Share News

AP Election 2024: ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:56 AM

‘రండి బాబూ రండి.. సొంత పార్టీ నాయకులైతేనేం.. పార్టీ మారి పక్క పార్టీలోకి పోయినవారైతేనేం.. ఓటు అమ్ముకునేవారైతేనేం.. ఆఫర్‌ ఓకే చేయండి.. మొదటి విడతగా అడిగినంత అందుకోండి.. రెండు విడతలో మరోసారి జేబు నింపుకోండి..’ రెండు జిల్లాల్లో వైసీపీ నాయకులు బహిరంగంగానే పెడుతున్న బేరాలివి. సాధారణంగా ఎన్నికల ముందు డబ్బు పంపిణీ జరుగుతుంటుంది. గెలుపు మీద ఆశలు వదులుకున్నారో లేక ఇక లాభం లేదు అనుకున్నారో పక్కా ప్రణాళికతో విడతలవారీగా ఇప్పటి నుంచే రూ.కోట్లు వెదజల్లేస్తున్నారు.

AP Election 2024: ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

వైసీపీ తొలి విడత డబ్బు పంపిణీకి సన్నాహాలు

రూ.1,500 నుంచి రూ.2 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు

ప్రత్యర్థి ఇచ్చే దాన్నిబట్టి రెండో విడతలో మరోసారి..

కొన్నిచోట్ల టీడీపీ ద్వితీయశ్రేణి నేతలను కొనే ప్రయత్నాలు

మరికొన్నిచోట్ల టీడీపీలోకి వెళ్లిన సొంతవారిపై గురి

రూ.లక్షల్లో రేట్లు కట్టి తెరవెనుక బేరసారాలు

ఒక్కసారిగా రూ.7 వేలకు పెరిగిన ఓటు రేటు

‘రండి బాబూ రండి.. సొంత పార్టీ నాయకులైతేనేం.. పార్టీ మారి పక్క పార్టీలోకి పోయినవారైతేనేం.. ఓటు అమ్ముకునేవారైతేనేం.. ఆఫర్‌ ఓకే చేయండి.. మొదటి విడతగా అడిగినంత అందుకోండి.. రెండు విడతలో మరోసారి జేబు నింపుకోండి..’ రెండు జిల్లాల్లో వైసీపీ నాయకులు బహిరంగంగానే పెడుతున్న బేరాలివి. సాధారణంగా ఎన్నికల ముందు డబ్బు పంపిణీ జరుగుతుంటుంది. గెలుపు మీద ఆశలు వదులుకున్నారో లేక ఇక లాభం లేదు అనుకున్నారో పక్కా ప్రణాళికతో విడతలవారీగా ఇప్పటి నుంచే రూ.కోట్లు వెదజల్లేస్తున్నారు.


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : వాస్తవానికి ఎన్నికల ప్రచారం ముగిశాక నగదు పంపిణీపై అన్ని పార్టీలు దృష్టిసారిస్తాయి. కానీ, వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే తొలి విడత నగదు పంపిణీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూట మికి, వైసీపీకి నడుమ పోటాపోటీగా ఉన్న స్థానాల్లో తొలి విడతగా ఒక్కో ఓటరుకు రూ.1,500 నుంచి రూ.2 వేలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి మొదలుపెట్టి నాలుగైదు రోజుల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. రెండో విడత నగదు ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈసారి ఓటు రేటు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైసీపీ నేతల బరితెగింపుతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు రేటు రూ.7 వేల పైచిలుకు పలికేలా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మైలవరం, గన్నవరం, గుడివాడ, విజయ వాడ తూర్పు అసెంబ్లీ స్థానాల్లో అయితే ప్రలోభాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇక్కడ నగదుతో పాటు అదనంగా గిఫ్ట్‌ కూపన్లు, చిన్నపాటి బంగారు, వెండి ఆభరణాలు, కుంకుమ భరిణెలు పంచేందుకు వైసీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. మైలవరంలో ఓటుకు రూ.4 వేల వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Untitled-2.jpg

ద్వితీయ శ్రేణి నాయకులపై కన్ను

టీడీపీలో గ్రామ, డివిజన్‌ స్థాయిలో బలమైన నాయ కులకు వైసీపీ నేతలు ఎర వేస్తున్నారు. విజయవాడ తూర్పు, సెంట్రల్‌, మచిలీపట్నం, గన్నవరం, గుడివాడ, మైలవరం, పెడన నియోజకవర్గాల్లో ఈ తరహా తతంగం జరుగుతోంది. పెడనలో వైసీపీ అభ్యర్థి టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి రహస్యంగా సమవేశమవుతున్నారు. ఈ ఎన్నికల వరకు తటస్థంగా ఉండాలని, వారిని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. గన్నవరంలో అయితే, చిత్రమైన పరిస్థితి నెలకొంది. వైసీపీ క్యాడర్‌ గంపగుత్తగా టీడీపీలో చేరుతుండటంతో దిక్కుతోచక సొంత పార్టీ నాయకులకే భారీ ఎత్తున ఆఫర్లు ఇస్తున్నారు.

మచిలీపట్నంలో వంద ఓట్లు ఉన్న నాయకుడి రేటు రూ.10 లక్షలు పలుకుతోంది. విజయవాడ నగరంలో ప్రలోభాలు కాస్త ఖరీదుగా ఉంటున్నాయి. డివిజన్‌ స్థాయి నాయకులు తటస్థంగా ఉంటే.. వారికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ‘ఎన్నికలకు వారం రోజుల వరకు మీ పార్టీ అభ్యర్థితోనే తిరగండి. కానీ పోలింగ్‌కు ఇంకో వారం ఉందనగా, మీరు ఇంటి గడప దాటకూడదు. మీ తరఫున ఎన్ని ఓట్లు ఉంటే ఓటుకు రూ.10 వేల చొప్పున ఇస్తాం’ అని విజయవాడ నగరంలోని పలువురు టీడీపీ నాయకులకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ప్రలోభాలు చాటుతున్నాయని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు టీడీపీలో కాస్త బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. కాసులు ఎరవేసి లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ డివిజన్‌ స్థాయి నాయకుడికి రూ.10 లక్షలు ఎర వేయడంతో పాటు ఎన్నికల అనంతరం వీఎంసీలో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ ఆఫర్‌ను సదరు నాయకుడు తిరస్కరించారు. పెనమలూరులో ఓ బీసీ నాయకుడిని లోబర్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. వాస్తవానికి సదరు నాయకుడికి అంత సీన్‌ లేదని, కానీ బీసీ నాయకులు టీడీపీని ఖాళీ చేసేస్తున్నారనే ప్రచారానికి పనికొస్తుందని ఆ నాయకుడిని కట్టలతో కొన్నట్టు తెలుస్తోంది.

డబ్బు అందలేదని ప్రచారం బాయ్‌కాట్‌

విపక్షాలకు చెందిన నాయకుల కొనుగోలుతో పాటు సొంత పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలకూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నగదు ఖర్చు చేస్తున్నారు. ఒక్కరోజు ప్రచారానికి వైసీపీ నేతలు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులు.. రోజువారీ ప్రచారం నిర్వహించే కార్యకర్తలకు నామినేషన్ల చివరి రోజైన ఈనెల 25 తర్వాత నుంచి డబ్బు చెల్లింపు నిలిపివేశారు. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు ప్రచారానికి వచ్చేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో రెండు రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రచారంలో జనాలు పలచబడ్డారన్న ప్రచారం జరుగుతోంది.

Updated Date - Apr 29 , 2024 | 06:28 AM