Share News

Balakrishna: ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:04 AM

కర్నూలు: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.

Balakrishna: ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర

కర్నూలు: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA), ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర (Swarnandra Sakara Yatra) చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో (Road Show), బహిరంగ సభ (Sabha) నిర్వహిస్తారు. కర్నూలులో రాత్రి బస చేస్తారు. మంగళవారం ఎమ్మిగనూరు, మంత్రాలయంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.


కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేపట్టిన రోడ్‌ షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులు పడుతూ.. బాణసంచా పేలుస్తూ .. జై బాలయ్యా అంటూ కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. ఇక బహిరంగ సభలకైతే జనం పోటెత్తారు. రెండో రోజు ఆదివారం శింగనమల, అనంతపురం అర్బన నియోజకవర్గాల్లో బాలయ్య స్వర్ణాంధ్ర సాకార యాత్ర సాగింది. అనంతపురం నగరం సప్తగిరి సర్కిల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూటమి అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌తో కలిసి బాలకృష్ణ మాట్లాడుతూ... నందమూరి తారకరామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీతర్వాత వచ్చిన ప్రభుత్వాలు తూచాతప్పకుండా అమలు చేశాయన్నారు. పేరు మార్చారే తప్పా ఏ పథకాన్ని ఆపలేదన్నారు. రెండు రూపాయిలకే కిలో బియ్యం, భూమి శిస్తు, చేనేత వస్ర్తాలు ఇలా అనేక సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తీసుకొచ్చారని గుర్తు చేశారు. అభినవ అంబేడ్కరుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యతకు సంబంధించిన విషయం అనేది ప్రజలు గమనించాలన్నారు. దోచుకొని దాచుకోవడమే జగనకు తెలిసిన అరాచకమన్నారు. దొంగకు తాళం ఇచ్చినా.. జగనకు అధికారం ఇచ్చినా ఒక్కటేనని అన్నారు. రూ.1600 కోట్ల ప్రజాధనంతో రాష్ట్రమంతా సిద్ధం హోర్డింగ్‌లు పెట్టిన జగన దేనికి సిద్ధమని ఆయన ప్రశ్నించారు. చెల్లికి ద్రోహం చేయడానికా..? బాబాయ్‌ని చంపించడానికా..? తల్లిని మోసం చేయడానికా..? అని ప్రశ్నించారు. వైసీపీ గూండాలు తన అక్కపై అత్యాచారం చేశారని ఓ బాలుడు ప్రశిస్తే పెట్రోలు పోసి చంపడానికి సిద్ధపడిన దుర్మార్గులు అన్నారు. ఐదేళ్ల జగన పాలనలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఆ మేరకు యువతకు సమాఽధానం చెప్పడానికి నీవు సిద్ధమా జగన అని సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన నిధులు ఏమయ్యాయో చెప్పేందుకు సిద్ధమా అని నిలదీశారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేస్తే అడిగే నాథుడే లేడన్నారు. కొవిడ్‌లో అక్రమాలు ప్రశ్నించిన దళిత డాక్టర్‌ సుధాకర్‌కు శిరోముండనం చేసి చంపేసిన దుర్మార్గులు వైసీపీ నాయకులని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రపంచ పటంలో ఉండేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి కావాలో..? అరాచకం కావాలో ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన రాక్షస రాజ్యం కావాలో..? చంద్రబాబు రామరాజ్యం కావాలో మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.


అనంత నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తాం

ఎమ్మెల్యే అనంత కుటుంబం ఆరు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిందని, ఇక్కడ ఏం అభివృద్ధి సాధించారని బాలకృష్ణ ప్రశ్నించారు. నగరం అభివృద్ది కావాలంటే కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అనంతపురం నగరాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. అనంత నగరశివారులోని డంపింగ్‌ యార్డును వేరే ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. అనంత నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటుతో మట్టికరిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 07:26 AM