Share News

మంత్రి ఊరికే వస్తారా?

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:54 AM

సదుం మండలంలో బీసీవై పార్టీ అఽధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌పై సోమవారం హత్యాయత్నం జరిగింది. ఎర్రాతివారిపల్లె గ్రామం, సదుం పోలీస్‌ స్టేషన్లలో వైసీపీ అల్లరి మూకలు ఆయనపై దాడికి పాల్పడ్డాయి. పార్టీ ప్రచారరథానికి నిప్పుపెట్టాయి. వాహనాలను ధ్వసం చేశాయి.

మంత్రి ఊరికే వస్తారా?
ఎర్రాతివారిపల్లె ఆర్చి వద్ద రామచంద్రయాదవ్‌ ప్రచారరథాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

బీసీవైపీ నేతలపై వైసీపీ మూకదాడులు

అసెంబ్లీ అభ్యర్థి రామచంద్రయాదవ్‌పై హత్యాయత్నం

సదుం పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రచార రథానికి నిప్పు

పుంగనూరు, ఏప్రిల్‌ 29: సదుం మండలంలో బీసీవై పార్టీ అఽధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌పై సోమవారం హత్యాయత్నం జరిగింది. ఎర్రాతివారిపల్లె గ్రామం, సదుం పోలీస్‌ స్టేషన్లలో వైసీపీ అల్లరి మూకలు ఆయనపై దాడికి పాల్పడ్డాయి. పార్టీ ప్రచారరథానికి నిప్పుపెట్టాయి. వాహనాలను ధ్వసం చేశాయి. ఈ దాడిలో బీసీవై పార్టీ నేతలు పలువురికి గాయాలయ్యాయి. సీఆర్పీఎఫ్‌ పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పుంగనూరు భారతఛైతన్య యువజన పార్టీ అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్‌ సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి సదుం మండలంలో రోడ్‌షో నిర్వహించారు. బూరగమంద నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెకు వెళ్లగా అయ్యప్పస్వామి ఆలయం వద్ద రోడ్డుకు బారికేడ్లు అడ్డుపెట్టి గ్రామానికి ఎంత ధైర్యం ఉంటే వస్తారు.. వెనక్కు వెళ్లాలని కొందరు యువకులు హుకుం జారీ చేశారు. ప్రచార రథం డివైడర్‌ పక్క రోడ్డులో వెళుతుండగా ‘వద్దంటే వస్తారా’ అంటూ రామచంద్రయాదవ్‌పై రాయి విసరగా ఆయన తప్పించుకున్నారు. ఆయనకు భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్‌ గన్‌మ్యాన్‌ వారిని వారించి పక్కకు నెట్టారు. ఈ క్రమంలో వైసీపీ, బీసీవై పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. గొడవ పెరగడంతో ఇరువర్గాల వారు ఘర్షణపడ్డారు. అంతలోనే గ్రామంలోని వారు దుర్భాషలాడుతూ బీసీవైపీ ప్రచార రథంపై రాళ్లు, కర్రలు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. బీసీవైపీ నేతలు సైతం రాళ్లు విసిరారు. ప్రచారానికి వచ్చిన మహిళలపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న సదుం ఎస్‌ఐ మారుతి వచ్చి అనుమతి లేకుండా ఎలా వస్తారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల అనుమతి పత్రంలో ఎర్రాతివారిపల్లె లేకపోవడంతో పార్టీ వారంతా వెనుక్కి రావాలని రామచంద్రయాదవ్‌ పిలిచారు. గొడవ పెద్దదవుతుందని బీసీవై పార్టీ శ్రేణులు కల్లూరు మీదుగా వెళ్లడానికి ప్రధాన రోడ్డుపైకి రాగా అప్పటికే వైసీపీ మూకలు రోడ్డుకు అడ్డుగా పడుకుని వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళలపై దాడులు చేయడం దుర్మార్గమని, తాము వెళతామని చెప్పినా వినకుండా వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. పోలీసులు చెప్పినా వినకుండా రాళ్లు, కర్రలు విసురుతూ సదుం వరకు వాహనాలను వెంబడించారు. ఈ దాడిలో పలువురు బీసీవై పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రామచంద్రయాదవ్‌ ప్రచారరథంలోనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఆయన వెంటే వచ్చిన వైసీపీ మూకలు స్టేషన్‌లోకి చొరబడ్డాయి. పోలీసులు తలుపులు మూసి వారిని పంపారు. స్టేషన్‌ ముందు ఉన్న ప్రచార రథానికి నిప్పుపెట్టగా పోలీసులు నీరుపోపి అదుపు చేశారు. రామచంద్రయాదవ్‌ ల్యాండ్‌ క్రూసర్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఉపయోగించే వాహనంతోపాటు కాన్వాయ్‌లోని దాదాపు 15 వాహనాలను ధ్వంసం చేయడంతో దాదాపు 20 మంది వరకు బీసీవైపీ శ్రేణులు గాయపడ్డారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ, పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి సంఘటన స్థలాన్ని, ప్రచారరథాన్ని పరిశీలించి రామచంద్రయాదవ్‌ను విచారించారు. బీసీవై పార్టీ నేతలు అనుమతిలేకుండా వెళ్లారని, ఇంతవరకు ఫిర్యాదులు ఇవ్వలేదని ఎస్పీ తెలిపారు. కాగా, మూడు రోజులుగా వైప్లస్‌ భద్రత ఉన్న రామచంద్రయాదవ్‌ ప్రచార రోడ్డుషోకు సదుంలో మాత్రం ఇద్దరు మహిళా పోలీసులను పంపారు. ఎస్‌ఐ, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయలేదు.

బీసీవై పార్టీ నేత ఇంటికి నిప్పు

సదుం మండలం చిలకపాటివారిపల్లెకు చెందిన బీసీవై పార్టీ నాయకుడు ఆనందరెడ్డి ఇంటిపై వైసీపీ మూకలు సోమవారం రాత్రి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. రామచంద్రయాదవ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకపాటివారిపల్లెలో ఆనందరెడ్డి తన ఇంట్లో బీసీవై పార్టీ శ్రేణులకు మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అల్లరి మూకలు రాత్రి పెట్రోల్‌ పోసి ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లో ఉన్నారు. కిటికి అద్దాలు ధ్వంసం చేసి, రాళ్లు రువ్వారు. కారును ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మంటలు ఆర్పి వారికి రక్షణ కల్పించారు. రామచంద్రయాదవ్‌ వెంట తిరుగుతున్నాడని ఆనందరెడ్డిపై ఇటీవల వైసీపీ కార్యకర్తలు దాడి చేసి అక్కడే ఉన్న ప్రచార రథం అద్దాలు ధ్వంసం చేసి, నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై సదుం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది పోలీసుల వైఫల్యం

సదుంలో బీసీవై పార్టీ ఎన్నికల ప్రచారానికి పోలీసులు భద్రత ఇవ్వకపోవడం వల్లే మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసీపీ అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. వందల మంది పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి నాపై దాడికి పాల్పడుతున్నా పోలీసులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. పుంగనూరులో అరాచకం తారస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనం. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా.

- రామచంద్రయాదవ్‌

పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు పెరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. సదుం మండలంలో బీసీవై పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తుంటే వైసీపీ నాయకులు కార్లు ధ్వంసం చేయడం, కాల్చడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఉగ్రవాదుల పాలనలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

- చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి

Updated Date - Apr 30 , 2024 | 01:54 AM