Share News

వేగం..ప్రాణాలు తీసింది

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:09 AM

ఆ ఎనిమిది మందీ ప్రాణ స్నేహితులు. వారిలో నలుగురు మైనర్లే. ఒకరికి మాత్రమే వివాహమైంది. ఒకరిది తెల్లవారితే పుట్టినరోజు. ముందుగానే వేడుకలు జరుపుకోవాలని వారంతా ఒకే ఆటోలో యానాం వెళ్లారు. అక్కడే మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి వస్తుండగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ భట్నవిల్లి శ్రీవనువులమ్మ ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న చేపల లోడు లారీని ఢీకొట్టారు.

 వేగం..ప్రాణాలు తీసింది

పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తూ..

భట్నవిల్లిలో లారీని ఢీకొన్న ఆటో

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 29: ఆ ఎనిమిది మందీ ప్రాణ స్నేహితులు. వారిలో నలుగురు మైనర్లే. ఒకరికి మాత్రమే వివాహమైంది. ఒకరిది తెల్లవారితే పుట్టినరోజు. ముందుగానే వేడుకలు జరుపుకోవాలని వారంతా ఒకే ఆటోలో యానాం వెళ్లారు. అక్కడే మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి వస్తుండగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ భట్నవిల్లి శ్రీవనువులమ్మ ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న చేపల లోడు లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికే అటుగా వస్తున్న ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ తన అనుచరులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో కలిసి గాయపడ్డ వారిని హుటాహుటిన అంబులెన్సులో అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తు.. మితిమీరిన వేగం..

మితీమిరిన వేగంతో పాటు మద్యం మత్తు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది. అమలాపురం తాలూకా సీఐ పి.వీరబాబు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...మామిడికుదురు మండలం నగరం గ్రామ శివారు కోటమెరకకు చెందిన కొల్లాబత్తుల జతిన్‌ అలియాస్‌ హ్యాపీ (26) తన మిత్ర బృందంతో కలిసి ఆటోలో ఆదివారం యానాం వెళ్లాడు. సోమవారం జతిన్‌ పుట్టినరోజు కావడంతో ముందుగానే జగ్గన్నపేట సెంటర్‌కు వెళ్లి కొత్త దుస్తులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టాడు. భార్య, కుటుంబ సభ్యులకు బయటకు వెళుతున్నానని చెప్పి వచ్చాడు. తన మిగిలిన ఏడుగురు మిత్రులతో కలిసి ఆటోలో ఒకరోజు ముందుగానే పుట్టినరోజు చేసుకునేందుకు యానాం వెళ్లారు. అక్కడ మద్యం సేవించి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై భట్నవిల్లి వనువులమ్మ గుడి సెంటర్‌కు వచ్చేసరికి ఎదురుగా చేపల లోడుతో కాకినాడ వైపు వెళ్తున్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఆటో డ్రైవింగ్‌ చేస్తున్న కొల్లాబత్తుల జతిన్‌ అలియాస్‌ హ్యాపీ (26), మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (22), నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్‌ (19), పాశర్లపూడి నెల్లివారి మెరకకు చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (22) అక్కడికక్కడే మృతిచెందారు. నగరం గ్రామానికి చెందిన మాదాసు ప్రశాంత్‌కుమార్‌ (16), పెదపట్నంలంక గ్రామానికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), పాశర్లపూడికి చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), మర్లపూడి లోకేష్‌ (17) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అమలాపురం తాలూకా సీఐ పి.వీరబాబు, తాలూకా ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు, అల్లవరం ఎస్‌ఐ జి.హరీష్‌ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే తన సిబ్బందితో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని హుటాహుటిన అంబులెన్సులో అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మాదాసి ప్రశాంత్‌కుమార్‌కు అత్యవసరంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రశాంత్‌కుమార్‌తో పాటు జాలెం శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జతిన్‌ ఎలక్ర్టీషియన్‌ పనులతో పాటు మ్యారేజ్‌ ఈవెంట్లు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆరేళ్ల క్రితం ఆశాదేవితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కుమారుడు ఉన్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లులు గల్ఫ్‌కు..

పేద కుటుంబాలకు శోకం

ప్రమాదంలో మృతి చెందిన నలుగురూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. పిల్లలకు ఆర్థిక భరోసాతో కూడిన మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయా కుటుంబాల్లోని తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. స్థానికంగా పిల్లలను అమ్మమ్మలు సాకుతున్నారు. ఈ ప్రమాద ఘటన ఎక్కడో దూరంగా ఉన్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్‌ డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాస్‌ కూలి పనులు చేస్తుండగా తల్లి రత్నకుమారి ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది. వారికి నవీన్‌ ఒక్కగానొక్క బిడ్డ. అమ్మమ్మ బత్తుల మేరికుమారి నవీన్‌ను సాకుతోంది. ఇక పాశర్లపూడి నెల్లివారి మెరకకు చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ ఇటీవల కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ఏడుకొండలు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి మంగాదేవి పదేళ్లుగా కుటుంబ పోషణ కోసం మస్కట్‌లో ఉంటోంది. నవీన్‌కుమార్‌కు ఒక సోదరుడు ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో బిడ్డ చనిపోయాడని తెలియడంతో ఏడుకొండలు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మానేపల్లి శివారు ఎల్‌ఐసీ కాలనీకి చెందిన వల్లూరి అజయ్‌ ఇంటర్మీడియట్‌ చదివాడు. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, కుమారి గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు. గత నెలలో తల్లి కుమారి ఇంటికి వచ్చి మళ్లీ ఉపాధి కోసం వెళ్లిపోయింది. అజయ్‌ పెద్ద కుమారుడు.

Updated Date - Apr 30 , 2024 | 12:09 AM