Share News

CM JAGAN : చప్పగా సీఎం సభ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:42 AM

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్‌ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్‌, సీపీఎస్‌ రద్దు, మెగా...

CM JAGAN : చప్పగా సీఎం సభ
Jagan speaking in the assembly

బుకాయింపులు.. అబద్ధాలు..

ఫ మేనిఫెస్టో ప్రస్తావనే లేదు

తాడిపత్రి ప్రచార సభకు స్పందన కరువు

తాడిపత్రి టౌన, ఏప్రిల్‌ 28: ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్‌ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్‌, సీపీఎస్‌ రద్దు, మెగా డీఎస్సీ తదితర అంశాల గురించి ప్రస్తావించలేదు. వీటన్నింటినీ విస్మరించి.. 99 శాతం నెరవేర్చామని ఎలా చెబుతారని బహిరంగ సభకు వచ్చిన జనం నిట్టూర్చారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అంటూ..


పదవులు, టిక్కెట్ల విషయంలో వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని బురిడీ కొట్టించేందుకు చూశారు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ.. ఆ హామీల అమలు చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. చంద్రబాబును నమ్మితే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని, ఆయనతో పెట్టుకుంటే రక్తం తాగే పశుపతితో పెట్టుకున్నట్లేనని అక్కసు వెళ్లగక్కారు. తనకు కుట్రలు, కుతంత్రాలు తెలియవని అన్నారు. టీడీపీ కూటమి మొత్తం కుర్చీ ఎక్కేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధిలో సగమైనా గతంలో చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. కూటమిలో భాగమైన బీజేపీ గురించి, ప్రధాని మోదీ గురించి ప్రస్తావించకుండా.. చంద్రబాబు, పవన కల్యాణ్‌లపై మాత్రమే విమర్శలు గుప్పించారు.

వెనుదిరిగిన జనం..

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి తాడిపత్రి సభలో సీఎం జగన ఏమాత్రం పస్తావించలేదు. మేనిఫెస్టోలో ఉన్న ఒక్క అంశం గురించీ మాట్టాడలేదు. వైసీపీ మేనిఫెస్టోలో ఏమి లేదని సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో ఆయన మౌనం వహించినట్లు కనిపిస్తోంది. జగన ప్రసంగంలో విశేషాలు ఏమీ లేకపోవడంతో జనం మధ్యలోనే వెనుదిరిగారు. జగన వచ్చాక కాసేపటికే ఇంటిదారి పట్టారు. జగన రాక సుమారు గంటన్నర ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి చాలామంది ఇబ్బందిపడ్డారు. మరోవైపు సీబీ రోడ్డులో దుకాణాలన్నీ మూతపడటంతో పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీ్‌సస్టేషన ఎదుటే వైసీపీ కార్యకర్తలు మద్యం తాగుతూ చిందులు వేశారు.


పోలీసుల అత్యుత్సాహం

సీఎం బహిరంగ సభకు బందోబస్తుగా వచ్చిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొటోకాల్‌ పేరిట కొందరు వైసీపీ నాయకులతోపాటు మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. మీడియాకు గ్యాలరీ లేదని ఏఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు విలేకరులపై చిందులు వేశారు. భద్రత పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు. వచ్చినదారినే వెళ్లాలని సందుల్లోకి ట్రాఫిక్‌ను మళ్లించారు.

పాపం.. పైలా.. ఫయాజ్‌..

జగన బహిరంగ సభలో స్థానిక వైసీపీ నాయకులకు భంగపాటు తప్పలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను సైతం గ్యాలరీలోకి అనుమతించలేదు. మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఫయాజ్‌బాషా గ్యాలరీలోకి వెళుతుండగా సీఎం సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదనని, వెళ్లిపోవాలని చెప్పడంతో ఫయాజ్‌బాషా కొందరు నాయకులకు ఫోన్లు చేసి సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా సీఎం సెక్యురిటీ సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో ఆయన తన అనుచరవర్గంతో ఇంటిముఖం పట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా


నరసింహయ్య సీఎం బస్సు ఎక్కేందుకు వెళుతుండగా సీఎం సెక్యురిటీ అడ్డుకుంది. ఆయన పేరు కూడా జాబితాలో లేదని చెప్పడంతో అవాక్కయ్యారు.

చుక్క.. ముక్క.. లెక్క..!

యాడికి: సీఎం సభకు వస్తే మహిళలకు రూ.300, పురుషులకు క్వార్టర్‌ మద్యం, మాంసాహార భోజనం.. అంటూ వైసీపీ నాయకులు ప్రలోభ పెట్టారు. వేములపాడు నుంచి వైసీపీ చోటా నాయకులు సీఎం సభకు జనాన్ని తరలించేందుకు డబ్బు, మద్యం, మాంసాహారాన్ని ఎరగా వేశారు. ఒక్కో గ్రామం నుంచి వంద మందిని సభకు తీసుకురావాలని గ్రామస్థాయి నాయకులను పురమాయించారు. ఒక్కో చోటా నాయకుడి చేతికి రూ.50వేలు ఇచ్చారని సమాచారం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:42 AM