జగన్‌రెడ్డి అబద్ధాలకు ఆస్కార్‌ తక్కువే

ABN , First Publish Date - 2023-06-30T00:10:19+05:30 IST

అబద్ధాలను చెప్పడంలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఆస్కార్‌ అవార్డు ఇచ్చినా కూడా చాలా తక్కువే అవుతుందని టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు, పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. సాలూరులోని తన నివాసంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

	 జగన్‌రెడ్డి అబద్ధాలకు ఆస్కార్‌ తక్కువే
మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు, జూన్‌ 29 : అబద్ధాలను చెప్పడంలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఆస్కార్‌ అవార్డు ఇచ్చినా కూడా చాలా తక్కువే అవుతుందని టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు, పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. సాలూరులోని తన నివాసంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం కురుపాంలో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారని, దీనిద్వారా రాష్ట్రంలో 82 లక్షలు మంది పిల్లలకు సొమ్ము జమ చేయాల్సి ఉండగా కేవలం 41 లక్షల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారని విమర్శించారు. సీఎం సభకు జిల్లాలో ఉన్న బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోను వక్రీకరించి చంద్రబాబు అధికారంలోకి వస్తే కేజీ బంగారం, బెంజ్‌కారు డోర్‌ డెలివరీ చేస్తారని చెప్పడం ఆయన వెర్రితనమన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సాలూరు, పాచిపెంట, కురుపాం, పార్వతీపురం మండలాలు పనికి రావా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన మీకు ఇంకా వారం రోజులు పూర్తి కాలేదా.. అని ఎద్దేవా చేశారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారులను బాగుచేస్తామని చెప్పి, కనీసం గుంతల్లో మట్టి కూడా వేయలేకపోయారని విమర్శించారు. తల్లి లాంటి ఐటీడీఏను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బూతులు అంటే ఏంటో తనకు తెలియవని మిలీనియం జోక్‌ వేశారని అన్నారు. మూడు సార్లు విద్యుత్‌ బిల్లులు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గిరిజన మంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయిన పీడిక రాజన్నదొరను ఆయన పక్క కూర్చో పెట్టుకోకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పాచిపెంట, మెంటాడ, సాలూరు, మక్కువ అధ్యక్షులు ముఖీ సూర్యనారాయణ, వెంకటరమణ, పరమేష్‌, వేణు, నాయకులు నిమ్మాది తిరుపతిరావు, లక్ష్మోజీ, హర్ష, కొరిపల్లి సురేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-30T00:10:19+05:30 IST