Share News

గుర్తుల కేటాయింపులో వివాదం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:14 AM

జనసేన గుర్తు గాజుగ్లాసును పోలిన పెన్‌స్టాండు గుర్తును మరో పార్టీ అభ్యర్థికి కేటాయించేందుకు ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్న గుర్తులు కాకుండా మరో గుర్తు కేటాయించాలంటూ సదరు అభ్యర్థి చేసిన దరఖాస్తును పరిగణలోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది పలు అనుమానాలకు తావిస్తున్నదని జనసేన నేతలు ఆరోపించారు.

గుర్తుల కేటాయింపులో వివాదం

గాజుగ్లాసు పోలిన పెన్‌స్టాండు గుర్తు కేటాయింపునకు ప్రయత్నం

వత్తాసు పలికిన వైసీపీ నేతలు

అభ్యంతరం తెలిపిన జనసేన నేతలు నాగబాబు, అజయ్‌కుమార్‌

చివరకు మరో గుర్తు కేటాయింపు

పిఠాపురం, ఏప్రిల్‌ 29: జనసేన గుర్తు గాజుగ్లాసును పోలిన పెన్‌స్టాండు గుర్తును మరో పార్టీ అభ్యర్థికి కేటాయించేందుకు ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్న గుర్తులు కాకుండా మరో గుర్తు కేటాయించాలంటూ సదరు అభ్యర్థి చేసిన దరఖాస్తును పరిగణలోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది పలు అనుమానాలకు తావిస్తున్నదని జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కాగా సదరు అభ్యర్థికి వైసీపీ నేతలు మద్దతుగా నిలవడం గమనార్హం. చివరకు ఆ అభ్యర్థికి మరో గుర్తు కేటాయించడంతో నాలుగు గంటల పాటు కొనసాగిన వివాదం సద్దుమణిగింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఉన్న 22 మంది అభ్యర్థులకు గానూ 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సోమవారం ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియ అనంతరం గుర్తుల కేటాయింపు ప్రారంభమయింది. గుర్తులు కేటాయిస్తున్న క్రమంలో తెలుగు జనతా పార్టీ తరపున నామినేషన్‌ వేసిన పెద్దింశెట్టి వెంకటేశ్వరరావుకు గాజుగ్లాసు గుర్తును పోలిన పెన్‌స్టాండు గుర్తు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయకుమార్‌ అభ్యంతరం తెలిపారు. అతను నామినేషన్‌ అఫిడవిట్‌తో పాటు బ్యాట్‌, టార్చ్‌లైటు, మైక్‌ గుర్తులు అడిగారని, అందులో పెన్‌స్టాండు లేనప్పుడు ఇప్పుడు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆర్వో రామసుందరరెడ్డి స్పందిస్తూ నామినేషన్‌ దాఖలు సమయంలో పొరపాటున ఆ గుర్తు అడగలేదని, దానిని కేటాయించాలంటూ లెటర్‌ ఇచ్చారని తెలిపారు. అలా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని నాగబాబు ప్రశ్నించారు. పొరపాటు జరిగిందని లేఖ ఇస్తే మొత్తం నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుందని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమయంలో నిబంధనల ప్రకారమే తాము దరఖాస్తు ఇచ్చామని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. అతనికి మద్దతుగా వైసీపీ నేతలు నిలిచారు. దీనితో రిటర్నింగ్‌ అధికారి, ఇతర అధికారులు ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనలను పరిశీలించారు. నామినేషన్‌తో పాటు కోరిన గుర్తుల్లోనే కేటాయించాలని నిబంధనలో ఉన్నందున పెద్దింశెట్టి వెంకటేశ్వరరావుకు మైకు గుర్తు కేటాయిస్తున్నట్లు ఆర్వో తెలపడంతో వివాదం సమసింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ విషయంపై పిఠాపురం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గాజుగ్లాసు గుర్తుతో పోలిన పెన్‌స్టాండు గుర్తును కేటాయించడం ద్వారా పవన్‌కు పడే ఓట్లను చీల్చాలనే కుట్ర జరిగిందనే అనుమానం తమకు ఉందని నాగబాబు, అజయకుమార్‌ తెలిపారు. తాము గట్టిగా ప్రశ్నించడంతో ఆర్వో నిబంధనలు పరిశీలించి మరో గుర్తును కేటాయించారని చెప్పారు. ఇది తమ విజయంగా భావిస్తున్నామని వేములపాటి అజయకుమార్‌ తెలిపారు. వైసీపీ కుట్రలను తాము గమనించి తిప్పికొట్టామని చెప్పారు.

పవన్‌ రోడ్‌షో వాయిదా

చిత్రాడ, గొల్లప్రోలు పట్టణాల్లో మంగళవారం జరగాల్సిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్‌షో వాయిదా పడినట్లు జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఉండవిల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో మంగళవారం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పవన్‌ పాల్గొంటారని చెప్పారు.

Updated Date - Apr 30 , 2024 | 12:14 AM