Share News

సూళ్లూరుపేట వైసీపీలో ఆరని జ్వాలలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:10 AM

తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల విభేదాలు ఎన్‌డీసీసీ చైర్మన్‌ నుంచి నాకు ప్రాణహాని: పోలీసులకు పట్టణ అధ్యక్షుడి ఫిర్యాదు

సూళ్లూరుపేట వైసీపీలో ఆరని జ్వాలలు
ఎస్‌ఐ రహీం రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న కళత్తూరు శేఖర్‌ రెడ్డి

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 15: సూళ్లూరుపేట వైసీపీలో వర్గవిభేదాల కారణంగా చెలరేగిన జ్వాలలు ఇప్పట్లో ఆరేలా లేవు. వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. కొంతకాలంగా ఎన్‌డీసీసీబీ (నెల్లూరు జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు) చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి (ఎమ్మెల్యే అనుకూల వర్గం), సూళ్లూరుపేట వైసీపీ పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌ రెడ్డి (ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం) మధ్య వర్గవిభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇరువరాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకుని ఉన్నారు. ఎన్నికల వేళ వర్గవిభేదాలు మంచిది కాదని పార్టీ అధిష్ఠానం పెద్దలు ఇరు వర్గాలకు నచ్చచెప్పారు. అయినా వారు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో సూళ్లూరుపేట పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తొలిసారిగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి వర్గీయులు.. కళత్తూరు శేఖర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సర్దుబాటు చేయాల్సి ఉంది. మరోవైపు పార్టీ నాయకుడిపై ప్రచారంలో దాడికి దిగడం ఏంటంటూ మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు కళత్తూరు సునీల్‌రెడ్డిలు శేఖర్‌రెడ్డికి మద్దతుగా ప్రతిఘటనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ అల్లూరు అనిల్‌రెడ్డి పలువురు పార్టీ నాయకులు శేఖర్‌రెడ్డి వర్గీయులకు నచ్చచెప్పి అక్కడినుంచి పంపించేశారు. ఈ క్రమంలో సత్యనారాయణరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ శేఖర్‌రెడ్డి సోమవారం పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ రహీంరెడ్డికి ఫిర్యాదు చేశారు.

కాల్చి చంపేస్తానంటున్న ఎన్‌డీసీసీ చైర్మన్‌

వైసీపీ పట్టణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి

ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి చేసే గ్రావెల్‌, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించాననే తనపై కక్ష కట్టాడని సూళ్లురుపేట వైసీపీ పట్టణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. ప్రచారంలో ఉన్న తనపై ఆయన వర్గీయులతో దాడి చేయించాలని చూశారని ఆరోపించారు. ‘నిన్ను నా గన్‌మ్యాన్‌తో కాల్చి చంపేస్తాను. ఎవరూ నిన్ను కాపాడరు’ అని ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ పదే పదే బెదిరిస్తున్నాడని శేఖర్‌రెడ్డి వాపోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి సైతం చెప్పానని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే ప్రచారంలో తనపై దాడికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 16 , 2024 | 01:10 AM