Share News

అలకలు.. బుజ్జగింపులు!

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:27 AM

వనలో పార్టీ నాయకత్వం ఉంది. పని చేసిన చోట సీటు ఇవ్వకపోవడంతో దూరంగా ఉంటున్నారు సీనియర్లు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. విజయవాడలోని ఆంధ్రత్న భవన్‌ రాష్ట్ర విభజన తర్వాత కొద్దిరోజులుగా కళకళలాడుతోంది.

అలకలు.. బుజ్జగింపులు!

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఉన్న కొద్దిమంది నేతలను కాపాడుకుంటే చాలు అన్న భావనలో పార్టీ నాయకత్వం ఉంది. పని చేసిన చోట సీటు ఇవ్వకపోవడంతో దూరంగా ఉంటున్నారు సీనియర్లు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. విజయవాడలోని ఆంధ్రత్న భవన్‌ రాష్ట్ర విభజన తర్వాత కొద్దిరోజులుగా కళకళలాడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి కనిపించింది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సందడి వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తల రాకపోకలతో కొత్త పరిణామం ఆంధ్రరత్న భవన్‌లో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ఖరారు చేసిన సీట్లు కొంతమందికి సంతృప్తిని, మరికొంతమందికి అసంతృప్తిని కలిగిస్తున్నాయి. సీట్లు ఆశించిన సీనియర్లకు ఈసారి భంగపాటు తప్పలేదు. అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పైకి చెబుతున్నా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మనం చేసేది ఏముందిలే అన్న భావన సీనియర్లలో కనిపిస్తోంది.

పీసీసీ తీరుతో పెరుగుతున్న దూరం

ఇండియా కూటమి కాంగ్రె్‌సతోపాటు వామపక్షాలు ఉన్నాయి. దీనితో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లను వామపక్షాలకు కేటాయించాల్సి వచ్చింది. విజయవాడలో పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలతోపాటు కృష్ణా జిల్లాలో గన్నవరం సీటును వామపక్షాలకు కేటాయించారు. వామపక్షాలకు సీట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో సీనియర్లు పోటీ చేయాలని భావించారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో వారికి అవకాశం దక్కలేదు. విజయవాడ ఎంపీ సీటు కోసం ఐదారుగురు పోటీపడ్డారు. అధిష్టానం సీటును వల్లూరి భార్గవ్‌కు కేటాయించింది. పార్టీలో కీలకంగా పనిచేస్తున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావు, ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌కు అవకాశం దక్కలేదు. ఇందులో బొర్రా కిరణ్‌ను మైలవరం అభ్యర్థిగా ఎంపిక చేశారు. సుంకర పద్మశ్రీని విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించింది. పేరును ప్రకటించినప్పటికీ పోటీకి ఆమె దూరంగా ఉన్నారు. నరసింహరరావు పేరును అటు అసెంబ్లీకి గానీ, ఇటు పార్లమెంటుకు గానీ పరిశీలనలోకి తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిస్థితిని పీసీసీకి వివరించాలని సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ ప్రతినిధులు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల తర్వాత సుంకర పద్మశ్రీ పార్టీ కార్యాలయం వైపు చూడడం మానేశారు. ఆమె అభిప్రాయాలను ఎక్స్‌ వేదికగా పంచుకుంటున్నారు. కొంతమంది పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ‘తూర్పు’ ఇన్‌చార్జిగా బ్రహ్మం

తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా కాంగ్రెస్‌ పార్టీ నడిపల్లి బ్రహ్మంను నియమించింది. తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుంకర పద్మశ్రీ నిరాకరించడంతో నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావు పేరును పరిగణనలోకి తీసుకుంటారని భావించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పొనుగుపూటి నాంచరయ్యను తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశాలను పరిశీలించి తొలుత కమ్మ సామాజికవర్గానికి చెందిన పద్మశ్రీకి అవకాశం ఇచ్చారు. కాపు ఓటర్లను దృష్టిలో పెట్టుకుని నరసింహరావును ప్రకటిస్తారని భావించారు. పార్టీ మాత్రం ఇక్కడ బీసీ కార్డును ప్రయోగించింది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన నాంచారయ్య బీసీ సామాజికవర్గానికి చెందినవారు. పైగా ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే నాంచారయ్య వైపు పార్టీ మొగ్గుచూపిందని తెలుస్తోంది.

Updated Date - Apr 29 , 2024 | 12:27 AM