Share News

సింపతీ కోసమే డ్రామా

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:14 AM

సింపతీ కోసమే సీఎం జగన్‌పై గుళకరాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం వీరు మాట్లాడారు.

సింపతీ కోసమే డ్రామా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

ఫ ఐప్యాక్‌ ప్లాన్‌లో భాగంగానే జగన్‌పై గులకరాళ్ల దాడి అంటూ టీడీపీ విమర్శ

చిత్తూరు సిటీ, ఏప్రిల్‌ 14: సింపతీ కోసమే సీఎం జగన్‌పై గుళకరాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం వీరు మాట్లాడారు. సీఎం జగన్‌కే భద్రత లేదంటే పూర్తిగా పోలీసులు, నిఘా వైఫల్యమేనని చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ ఆరోపించారు. దీనికి బాధ్యులైన అధికారులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాళ్లదాడిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయన్నారు. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబును దూషిస్తూ ప్లకార్డులతో వైసీపీ నేతలు రోడ్లపైకి ఎలా వచ్చారని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రశ్నించారు. దీనిపై వారి వద్దఉన్న ఆధారాలేంటని అడిగారు. మరో నాలుగురోజుల్లో ఎన్నికల మూడ్‌ మార్చే సంచలన సంఘటనలు జరగొచ్చని ఈనెల 10న వైసీపీ నేత అవుతు శ్రీధర్‌ రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారని సురేంద్రకుమార్‌ గుర్తుచేశారు. ఆయన చెప్పినట్లే జరిగిందన్నారు. ఐప్యాక్‌ టీం ప్లాన్‌లో భాగమేఈ రాళ్లదాడి అని సప్తగిరి ప్రసాద్‌ ఆరోపించారు. గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడు గులకరాళ్ల డ్రామాకు తెరలేపారని కోదండ యాదవ్‌ విమర్శించారు. నేతలు మోహన్‌రాజ్‌, వెంకటేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

భద్రతా వైఫల్యమే కారణం: వంగవీటి

2019 ఎన్నికలకు సరిగ్గా నెల ముందు వైఎస్‌ జగన్‌ కోడికత్తి దాడి చేయించుకుని, సింపతీతో ఓట్లు వేయించుని గెలిచారని రాష్ట్ర కాపుసంఘం నేత వంగవీటి రాధా అన్నారు. ఇప్పుడూ ఎన్నికల ముందు సింపతీ కోసం గులకరాయి దాడి డ్రామా ఆడుతున్నారన్నారు. ప్రజలు తెలివైన వాళ్ళని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తారన్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడికి కారణం పోలీసుల భద్రతా వైఫల్యమేనని ఎన్నికల కమిషన్‌ స్పందించి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికలప్పుడే ఇలాంటివి తెరపైకి..

పలమనేరు: ఎన్నికలు వచ్చినప్పుడే ఇటువంటివి తెరమీదకు వస్తున్నాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆదివారం పేర్కొన్నారు. వివేకానందరెడ్డిని చంపిన వారిని జగన్‌ వెనకేసుకొస్తున్నారని సొంత చెల్లెళ్లు అంటున్నారన్నారు. ఈయనేమో తనపై చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు దాడి చేస్తున్నారని ఆరోపించడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దాడులను ప్రోత్సహించదని, సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దాడి చంద్రబాబు చేయించారని ప్రచారం చేయడం సిగ్గుపడాల్సిన అంశమన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 02:14 AM