Share News

తెలంగాణ మద్యం కేసులో మరో ట్విస్టు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:15 AM

: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆత్మకూరుకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన కేసులో మరో ట్విస్టు వెలుగుచూసింది.

తెలంగాణ మద్యం కేసులో మరో ట్విస్టు

ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరు వైసీపీ నాయకుల పేర్లు ?

ఆత్మకూరు, ఏప్రిల్‌ 28: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆత్మకూరుకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన కేసులో మరో ట్విస్టు వెలుగుచూసింది. శనివారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి ఓ వాహనంలో భారీగా మద్యాన్ని ఆత్మకూరు తీసుకొస్తుండగా కొత్తపల్లి పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రూ.5.6 లక్షల విలువ గల 91కేసుల (4368 క్వార్టర్ల) మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తొలుత వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో కొత్తపల్లి మాజీ జడ్పీటీసీ పురుషోత్తంరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బామ్మర్ది మండ్లెం ప్రతాపరెడ్డి సూత్రధారులని టీడీపీ లీగల్‌ ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ వీరి పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచారు. వారి పేర్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్పీ రఘువీర్‌రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు అసలైన నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని ఆదేశించడంతో వారిద్దరి పేర్లను కూడా చేర్చినట్లు తెలిసింది. సంగమేశ్వరంలో పట్టుబడిన తెలంగాణ మద్యం విషయంలో పోలీసుల గోప్యత పాటించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారమంతా పోలీసు అధికారులకు తెలిసే జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే తెలంగాణలోని అమరగిరి నుంచి కృష్ణానది మీదుగా ఆత్మకూరుకు రూ.22 లక్షల విలువ మద్యాన్ని తీసుకొచ్చి నిల్వ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు, మూడు లోడ్‌ల తెలంగాణ మద్యం ఆత్మకూరుకు చేరినట్లు తెలిసింది.

Updated Date - Apr 29 , 2024 | 12:15 AM