీ ప్యాట్‌లో సింబల్స్‌ అప్‌లోడ్‌, ఫైనల్‌ చెకింగ్‌ చేస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 60 సంవత్సరాలు పైబడిన వారు, విభిన్న ప్రతిభావంతులు, గర్బిణులు క్యూల్లో నిలబడకుండా త్వరితగతిన వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. మే 10వ తేదీలోపు ఓటర్లు స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో మధుసూదన్‌రావు, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌ మోహమద్‌ అక్బర్‌ హుశేన్‌, బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్‌చార్జి జి.అరుణ్‌ కుమార్‌, బీజేపీ స్పోక్స్‌ పర్సన్‌ సాయిప్రదీప్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ, టీడీపీ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీ ఎల్వీ ప్రసాద్‌, వైసీపీ జిల్లా కార్యదర్శి ఎస్‌.రాజేష్‌బాబు, ఎన్నికల విభాగాల సూపరింటెండెంట్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:34 AM