Share News

ఊకదంపుడు ఉపన్యాసం

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:29 AM

మేమంతా సిద్ధం అంటూ గుడివాడలో సోమవారం ఏర్పాటు చేసిన సభ మొత్తం ఊకదంపుడు ఉపన్యాసానికే పరిమితమైంది. సీఎం జగన్‌ సుమారు గంటపాటు మాట్లాడినా ఈ ఐదేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్క ముక్క చెప్పలేకపోయారు. కనీసం గుడివాడ నియోజకవర్గానికి ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పకుండా పేలవంగా ఆయన ప్రసంగం సాగింది. కేవలం పథకాలను వల్లె వేయడం.. సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం.. చంద్రబాబు, పవన్‌ను తిట్టడానికే ఈయన ప్రసంగంలో అధికభాగం సరిపోయింది.

ఊకదంపుడు ఉపన్యాసం

సెల్ఫ్‌ డబ్బా వేదికగా సిద్ధం సభ

జిల్లాకు కానీ, గుడివాడకు కానీ హామీలు నిల్‌

సీఎం ప్రసంగం మొదలుకాక ముందే జనాలు పరార్‌

5 ఎకరాల్లో సభ ఏర్పాట్లు.. 10వేలలోపు జనం

తుస్సుమన్న రోడ్‌షో.. వచ్చింది బస్సులో... వెళ్లింది కాన్వాయ్‌లో

మేమంతా సిద్ధం అంటూ గుడివాడలో సోమవారం ఏర్పాటు చేసిన సభ మొత్తం ఊకదంపుడు ఉపన్యాసానికే పరిమితమైంది. సీఎం జగన్‌ సుమారు గంటపాటు మాట్లాడినా ఈ ఐదేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్క ముక్క చెప్పలేకపోయారు. కనీసం గుడివాడ నియోజకవర్గానికి ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పకుండా పేలవంగా ఆయన ప్రసంగం సాగింది. కేవలం పథకాలను వల్లె వేయడం.. సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం.. చంద్రబాబు, పవన్‌ను తిట్టడానికే ఈయన ప్రసంగంలో అధికభాగం సరిపోయింది.

గుడివాడ, ఏప్రిల్‌ 15 : సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలు వల్లెవేయడం.. అసందర్భ వ్యాఖ్యలు చేయడంతో జగన్‌ ప్రసంగం పట్ల వైసీపీ శ్రేణుల్లోనే విముఖత వ్యక్తమయ్యేలా చేసింది. ఎన్నికల వేళ సాధారణంగా జిల్లాలో స్థానిక నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి చెప్పడం ఏ పార్టీ నాయకుడికైనా ఆనవాయితీ. అలాగే తాము అధికారంలోకి వస్తే జిల్లాలో ఫలాన అభివృద్ధి పనులు చేస్తామనో.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనో కూడా నాయకులు హామీ ఇస్తుంటారు. ఇలాంటివేవీ జగన్‌ ప్రసంగంలో కానరాలేదు. ఎప్పటిలాగే ఊకదంపుడు ఉపన్యాసంతో బోరు కొట్టించారు. విచిత్ర విన్యాసాలు, వింతైన హావభావాలతో ఆకట్టుకోవాలన్న ఆయన ప్రయత్నం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు.

సభాప్రాంగణం వెలవెల

మేమంతా సిద్ధం సభ సక్సెస్‌ కాలేదన్నది వైసీపీ శ్రేణుల నుంచే వస్తున్న మాట. లక్షమందితో ఎన్నడూ జరగని విధంగా సిద్ధం సభను నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం జన సమీకరణలో విఫలమయ్యారు. స్థానిక నాగవరప్పాడులోని ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా 5 ఎకరాల్లో సిద్ధం సభను నిర్వహించారు. అందులో సీఎం వాహనాలు, పోలీసుల వాహనాల పార్కింగ్‌, వేదిక, జగన్‌ ర్యాంప్‌వాక్‌ స్థలం పోను మిగిలిన 3 ఎకరాల్లో ప్రజల కోసం ఏర్పాట్లు చేశారు. ఇరుకుగా ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుని లక్షలాది మంది వచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి జనాలను తరలించేందుకు ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు. పామర్రులో పెట్టిన ఆర్టీసీ బస్సులు నిండక ఖాళీగా ఉండిపోవడం గమనార్హం. 10 వేలలోపు జనాలు మాత్రమే సిద్ధం సభకు హాజరయ్యారని ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారం. జగన్‌ రాకముందు నుంచే సభాప్రాంగణంలోకి రావాలని ప్రజలను, వైసీపీ కార్యకర్తలను నాయకులు వేడుకుంటూనే ఉన్నారు. అయినా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్‌ వచ్చి మైకు అందుకునే సమయానికి ప్రాంగణంలో ఉన్న సగం మంది వెనుదిరిగారు. ఇతర ప్రాంతాల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే జనాన్ని తీసుకొచ్చారు. ఎండ వేడిమి తట్టుకోలేక వారు నానా అగచాట్లు పడ్డారు. బస్సుల్లో తీసుకొచ్చి వదిలేశారంటూ నాయకులపై పలువురు ఆగ్రహించడం కనిపించింది. సభకు ముందు నిర్వహించిన రోడ్‌షోలో జనాలే కనిపించలేదు. దీంతో సభ ముగిసిన తర్వాత రోడ్‌షోకు స్వస్తి చెప్పి కాన్వాయ్‌లో జగన్‌ వెళ్లిపోయారు.

Updated Date - Apr 16 , 2024 | 01:29 AM