Share News

మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ ఆవిష్కరించబడాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:08 AM

ప్రపంచంలో మూడవ ఆర్థికశక్తిగా భారత్‌ ఆవిష్కరించబడేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని, దీన్ని ప్రజల ముందుకు తీసుకెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ ఆవిష్కరించబడాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థిని పురందేశ్వరి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 15: ప్రపంచంలో మూడవ ఆర్థికశక్తిగా భారత్‌ ఆవిష్కరించబడేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని, దీన్ని ప్రజల ముందుకు తీసుకెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని లోక్‌సభ ఎన్నికల కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రొడక్టివిటీ పెరగడం వల్లే ఆర్థిక పరిస్థితి 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకున్నామని అన్నారు. సహజంగా పార్టీలోని నాయకులు వేర్వేరు రంగాల్లోని వారితో మాట్లాడి ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తారని, దీనికి భిన్నంగా ప్రజామోదమైన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోకు రాష్ట్రం నుంచి వచ్చిన సూచనలు కూడా కేంద్రానికి పంపించామని తెలిపారు. సురక్షిత భారత్‌, సమృద్ధి భారత్‌ను మేనిఫెస్టోలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారన్నారు. సంకల్ప్‌ పత్ర అని పేరు పెట్టడం ద్వారా వాటిని అమలు చేసే ధృఢ సంకల్పంతో బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. మేనిఫెస్టోను కింది వర్గాల వరకూ తీసుకెళ్లే సంస్థాగతమైన బలం బీజేపీకి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థవంతమైన నాయకత్వం కూడా ఉందన్నారు. మేనిఫెస్టోలో 24 రంగాలు, పది సామాజికపరమైన అంశాలు ఉన్నాయన్నారు. ఈ పది వర్గాలకు సంక్షేమం అందించడం జరుగుతుందన్నారు. మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి దక్కుతాయని ఆమె స్పష్టంచేశారు. రాష్ట్రంలో స్మార్ట్‌ సిటీల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా, వాటిని రాష్ట్రం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 02:08 AM