Share News

గతమే ఘనం

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:55 PM

దేశంలోని నలమూలలు, విదేశాలకు జీన్స ప్యాంట్లను ఎగుమతి చేసేలా టీడీపీ ప్రభుత్వం జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో టైక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది.

గతమే ఘనం

అనంతపురం సెంట్రల్‌, ఏప్రిల్‌ 15: దేశంలోని నలమూలలు, విదేశాలకు జీన్స ప్యాంట్లను ఎగుమతి చేసేలా టీడీపీ ప్రభుత్వం జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో టైక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు రాయదుర్గం పట్టణ సమీపాన 17ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో జీన్స వస్ర్తాల తయారీకిఅవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించింది. ఇందులో భాగంగా 55 యూనిట్లను ఏర్పాటుచేసేలా ఒక్కో యూనిట్‌కు 20 సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయించింది. యూనిట్ల కోసం శాశ్వత భవనాలను నిర్మిచేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అప్రూవల్స్‌ ఇప్పించింది. దీంతో టైక్స్‌టైల్‌ పార్క్‌ద్వారా రోజుకు సగటున 60వేల జీన్స ప్యాంట్లు తయారవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరితోపాటు వందల కుటుంబాలు కుటీర పరిశ్రమలాగా వారి ఇళ్లనుంచే స్టిచింగ్‌, కటింగ్‌, కలరింగ్‌, ఐరన తదితర పనుల చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాయి. ఇదంతా గతం. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో టైక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధి ఎలాంటి ప్రోత్సాహకం అందడంలేదు. ముఖ్య మంత్రిగా జగనమోహనరెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పుటి నుంచే పెట్టుబడి రుణాలను, రాయితీలను ఎత్తివేశారు. కనీసం మార్కెటింగ్‌ సదుపాయాన్ని కూడా కల్పించడంలేదని ఇటు యూనిట్ల వ్యవస్థాపకులు, జీవనోపాధి పొందుతున్న వర్గాలు వాపోతున్నాయి.

ఆకట్టుకునే స్టైల్స్‌...

యుతను అకట్టుకునేలా జీన్స ప్యాంట్స్‌ టైక్స్‌టైల్‌ పార్కులో తయారవుతున్నా యి. కార్గో, టీసీ ప్యాంట్లు, టెరీ కాటన, బర్ముడా బూట్‌కట్‌, కంఫర్ట్‌, పెన్సిల్‌ కట్‌, హాప్‌ త దితర డిజైన్లతో ప్యాంట్లు తయారు చేస్తున్నారు. వాటిపై వెల్‌వెడ్‌ ఆబ్లిక్‌ వర్క్‌, లెదర్‌ అబ్లిక్‌ వర్క్‌, ఫోమ్‌ఎంబోజ్‌, కమికల్‌ ఎంబోజ్‌, ప్రింటెడ్‌ వంటి రకరకాలతో ఆకృతుల అందాలద్ది యువతను ఆకర్షిస్తారు. ఆంధ్రప్రదేశ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాలతోపాటు ఇతర దేశాలకు చెందిన పలు బ్రాండెడ్‌ జీన్స కంపెనీలు, మాల్స్‌ నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. ఒక్కో ప్యాంట్‌ రూ.250 నుంచి రూ.600లకే తయారుచేసి ఇవ్వడంతో ఆర్డర్లు ఇచ్చేందుకు కంపెనీలు ఎగబడుతుంటాయి. తయారీ ధరలను బట్టి మార్కెట్‌లో ఒక్క ప్యాంట్‌ రూ.2వేల వరకు అమ్ముకుంటారు.

జగన ప్రభుత్వ సహాయ నిరాకరణ...

టైక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి పలు బ్యాంకు లు దాదాపు రూ.కోటి వరకు ఆర్థికసాయం చేయగా, పరిశ్రమల శాఖ రాయితీలను ఇచ్చింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు యూనిట్‌ రుణంలో 50శాతం, పురుషులకైతే 40 శాతం రుణం మంజూరు చేసింది. బీసీ మహిళలకు 45శాతం, పురుషులకు 35శాతం, ఇతరుల కు చెందిన మహిళలకు 20శాతం, పురుషులకు 15శాతం రాయితీలను మంజూరు చేసిందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో అన్నిరకాల సహాయ, సహకారాలను ఎత్తివేశారని మండిపడుతున్నారు. ముడిసరుకు ధరలు, తయారీ ఖర్చులు పెరిగి గిట్టుబాటు కాకపోవ డంతో యూనిట్లు మూతవేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.

ప్రచార ఆర్భాటం

క్షేత్రస్థాయిలో టెక్స్‌టైల్‌ పార్కు దుస్థితి ఇలా ఉంటే వైసీపీ ప్రభుత్వం మరోలా ప్రచారం చేసుకుంటోంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న ఉత్పత్తులకు కేంద్రప్రభుత్వం ఓడీ-ఓపీ(వన డిస్ర్టిక్ట్‌-వన ప్రొడక్ట్‌) ద్వారా ప్రచారాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 762 జిల్లాలో 1102 ఉత్పత్తులను ఎంపికచేసింది. ఏపీలో 13ఉమ్మడి జిల్లాలనుంచి 38ఉత్పత్తులను ఎంపికచేశారు. వీటిలో అనంతపురం ఉమ్మడి జిల్లానుంచి రాయదుర్గం జీన్స పరిశ్రమతోపాటు ధర్మవరం పట్టుచీరలు, నిమ్మలకుంట తోలు బొమ్మల ఉత్పత్తులను ఓడీ-ఓపీలోకి చేర్చింది. ఈ మూడు రంగాలు అంతర్జాతీయంగా జిల్లాకు పేరు ప్రఖ్యాతులను తెచ్పిపెట్టాయి. వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు ఎటువంటి సాయం చేయకపోగా ఎన్నికవేళ గొప్పలు చెప్పుకోవడానికి మీ ఫొటోలు, మాటలు వీడియో రూపంలో పంపాలని చెబుతోందని టెక్స్‌టైల్‌ పార్కు వర్గాలు మండిపడుతున్నాయి.

Updated Date - Apr 15 , 2024 | 11:55 PM