Share News

ఉల్లంఘనలు గుర్తించండి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:24 AM

జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు విజయవంతం కావాలంటే.. మైక్రో అబ్జర్వర్ల విధులు అత్యంత కీలకమని ఎన్టీఆర్‌ జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు మంజూ రాజ్‌పాల్‌, నరీంద్రర్‌ సింగ్‌ బాలిలు అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల సేవలు అత్యంత కీలకమన్నారు.

ఉల్లంఘనలు గుర్తించండి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు విజయవంతం కావాలంటే.. మైక్రో అబ్జర్వర్ల విధులు అత్యంత కీలకమని ఎన్టీఆర్‌ జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు మంజూ రాజ్‌పాల్‌, నరీంద్రర్‌ సింగ్‌ బాలిలు అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల సేవలు అత్యంత కీలకమన్నారు. సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు) ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు.. నిబద్ధత, నిస్పక్షపాతంగా నిర్వహిస్తేనే ఎన్నికలను విజయవంతం చేయగలమని చెప్పారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావుతో పాటు జిల్లా సాధారణ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తు.చ తప్పకుండా అమలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారు. శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రతి అంశంపైనా దృష్టి కేంద్రీకరించాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియలో గుర్తించిన సమస్యాత్మక ఉల్లంఘనలను తక్షణం తమ దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. ప్రతి అంశాన్ని రిపోర్టింగ్‌ చేయాలని నిర్దేశించారు. మాక్‌ పోలింగ్‌ సందర్భంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్‌ పార్టీ, పోలింగ్‌ ఏజంట్లు, పోలింగ్‌ భద్రతా సిబ్బంది తదితరాలకు సంబంధించి నిశిత పరిశీలన జరపాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 878 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 632 మంది మైక్రో ఆబ్జర్వర్లను నియమించటం జరిగిందన్నారు. మాక్‌ పోలింగ్‌, పోలింగ్‌ మెటీరియల్‌, పోలింగ్‌ పార్టీ, ఏజంట్లు, సీక్రెసీ ఆఫ్‌ ఓటింగ్‌ (సీఓఓ), పోలింగ్‌ స్టేషన్‌ లే అవుట్‌, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, 17ఏ రిజిస్టర్‌, ఓటింగ్‌ మెషీన్‌ సీలింగ్‌ తదితర అంశాలలో మైక్రో అబ్జర్వర్లు కీలక ంగా వ్యవహరించాలన్నారు. హోమ్‌ ఓటింగ్‌లో ఎలాంటి అంశాలను పరిశీలించాలన్న దానిపై పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడతానని, స్వేచ్చాయుతంగా ఎన్నికలు జరిగేందుకు దోహదపడతానని, నిస్పక్షపాతంగా పనిచేస్తానని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేస్తానని, ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మైక్రో ఆబ్జర్వర్లతో దిల్లీరావు ప్రతిజ్ఞ చేయించారు.

ఈవీఎంలపై ప్రత్యేక శిక్షణ

మైక్రో అబ్జర్వర్లకు ఈవీఎంలపై ప్రత్యేకంగా శిక్షణ కల్పించారు. ఈవీఎంలో కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలట్‌ యూనిట్లను ఎలా అనుసంధానం చేస్తారు? వీవీ ప్యాట్‌ ఎలా పనిచేస్తుంది. ఈవీఎంకు, వీవీ ప్యాట్‌ ఎలా అనుసంధానం చేయాలి అన్నదానిపై శిక్షణ ఇచ్చారు. మాక్‌ పోలింగ్‌ నిర్వహణ, అనంతరం దాని డేటాను క్లియర్‌ చేసిందీ లేనిదీ పరిశీలించటం, ఖచ్చితంగా సీల్‌ వేసిందీ లేనిదీ తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ కల్పించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:24 AM