Share News

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:08 AM

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన చివరి అవకాశం సోమవారంతో ముగియనుంది.

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ఫ 10,500 దరఖాస్తుల రాక.. ఏడు వేలు పరిశీలన

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 14: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన చివరి అవకాశం సోమవారంతో ముగియనుంది. ఇప్పటికీ ఓటు లేనివారు ఆన్‌లైన్‌ లేదా ఆయా మండలకేంద్రాల్లో ఎన్నికల అధికారులకు ఫారం-6 అందజేయాలి. వీటిని పరిశీలించి 24వ తేదీలోగా కొత్త ఓటరుగా నమోదు చేస్తారు. ఓటు కోసం ఇప్పటివరకు 10,500 దరఖాస్తులు అందగా, వాటిలో ఏడు వేలను అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపారు. మరో 3500 దరఖాస్తుల పరిశీలన ఈనెల 24వ తేదీలోగా పూర్తిచేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 15,54,712 మంది ఓటర్లు ఉన్నారు. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతూవస్తోంది. అయితే అవగాహన లేకపోవడం వలన ఇప్పటికీ కొంతమంది ఓటు ఉందో లేదో పరిశీలించుకోలేకపోతున్నారు. అలాంటి వారికోసమే ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 15 వరకు అదనంగా అవకాశం కల్పించింది. తమకు ఓటు ఉందో లేదో సోమవారం రోజైనా తెలుసుకుని.. సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకుంటే.. మే 13వ తేదీన ఓటు వేయొచ్చు.

ఫారం-6 మాత్రమే ఇవ్వాలి

ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం మాత్రమే గడువు ఉంది. ఓటు కోసం బూత్‌స్థాయి అధికారులు.. లేదా నియోజకవర్గాల్లోని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు లేదా ఆయా మండలాల తహసీల్దార్లు, డీటీలను సంప్రదించి ఫారం-6 దరఖాస్తు సమర్పించాలి. దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 1950 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోను చేయాలి. ఓటరు నమోదుకు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత ప్రొఫార్మాలో ఆధార పత్రాలతో జతపరచి దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా జిరాక్స్‌ పత్రాలను జతచేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోను ప్రొఫార్మాలో అడిగిన ఇతర వివరాలను సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఓటరుగా నమోదవుతారు. ప్రస్తుతం ఫారం 6 మాత్రమే సమర్పించి ఓటరుగా నమోదు కావచ్చు. ఫారం-7, ఫారం-8 ద్వారా తొలగింపులు, మార్పులు, చేర్పులకు ఇప్పుడు అవకాశం లేదు.

యువ ఓటర్లు 33వేల మంది

ఇప్పటికే జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు కొత్తగా ఓటు హక్కును కల్పించారు. వీరు 33,495 మంది ఉన్నారు. మొదటిసారి ఈ ఏడాది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

25న అనుబంధ జాబితా

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుదిజాబితాను ఫిబ్రవరి 8న ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోసారి జాబితా సవరణ చేపట్టడంతో ఈనెల 15వ తేదీవరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. వీటి పరిశీలన పూర్తయిన తర్వాత 25వ తేదీన అనుబంధ జాబితా ప్రకటిస్తారు.

Updated Date - Apr 15 , 2024 | 02:08 AM