Share News

నారాయణస్వామి లిక్కర్‌ బాటిల్‌ మంత్రి

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:14 AM

నాసిరకం మద్యంతో పెరిగిన మరణాలు వెంకటేగౌడకు మరోసారి ఓటేస్తే ప్రజల్నీ అమ్మేస్తాడు ఎన్నికల సభల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శ కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపు

నారాయణస్వామి లిక్కర్‌ బాటిల్‌ మంత్రి
బంగారుపాళ్యంలో సోమవారం రాత్రి జరిగిన సభలో అభివాదం చేస్తున్న షర్మిల

పలమనేరు/బంగారుపాళ్యం/కార్వేటినగరం, ఏప్రిల్‌ 15: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ మీద పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా ఆగ్రహించారు. కార్వేటినగరం, పలమనేరు, బంగారుపాళ్యంలలో ఆమె పర్యటన సాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై, ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

కార్వేటినగరం సభలో..

‘జగన్‌తో పాటు నారాయణస్వామికి ఓట్లేసి గెలిపించారు. ఆయన డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ మినిస్టర్‌ అంట కదా.. అంటే ఏమిటో తెలుసా.. లిక్కర్‌ బాటిల్‌ మంత్రి. లిక్కర్‌ షాపుల్లో భూం భూం, స్పెషల్‌ స్టేటస్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌ అన్నీ ఈయనవే అంట కదా. బాగా సంపాదించారు. దళితుడు. అంబేడ్కర్‌ శిష్యుడ్ని అని చెప్పుకుంటాడు కదా. అంబేడ్కర్‌ ఆశయాలను నిలబెట్టడం అంటే మద్యం అమ్మడమా.. అది కూడా కల్తీ మద్యం అమ్మడమా.. నాసిరకం మందుతో మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ మండి కిడ్నీలు, లివర్లు చెడిపోయి చనిపోతున్నారు. అయినా అవే నాసిరకం మద్యం అమ్మకాలు. బయట క్వార్టర్‌ బాటిల్‌ రూ.60 అయితే, మన వద్ద రూ.250 అమ్ముతున్నారు. నిజమేనా?’ అని జనాన్ని అడిగారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

పలమనేరు సభలో..

‘మీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పరిపాలన ఎలా ఉంది? ఎప్పుడైనా వస్తున్నారా? సమస్యల్ని పరిష్కరిస్తున్నారా? మీరు ఓటేసి గెలిపిస్తే నెత్తి మీద టోపీ పెట్టారు. ఇసుక, మట్టి మాఫియాతో బాగా సంపాదించారు. నదిలో ఇసుక లేకుండా మొత్తం అమ్ముకున్నాడట కదా. మరోసారి ఓటేస్తే మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు. నియోజకవర్గంలోని భూముల్ని, ప్రజల్ని మొత్తంగా అమ్మేస్తాడు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

బంగారుపాళ్యం సభలో..

‘ఈసారి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు బాగా డబ్బులిస్తారు. ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మనస్సాక్షి మేరకు వేయండి. ఓటు తల్లి, చెల్లి లాంటిది. అమ్ముకోకండి. జగన్‌ చెప్పిన వాగ్దానాలన్నీ మద్యం షాపుల్లో నిలబెట్టుకున్నారు. అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని ఒకరికే ఇస్తున్నారు. మరోబిడ్డను దత్తత ఇచ్చేయాలా? చంపేసుకోవాలా? పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెల్లో నిజాయితీ ఉంది. గెలిపించండి. వైఎస్సార్‌ సంక్షేమాన్ని తెస్తాను’ అని జనానికి హామీలిచ్చారు.

అభ్యర్థులను గెలిపించమని..

కార్వేటినగరం, పలమనేరు, బంగారుపాళ్యం మండలాల్లో జరిగిన బహిరంగ సభల్లో జీడీనెల్లూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు రమే్‌షబాబు, శివశంకర్‌, ఎంఎస్‌ బాబులను పరిచయం చేశారు. ఓట్లేసి గెలిపించాలని, అందుబాటులో ఉండి సమస్యల్ని పరిష్కరిస్తారని కోరారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, బంగారుపాళ్యంలో వామపక్ష నాయకులు ప్రసంగించారు.

Updated Date - Apr 16 , 2024 | 01:14 AM