Share News

బస్సుల్లేక.. విలవిల

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:25 AM

ముఖ్యమంత్రి జగన్‌ సేవలో ఆర్టీసీ బస్సులు తరించ టంతో.. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు బస్సులు లేక విలవిల్లాడారు. అత్యవసర పనుల మీద బయటకు రావటం దుర్భరంగా మారింది. ఉద్యోగులు, చిరువ్యాపారులు, ఉపాధి కూలీలు, వసల కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఇలా తమ సొంత ప్రాం తాల నుంచి విజయవాడ రావటం దుర్భరంగా మారింది.

బస్సుల్లేక.. విలవిల

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి గుడివాడ సిద్ధం సభకు 390 బస్సులు

జనాన్ని తరలించటానికి వందల సంఖ్యలో కిరాయికి ఆటోలు

బస్సులతో పాటు ఆటోలు తగినన్ని లేక ప్రయాణికుల ఇక్కట్లు

విజయవాడకు వచ్చే ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ముఖ్యమంత్రి జగన్‌ సేవలో ఆర్టీసీ బస్సులు తరించ టంతో.. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు బస్సులు లేక విలవిల్లాడారు. అత్యవసర పనుల మీద బయటకు రావటం దుర్భరంగా మారింది. ఉద్యోగులు, చిరువ్యాపారులు, ఉపాధి కూలీలు, వసల కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఇలా తమ సొంత ప్రాం తాల నుంచి విజయవాడ రావటం దుర్భరంగా మారింది. ఒక పక్క బస్సుయాత్ర పేరుతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆపివేయటంతో.. వాహనాలు గంటల కొద్దీ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బస్సులూ లేవు. కాస్త ముందే బయటకు వచ్చి పనులు ముగించుకుని వెళదామనుకునేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి విజయవాడ బస్‌స్టేషన్‌కు, రైల్వేస్టేషన్‌కు వచ్చిన వార ంతా సిటీలోకి ప్రవేశించటానికి బస్సులు లేక నానా ఇబ్బందులు పడ్డారు.

ఆటోలు కూడా కరువే

ఆటోలలో అయినా వెళదామనుకుంటే.. ఆటోలకు కూడా కొరత ఏర్పడింది. వందలాది ఆటోలను కూడా వైసీపీ నేతలు అద్దెకు తీసుకున్నారు. ఆటోలలో జనాలను తరలించటం కోసం భారీ సంఖ్యలో వాటిని అద్దెకు తీసుకోవటం వల్ల ఆటోలకు కూడా కొరత ఏర్పడింది. ఆసియాలో రెండో అతిపెద్దదైన పీఎన్‌బీఎస్‌కు రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌ అయిన విజయవాడ రైల్వేస్టేషన్‌కు సగటున 3 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపుగా ఐదు లక్షల మంది వరకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చవేయటానికి అవసరమైన బస్సులు, ఆటోలు లేకపోవటంతో ప్రయాణికులు నానాఅవస్థలు పడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి మొత్తం 240 బస్సులను గుడివాడ సిద్ధం సభలకు పంపారు. ఇవన్నీ కూడా విజయవాడ నగర పరిధిలోని గవర్నర్‌పేట - 1, గవర్నర్‌ పేట - 2, విద్యాధరపురం, ఇబ్రహీపంపట్నం డిపోల పరిధిలో నడిచే సిటీ బస్సులే కావటం గమనార్హం. దాదాపుగా 80 శాతంపైగా సిటీ బస్సులు జగన్‌ సభలకు అద్దెకు ఇచ్చారు. కృష్ణాజిల్లాలో కూడా 150 బస్సులను అద్దెకు ఇచ్చారు. ఈ బస్సులు కూడా గన్నవరం, ఉయ్యూరు, గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం డిపోలకు చెందిన సిటీ బస్సులనే పంపారు. భారీ సంఖ్యలో సిటీ బస్సులను అద్దెకు ఇవ్వటం వల్ల ఎక్కువగా ప్రయాణించే వారిపై ప్రభావం పడింది.

నేడు కూడా బస్సులకు కొరతే

భీమవరంలో జరిగే సిద్ధం సభకు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 390 బస్సులను కేటాయించటం జరిగింది. కాబట్టి మంగళవారం కూడా బస్సులు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ప్రయాణికుల కష్టాలు కొనసాగనున్నాయి. మంగళవారం రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు.

Updated Date - Apr 16 , 2024 | 01:25 AM