Share News

సత్యదేవుని కల్యాణోత్సవాలపై సమీక్ష

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:13 AM

అన్నవరం సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆదివారం మధ్యాహ్నం పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన ఈవో రామచంద్రమోహన్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు మే 18న ప్రారంభమై 24 వరకు జరగనుండగా 19 రాత్రి వార్షిక కల్యాణ వేదికపై అంగరంగవైభవంగా సత్యదేవుడి కల్యాణం జరగనుంది.

 సత్యదేవుని కల్యాణోత్సవాలపై సమీక్ష

అన్నవరం, ఏప్రిల్‌ 28: అన్నవరం సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆదివారం మధ్యాహ్నం పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన ఈవో రామచంద్రమోహన్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు మే 18న ప్రారంభమై 24 వరకు జరగనుండగా 19 రాత్రి వార్షిక కల్యాణ వేదికపై అంగరంగవైభవంగా సత్యదేవుడి కల్యాణం జరగనుంది. ముఖ్యంగా 19 రాత్రి జరిగే కల్యాణోత్సవాలపై వివిధ శాఖల అధికారులకు ఆర్డీవో లక్ష్యాలు నిర్దేశించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది కల్యాణాలకు ప్రముఖులు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం లేకపోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. కల్యాణం వీక్షించేందుకు సుమారు 15 వేలమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. కల్యాణ వేదిక ఎదురుగా ప్రత్యేక గ్యాలరీలు, దూరం నుంచి వీక్షించే వారి కోసం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణం రోజున సాయంత్రం 4గంటల నుంచి భారీ వాహనాలను కొండపైకి అనుమతించకుండా కార్లు, బైక్‌లను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు బాధ్యతలు పోలీస్‌శాఖకు అప్పగించారు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కల్యాణోత్సవాలు వారం రోజులు మూడుచోట్ల మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణంరోజున రెండు అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఫైర్‌ అధికారులను ఆర్డీవో ఆదేశించారు. కల్యాణం అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా పోలీస్‌సిబ్బంది సాయంతో కల్యాణం అక్షింతలు, ప్రసాదం వితరణ చేయాలని సూచించారు. సత్యదేవుడి చక్రస్నానం రోజున పంపా సరోవరంలో కనీస నీటిమట్టం ఉండేలా చూసే బాధ్యతలను ఇరిగేషన్‌ అధికారులకు అప్పగించారు. స్వామివారి కల్యాణాలు జరిగే వారం రోజులు గ్రామంలో మెయిన్‌రోడ్డు వద్దనున్న మద్యం దుకాణాలు మూయించాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది స్వామివారి శ్రీపుష్పయోగం అనివేటి మండపంలో చేపట్టాలని నిర్ణయించారు. గోటి తలంబ్రాలు సంప్రదాయం అన్నవరంలో లేనందున పూర్వపు పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:13 AM