Share News

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలు: గౌరు చరిత

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:58 PM

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ఆరోపించారు.

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలు: గౌరు చరిత
కందికాయపల్లిలో ప్రచారంలో పాల్గొన్న గౌరు చరిత

పాణ్యం, ఏప్రిల్‌ 28: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ఆరోపించారు. మండలంలోని కొనిదేడు, కందికాయపల్లి, పాణ్యం గ్రామాలలో ఆదివారం నిర్వహించిన టీడీపీ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గానీ, పర్యవేక్షణ గానీ లేకపోవడంతో నిర్వీర్యమైందని అన్నారు. ఆరుసార్లు గెలిచిన నాయకులు పంట కాలువలు, పంట రస్తాల అభివృద్ధికి పాటుపడిందేమీ లేదన్నారు. ఎంత సేపున్నా తన స్వలాభం, తన అనుచరుల దౌర్జన్యాలు చూస్తూ మౌనంగా ఉండడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిందేమీ లేదన్నారు. తన సొంత గ్రామంగా చెప్పుకునే కొనిదేడులో మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఎస్సార్బీసీ పంట కాలువలు శిథిలమైనా పట్టించుకునే నాథుడే లేడన్నారు. పంట కాలువలకు సక్రమంగా నీరు వదలకపోవడంతో ప్రతిసారీ కార్యాలయాల వద్ద నిరసనలు చేయాల్సి వస్తోందన్నారు. గతంలో ఎస్సార్బీసీ భూముల కొనుగోలులో కమీషన్‌ తీసుకొని ప్రజలకు దూరమైనాఇప్పటికీ ఇంకా అవే అక్రమాలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కందికాయపల్లిలో సోలార్‌ పరిశ్రమతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పశువులను వైసీపీ నాయకులు సంరక్షించుకోలేక అమ్ముకోవాల్సిన దుస్థితి తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు సాగు చేసుకొనే రైతులకు సోలార్‌ పరిశ్రమ నష్ట పరిహారం అందించడం లేదన్నారు. పట్టా భూములకు అడ్వాన్సు కింద కొంత పరిహారం ఇచ్చి జాప్యం చేస్తూ భూముల వద్దకు రానీయడం లేదన్నారు. ప్రజల అనుమతి లేకుండానే ప్రభుత్వం కొత్త జీవోలు తెచ్చి దళితుల భూములను లాక్కునే పథకం వేసిందని ఆరోపించారు. వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యా లతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఇటీవల ఓర్వకల్లు మండలం తడకనపల్లెలో ముస్లింలపై దాడులు నిర్వహించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. దళిత వైద్యుడు సుధాకర్‌ను పిచ్చివాడిగా ముద్రవేసి చంపివేశారన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును తన డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని పార్శల్‌ చేశారని, ఇవన్నీ వైసీపీ పాలనకు నిదర్శనమని అన్నారు. ఇటీవల దుర్వేశిలో టీడీపీ కార్యకర్తపై దాడి చేసిగాయపర్చారన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదప్రజల కడుపు కొట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు రూపొందించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. మాజీ జడ్పీటీసీ నారాయణమ్మ, ఎంపీటీసీ రంగరమేష్‌, జయరామిరెడ్డి, రాంపుల్లారెడి, మాజీ ఎంపీటీసీలు రామగోవిందరెడ్డి, నాయకులు తిరుపాలు, నారాయణ, ఈశ్వరయ్య, బాలసుబ్బయ్య, రమణమూర్తి, రామ్మోహన్‌నాయుడు, ఖాదర్‌బాషా, సుభహాన్‌, సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:58 PM