Share News

ఇళ్ల వద్దనే పింఛన్‌ పంపిణీ : కలెక్టర్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:19 AM

జిల్లాలోని లబ్ధిదారులు తమ పింఛన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని, ఇండ్లకే వచ్చి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ జి. సృజన అన్నారు.

ఇళ్ల వద్దనే పింఛన్‌ పంపిణీ : కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 28: జిల్లాలోని లబ్ధిదారులు తమ పింఛన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని, ఇండ్లకే వచ్చి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ జి. సృజన అన్నారు. ఆదివారం సామాజిక భద్రత పింఛన్‌ పంపిణీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ అజయ్‌ జైన్‌ పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశి భూషణ్‌ కుమార్‌ సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లోని పింఛనుదారులు పింఛన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, అశక్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, మంచానికే పరిమితమైన వారు, వీల్‌చైర్‌లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్‌ పొందుతున్న వితంతువులకు సచివాలయ సిబ్బంది నేరుగా ఇండ్లకే వచ్చి పింఛన్‌ పంపిణీ చేస్తారని తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఎవరి ఖాతాలకైనా సాంకేతిక లోపం ఉన్నవారి ఇండ్లకు కూడా వచ్చి పింఛన్‌ పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సలీంబాషా పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:19 AM