Share News

‘స్మార్ట్‌’ జూదం.!

ABN , Publish Date - May 03 , 2024 | 11:51 PM

ఒకప్పుడు జూదం అంటే ఒక ప్రాంతంలో నలుగురు చేరి డబ్బులు పెట్టి ఆడేవారు. నేటి ఆధునిక స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనం పల్లెల్లోకి పాకింది. ‘ఆన్‌లైన్‌’లో బెట్టింగ్‌.. ఐపీఎల్‌ క్రికెట్‌, కేపీఎల్‌ కబడ్డీ, పేకాట, ఇతర గ్యాంబ్లింగ్‌ (జూదం) గేమ్‌లు ఏదైనా సరే యువకుల ప్రాణాలను బలిగొంటూ కుటుంబాలను నాశనం చేస్తు న్నాయి. ఒకప్పుడు విదేశాల్లో, నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్‌లైన్‌ జూదం ఆటలు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలతో మారుమూల పల్లెలకు చేరాయి.

‘స్మార్ట్‌’ జూదం.!

పల్లెలకు పాకిన ‘ఆన్‌లైన్‌’ బెట్టింగ్‌

ప్రాణాల మీదకు తెస్తున్న ‘గ్యాబ్లింగ్‌’ వ్యసనం

రూ.10వేల నుంచి రూ.లక్షల వరకు పందెం

కేసముద్రం మండలంలో గతంలో ఇద్దరి ఆత్మహత్య!

అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు

క్రికెట్‌, కబడ్డీలపై బెట్టింగ్‌, పేకాట, ఇతర పందాలన్నీ ఇంటర్‌నెట్‌లో లభ్యం

కేసముద్రం, మే 3 : ఒకప్పుడు జూదం అంటే ఒక ప్రాంతంలో నలుగురు చేరి డబ్బులు పెట్టి ఆడేవారు. నేటి ఆధునిక స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనం పల్లెల్లోకి పాకింది. ‘ఆన్‌లైన్‌’లో బెట్టింగ్‌.. ఐపీఎల్‌ క్రికెట్‌, కేపీఎల్‌ కబడ్డీ, పేకాట, ఇతర గ్యాంబ్లింగ్‌ (జూదం) గేమ్‌లు ఏదైనా సరే యువకుల ప్రాణాలను బలిగొంటూ కుటుంబాలను నాశనం చేస్తు న్నాయి. ఒకప్పుడు విదేశాల్లో, నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్‌లైన్‌ జూదం ఆటలు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలతో మారుమూల పల్లెలకు చేరాయి. పైకి కనిపించకుండా జాపకింద నీరులా ఆన్‌లైన్‌ జూదంలో వేలకు వేలు మాయమవుతుడడంతో పలువురు యువకులు లక్షల్లో అప్పులపాలవుతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి అప్పుల పాలైన వారు ఎటూ పాలుపోక ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. ఇదే నేపథ్యంతో రెండేళ్ల క్రితం కేసముద్రం మండలంలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

ఐపీఎల్‌ క్రికెట్‌, కేపీఎల్‌ కబడ్డీ, ఫుట్‌బాల్‌, పేకాట, ఇతర జూద ఆటలపై బెట్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంచనాలు వేస్తూ ఆన్‌లైన్‌లో వేలకు వేలు బెట్టింగ్‌, జూదం ఆడుతూ ఒకటి, రెండుసార్లు డబ్బులు వచ్చేసరికి పందానికి అలవాటు పడిపోతున్నారు. పోగొట్టుకున్న డబ్బులు మళ్లీ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లు కాస్తూ వేలు, లక్షల రూపాయలు కోల్పోతున్నారు. ఈ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టేందుకు తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుంటున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుంటుండడంతో అప్పు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించే మార్గంలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లోనే ఆట..

ఇంటర్‌నెట్‌ సౌకర్యంతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌, కంప్యూటర్‌ ఉంటేచాలు ఆన్‌లైన్‌లో జూదం ఆడే వారి కోసం చాలా యాప్‌లు, వెబ్‌సైట్లు అన్ని గ్యాంబ్లింగ్‌ (జూదం) గేమ్‌లు ఒకే చోట అందుబాటులో లభిస్తున్నాయి. ఈ కంపెనీల వద్ద డబ్బులు చెల్లించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకుంటే సదరు కంపెనీ లాగ్‌ ఇన్‌లో ఉన్న ఏ గేమ్‌ అయినా ఆడేందుకు వీలుంటుంది. ఇందులో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌, కేపీఎల్‌ కబడ్డీ, పేకాటలో ఎన్ని రకాల ఆటలు ఉన్నాయో అన్ని రకాల ఆటలు, ఆన్‌లైన్‌ డైస్‌ గేమ్స్‌, నంబర్‌ గేమ్‌లు, లైవ్‌ క్యాసినో ఆటలు, ఆన్‌లైన్‌ రౌలెట్‌, మొబైల్‌ క్యాసినో గేమ్స్‌ తదితర రకాల జూద ఆటలు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎల్‌లో రెండు టీంలలోంచి క్రీడాకారులను ఎంచుకొని ఒక టీంగా ఏర్పాటు చేసుకొని వారిపై పందెం కాయడం. మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న బాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు? ఒక ఓవర్‌లో ఎన్ని రన్‌లు వస్తాయి? ఒక బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయనే? అంశాలను అంచనా వేస్తూ యాప్‌లలో పందానికి రెట్టింపు, ఐదురెట్లు, పదిరెట్ల డబ్బులు వరకు ఇస్తామని అప్పటికప్పుడు ప్రకటిస్తుండడంతో వాటిపై బెట్టింగ్‌ వేస్తున్నారని సమాచారం. ఒకవైపు మ్యాచ్‌ లైవ్‌ చూస్తూనే మరోవైపు బెట్టింగ్‌ యాప్‌లలో క్షణాల వ్యవధిలోనే వేలకు వేలు పందెం కాస్తూ పోగొట్టుకుంటున్నారు. ఈ పందాలు డబ్బుల చెల్లింపులు అంతా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అనధికార యాప్‌లలో ఆట...

వాస్తవానికి పందెం కాసే యాప్‌లు, పోర్టల్‌లకు మన ప్రాంతంలో అనుమతులు లేవు. అయితే స్మార్ట్‌ ఫోన్లలో నిషేధిత యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే ముందు లొకేషన్‌ ఆధారంగా సదరు యాప్‌ ఇన్‌స్టాల్‌ కాకుండా నిలిచిపోతుంది. ఈ సమస్యకు విరుగుడుగా లోకేషన్‌తో సంబంధం లేకుండా ఉండే విధంగా ఫొన్లో సెట్‌ చేసుకొని మరీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కొన్ని యాప్‌లలో బెట్టింగ్‌ చేసే వారికి రూ.10వేల వరకు లబ్ది చేకూరితే వాటిని తిరిగి తమ బ్యాంకు ఖాతాలోకి మళ్లించే అవకాశం ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ డబ్బులు బెట్టింగ్‌లో దక్కించుకుంటే వారి అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేసి డబ్బులను డ్రా చేసుకోకుండా నిలిపివేస్తున్నారు. సదరు డబ్బులను మళ్లీ బెట్టింగ్‌లో పెట్టేందుకుమాత్రం అవకాశం ఇస్తున్నారు. ఇలా బెట్టింగ్‌లో గెలుచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టి లాక్కునే విధంగా యాప్‌లు మారాయి.

పేకాటకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌...

జిల్లాలోని కేసముద్రంతో పాటు పలు మండలాల్లో పేకాట ఆడే వారిలో అధిక శాతం జనం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. పేకాటకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరొకరితో అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ పట్టుకొని ఒంటరిగా కూర్చొని పందెం కాయొచ్చు. ఇలా ఈ ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమైన పరిణామం. మండలంలోని ఒక యువకుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ చేస్తూ రూ.12లక్షల వరకు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ యువకుడు మహబూబాబాద్‌ సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరోవ్యక్తి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లలో రూ.20లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఈ డబ్బులన్నీ అప్పులు తీసుకువచ్చి పెట్టడంతో అప్పులవాళ్లు అడుగుతుండడంతో వారికి సమాధానం చెప్పలేక, బయటకు చెప్పుకోలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పెద్దదిక్కులేకుండా చిన్నాభిన్నమవుతున్నాయి. వీరే కాకుండా కేసముద్రం స్టేషన్‌కు చెందిన ఒక యువకుడు అప్పులు చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లలో పెట్టి రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న అతని తండ్రి సాగుభూమిని కొంత విక్రయించి ఆ అప్పులను చెల్లించాడు. ఇదే మండలంలో మరో యువకుడు రూ.15 లక్షలు పోగొట్టుకొని అప్పులపాలు కాగా తల్లిదండ్రులు ఆ డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. కేసముద్రం ప్రాంతంలోనే పదుల సంఖ్యంలో లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పులపాలైన వారు ఉండడం గమనించదగ్గ విషయం. వీరిలో కొందరు ఇక్కడ ముఖం చూపించలేక ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కుటుంబాలను ఆర్థికంగా అతలాకుతలం చేస్తున్న ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్‌లను ప్రభుత్వం నియంత్రించి ఉంటే ఈ ఘోరాలు జరిగేవి కావని బాధితులకు సంబంధించిన వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి ఆన్‌లైన్‌ గ్యాబ్లింగ్‌ గేమ్‌ల వ్యసనానికి గురికాకుండా చర్యలు తీసుకొని మరికొన్ని కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా వ్యక్తుల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

బెట్టింగ్‌ వ్యసనాలకు దూరంగా ఉండాలి : సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, జిల్లా ఎస్పీ

జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యస నానికి యువత దూరంగా ఉండాలి. యువత బెట్టింగ్‌ల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆలోచనను మాను కోవాలి. వీటితో ఆర్థికంగా దెబ్బతిని ప్రాణాల మీదకు తెచ్చుకొని కుటుంబాలు నష్టపోతాయి. ఆన్‌లైన్‌లో జూదం ఆడుతున్న వారిని తల్లిదండ్రులు గమనించి కౌన్సిలింగ్‌ ఇచ్చి బెట్టింగ్‌ను మాన్పించాలి. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడే వారు ఉంటే పోలీసు లకు సమాచారం అందించాలి.

Updated Date - May 03 , 2024 | 11:51 PM