Share News

ఆపషోపాలు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:28 AM

సీఎం జగన్‌ బస్సుయాత్ర జనానికి నరకయాతన చూపిస్తోంది. అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడం, వాహనాల రాకపోకలను నిలిపివేయడం, దారిపొడవునా కరెంటు కట్‌ చేయడం లాంటి విన్యాసాలతో జనానికి చుక్కలు చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో సోమవారం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ దిగ్బంధనాల మధ్య జగన్‌ రోడ్డు ‘షో’ జరిగింది. జాతీయ రహదారిపై రెండో వైపున ట్రాఫిక్‌ వెళ్లటానికి అవకాశమున్నా.. వాహనాలను ముందుకు సాగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. ఆగిపోయిన ట్రాఫిక్‌ వాహనాలు, తరలించిన జనాల కలయికతో.. రోడ్డు ‘షో’ను రక్తికట్టించాలని చూశారు. ఎన్‌హెచ్‌-16పై కేసరపల్లి నుంచి ఎన్‌హెచ్‌-216పై గుడివాడ వరకు ట్రాఫిక్‌ ఆపేసి బస్సు యాత్రను కొనసాగించారు. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ కష్టాలు ఏర్పడ్డాయి.

ఆపషోపాలు!

జగన్‌ రోడ్డు షోతో జనానికి షాక్‌

దారి పొడవునా ట్రాఫిక్‌ నిలిపివేత

రోడ్డుకు ఒకవైపు బస్సుయాత్ర అయితే.. రెండోవైపు వాహనాలకు ఆటంకాలు

బస్సుయాత్రకు హైప్‌ తెచ్చేందుకే ఈ తంటాలు

ఎన్‌హెచ్‌ - 16, ఎన్‌హెచ్‌ - 216 హెచ్‌లపై యాత్ర పొడవునా ఇదే షో

మూడు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు, ప్రయాణికులు

అడ్డొస్తున్నాయన్న పేరుతో సర్వీసు వైర్లు కత్తిరింపు

జగన్‌ యాత్ర వెళ్లే గ్రామాల్లో కరెంట్‌ కోతలు

సీఎం జగన్‌ బస్సుయాత్ర జనానికి నరకయాతన చూపిస్తోంది. అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడం, వాహనాల రాకపోకలను నిలిపివేయడం, దారిపొడవునా కరెంటు కట్‌ చేయడం లాంటి విన్యాసాలతో జనానికి చుక్కలు చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో సోమవారం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ దిగ్బంధనాల మధ్య జగన్‌ రోడ్డు ‘షో’ జరిగింది. జాతీయ రహదారిపై రెండో వైపున ట్రాఫిక్‌ వెళ్లటానికి అవకాశమున్నా.. వాహనాలను ముందుకు సాగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. ఆగిపోయిన ట్రాఫిక్‌ వాహనాలు, తరలించిన జనాల కలయికతో.. రోడ్డు ‘షో’ను రక్తికట్టించాలని చూశారు. ఎన్‌హెచ్‌-16పై కేసరపల్లి నుంచి ఎన్‌హెచ్‌-216పై గుడివాడ వరకు ట్రాఫిక్‌ ఆపేసి బస్సు యాత్రను కొనసాగించారు. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ కష్టాలు ఏర్పడ్డాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం/ ఉంగుటూరు/హనుమాన్‌జంక్షన్‌/జంక్షన్‌ రూరల్‌) : దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారుల్లో ఒకటైన ఎన్‌హెచ్‌ - 16 అనేది కోల్‌కతా - చెన్నయ్‌ ప్రఽధాన రోడ్డు మార్గం. ఈ మార్గంలో జగన్‌ బస్సుయాత్ర పేరుతో రోడ్డు షో సాగటం అంటే ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడటమే. బస్సుయాత్ర ఒకవైపు సాగుతుంటే.. రెండో వైపున ట్రాఫిక్‌ను నిలిపివేశారు. బస్సుయాత్రకు హైప్‌ తీసుకురావటం కోసమే ఈ రకంగా ట్రాఫిక్‌ ఆపేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ ఆగిపోవటంతో ఆగిపోయిన బస్సులు, లారీలపై జెండాలు పట్టుకున్న కార్యకర్తలను ఎక్కించి హడావిడి చేయించారు. బస్సుయాత్ర పొడవునా ఈ కార్యక్రమమే నడిచింది. దీంతో ఇదేదో భారీస్థాయిలో జరుగుతున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చినట్టు అయింది. ముఖ్యమంత్రి జగన్‌ పది గంటలకు కేసరపల్లిలోని బస ప్రదేశం నుంచి బయటకు వస్తారన్నది షెడ్యూల్‌ అయితే, 9 గంటల నుంచే పోలీసులు రామవర ప్పాడు నుంచి బ్లాక్‌ చేస్తూ వచ్చారు. జగన్‌ బయటకు వచ్చే సమయంలో ఎడమవైపున ఒక్కసారిగా వదిలేశారు. కాన్వాయ్‌ బయటకు వచ్చేటపుడు మళ్లీ ట్రాఫిక్‌ ఆపేశారు. ముందు వెళ్లిన వాహనాలన్నీ గన్నవరంలో చిక్కుకుపో యాయి. గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై ఉండటంతో.. వాహనాలు ముందుకు సాగలేదు. ఒకర కమైన వాతావరణాన్ని సృష్టించారు. దాదాపుగా గంటపాటు ఈ హడావిడి కనిపించింది. ఈలోపు విజయవాడ నుంచి తరలించిన జనాలు రావటంతో.. అప్పటికి కానీ ట్రాఫిక్‌ను వదల్లేదు. జగన్‌ వెళ్లే లేనులో కూడా అంచెలంచెలుగా ట్రాఫిక్‌ ఆపుతూ, పంపిస్తూ మేనేజ్‌మెంట్‌ చేశారు. రెండోవైపు అయితే పూర్తిగా ఆపేశారు. రెండో వైపున వాహనాలు బ్లాక్‌ కావటంతో బస్సులు, కార్లలో ఉన్న ప్రయాణికులు దిగి పోలీసులతో వాగ్వివాదాలకు దిగారు. దీంతో పోలీసులు నిదానంగా వెళ్లటానికి అవకాశం కల్పించారు.

ట్రాఫిక్‌ సమస్యతో రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారికి రెండోవైపున కార్యకర్తలను నిలువరిం చకపోవటం వల్ల ప్రమాదం కూడా జరిగింది. గన్నవరం గాంధీచౌక్‌లో వీనస్‌ సెంటర్‌ ఎదురుగా బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు టైరు కింద ద్విచక్రవాహనం పడిపోయింది. అదృష్టవశాత్తూ బైక్‌ను నడుపుతున్న వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డాడు.

చిన్న అవుటపల్లి నుంచి బస్సుయాత్రను సర్వీసు రోడ్డుకు తీసుకున్నా.. హైవేపై వెళ్లే వాహనాలకు అడుగుడుగునా అవాంతరాలు కల్పించారు.

కరెంట్‌ కట్‌.. గ్రామాలు విలవిల

జగన్‌ బస్సుయాత్ర మొదలైన దగ్గర్నుంచి ఆయన రూట్‌ వెంబడి విద్యుత్‌ను నిలిపివేశారు. బస్సుయాత్ర సాగినంత వరకు కూడా ఆయా గ్రామాల్లో విద్యుత్‌ను నిలుపుదల చేశారు. అసలే ఎండాకాలం కావటంతో గ్రామాల్లోని ప్రజలు విద్యుత్‌ కోతలతో అలమటించారు. ఇంట్లో ఉన్నా విద్యుత్‌ లేకపోవటం వల్ల ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక వేడి తాపాన్ని అనుభవించలేక నానా ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో విద్యుత్‌ సర్వీసు వైర్లు అడ్డుగా ఉన్నాయని.. విద్యుత్‌ శాఖ అధికారులు కనెక్షన్‌ వైర్లను కట్‌ చేశారు. ఈ కారణంగా సాయంత్రం వరకు కూడా కొందరికి కరెంట్‌ కష్టాలు ఏర్పడ్డాయి. బస్సు యాత్ర వెళ్లిపోయిన తర్వాత లైన్‌మెన్‌ను పిలిపించుకుని సర్వీసు వైర్లను బాగు చేయించుకోవాల్సి వచ్చింది.

విమానాశ్రయ నిర్వాసితులను కలవటానికి ముఖం చాటేసిన సీఎం

విమానాశ్రయ నిర్వాసితులతో భేటీ ఏర్పాటు చేసినా.. వారిని సీఎం కలవలేదు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి కోసం ఇళ్లను కోల్పోయిన వారికి ఐదేళ్లు అయినా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. అద్దె డబ్బులు చెల్లించలేదు. వీటికి సంబంధించి రెండుసార్లు ఉత్తుత్తి జీఓలు ఇచ్చి సరిపెట్టారు. జీఓలను అమలు చేస్తే సమస్య పరిష్కారమౌతుంది. జీఓను అమలు చేయకుండా.. నిర్వాసితులను మభ్యపెట్టడానికి వారితో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం రావటంతో వారితో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపించలేదు. నిర్వాసితులను పిలిచినా.. వారితో మాట్లాడలేదు. షెడ్యూల్‌ లేటు అయిందన్న కారణంతో భేటీ వీలుపడలేదని, వారి దగ్గర నుంచి వినతిపత్రాలను తీసుకుని సరిపెట్టారు.

Updated Date - Apr 16 , 2024 | 01:28 AM