Share News

ఎన్ని‘కలలో’..

ABN , Publish Date - May 03 , 2024 | 12:02 AM

లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఇటు అభ్యర్థులు.. అటు ఆయా పార్టీల నేతలు హమీలు గుప్పిస్తున్నారు. ఓరుగల్లు కాకతీయుల ఏలిన మహనగరమే అయినా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సౌకర్యాలు అంతంతే. రాష్ర్టానికి రెండో రాజధాని అనే మాటే తప్ప హైదరాబాద్‌లో ఉన్న వసతుల్లో పైసా వంతు కూడా ఇక్కడ లేనే లేవనే చర్చ ఉంది. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల వేళ నేతలు, అభ్యర్థులు గుప్పిస్తున్న హామీలను ఓరుగల్లు వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు, ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

ఎన్ని‘కలలో’..

లోక్‌సభ ఎన్నికల వేళ హామీలు గుప్పిస్తున్న నేతలు

ప్రచార తీరు, అభ్యర్థుల వాగ్దానాలను గమనిస్తున్న ప్రజలు

వరంగల్‌ నగరంలో అండర్‌ డ్రెయినేజీపై ఆసక్తి

తెరపైకి మామునూరు విమానాశ్రయం.. ప్రజల్లో గగనయానంపై ఆశలు

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు విస్తరిస్తేనే ఉపాధికి అడుగులు

భూపాలపల్లి రైల్వేలైన్‌.. మైనింగ్‌, ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు జరిగేనా?

కలగానే స్టేషన్‌ఘన్‌పూర్‌లో లెదర్‌పార్కు, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు

ఐటీ టవర్లు, ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటుపైనా నేతల హమీలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఇటు అభ్యర్థులు.. అటు ఆయా పార్టీల నేతలు హమీలు గుప్పిస్తున్నారు. ఓరుగల్లు కాకతీయుల ఏలిన మహనగరమే అయినా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సౌకర్యాలు అంతంతే. రాష్ర్టానికి రెండో రాజధాని అనే మాటే తప్ప హైదరాబాద్‌లో ఉన్న వసతుల్లో పైసా వంతు కూడా ఇక్కడ లేనే లేవనే చర్చ ఉంది. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల వేళ నేతలు, అభ్యర్థులు గుప్పిస్తున్న హామీలను ఓరుగల్లు వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు, ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీపై ఆశలు

‘హైదరాబాద్‌కు సముద్రాన్ని, ఓడరేవును తీసుకొస్తా’ అంటూ సినిమాల్లో రాజకీయ నేతలు హమీలు ఇవ్వటం చూసి నవ్వుకున్నాం.. కానీ, వరంగల్‌కు మాత్రం ఏ నాయకుడు అలాంటి హమీ ఇవ్వకపోయినా వానాకాలం వస్తే చాలు నగరం మొత్తం ఓ సముద్రమే. నాటు పడవలు, బోట్లు కూడా ఈ సముద్రంలో చక్కర్లు కొడుతాయి. కాకపోతే అవి వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తిరుగుతుంటాయి. దీనికి కారణం నాలాలు, చెరువులు, కుంటలను చివరికి దారులను కూడా కబ్జా చేసి దర్జాగా ఇళ్ల నిర్మాణం చేయటమేననే అభిప్రాయాలున్నాయి. వరంగల్‌ నగరంలో 10లక్షలకు పైగా జనాభా, 1,500కు పైగా కాలనీలున్నాయి. అయితే నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవటంతో లోతట్టు ప్రాంతాలు ప్రతీ ఏటా నీట మునిగిపోవాల్సిందే. భారీ నిర్మాణాలతో నగరం కాంక్రీట్‌ జంగల్‌గా మారిపోయింది. అడ్డదిడ్డంగా నిర్మించిన ఇళ్లతో నీళ్లు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో వానాకాలం కష్టాలు తప్పటం లేదు. అయితే ఈ కష్టాలకు కాస్తంత ఊరటనిచ్చేది అండర్‌ డ్రైనేజీ వ్యవస్థేనని అని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. వరంగల్‌ నగరం స్మార్ట్‌ సిటీ కింద ఎంపికైనా నిధులు సక్రమంగా విడుదల కాకపోవటంతో అభివృద్ధికి అడుగులు పడటం లేదు. అన్ని పార్టీలు కూడా అండర్‌ డ్రెయినేజీపై హమీలు ఇస్తుండటంతో ఓటర్లలో ఆశలు చిగురిస్తున్నాయి.

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు గ్రహణం వీడేనా?

వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిర్మాణం కోసం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట శివారులో 22 అక్టోబరు 2017న భూమి పూజ చేశారు. 1,350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్కు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు లభించేవి. అయితే ఏడేళ్లుగా టెక్స్‌ టైల్‌ పార్కు నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వంతో 22కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నా కేవలం రెండు కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించాయి. అయితే 18 మార్చి 2023న కేద్రం ప్రభుత్వం పీఎం మిత్ర కింద వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కును ఎంపిక చేసింది. కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టకపోవటంతో మెగా టెక్స్‌టైల్‌ పార్కు లక్ష్యం నీరుగారుతుంది. గెలిచే అభ్యరిఽ్థ మెగా టెక్స్‌టైల్‌ పార్కును గాడిలో పెట్టాలని ఓరుగల్లు వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విమానం ఎగురచ్చునేమో..?

నిజాం కాలంలో రయ్‌ రయ్‌ మంటూ ఆకాశంలోకి ఎగిరిన విమానం.. ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత మాత్రం గగనమైపోయింది. 2017లోనే ఉడాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి, విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చింది. అయితే హైదరాబాద్‌ నుంచి 150 కిలో మీటర్ల దూరంలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయవద్దని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్వాహణ సంస్థ జీఎంఆర్‌తో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్‌ నుంచి 140కిలో మీటర్ల దూరంలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండటంతో ఆ ఒప్పం దం ఆటంకంగా మారుతుంది. దీనికి తోడు ఎయిర్‌పోర్టుకు కావాల్సిన మరో సుమారు 504 ఎకరాల భూమి సేకరణ కూడా సమస్యగా మారింది. ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తే వరంగల్‌ నుంచి ఆకాశయానం చేసే చాన్స్‌ దక్కుతుంది. అంతేకాదు అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు వరంగల్‌ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయి. విమానాశ్రయంపై అన్ని పార్టీలు హమీలు ఇస్తుండటంతో గగనయానంపై ఓరుగల్లువాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

భూపాలపల్లికి రైల్వేలైన్‌ వచ్చేనా..?

పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లికి రైల్వేలైన్‌ కలగానే మిగిలింది. 1998 నుంచి భూపాలపల్లి రైల్వేలైన్‌ డిమాండ్‌ తెరపైకి రాగా.. పలుమార్లు సర్వేలు నిర్వహించినా రైల్వేలైన్‌కు మోక్షం లభించలేదు. అయితే 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కాజీపేట- భూపాలపల్లి మధ్య 64కి.మీ నిర్మించే రైల్వే లైన్‌కు పైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం రూ.1,152కోట్లు కేటాయించింది. అలాగే రామగుండం వయా భూపాలపల్లి టు మణుగూరుకు 198కిలో మీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణం కోసం రూ.3,600కోట్లు కేటాయించారు. అయితే కొంత వరకు సర్వే చేసి అధికారులు వదిలేశారు. దీంతో భూపాలపల్లి రైల్వేలైన్‌ కలగానే మిగులుతుందా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎంపీగా గెలిచే అభ్యర్థి రైల్వేలైన్‌ కోసం కృషి చేయాలని ఓటర్లు కోరుతున్నారు. దీంతో భూపాలపల్లి నుంచి కాజీపేట వరకు ప్రయాణంతో పాటు పారిశ్రామికంగా భూపాలపల్లి మరింత అభివృద్ధి చెందేందుకు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలున్నాయి.

నెరవేరని లెదర్‌ పార్కు కల

చర్మకారులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌ కేంద్రంలోని శివునిపల్లి లెదర్‌ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 117 ఎకరాల్లో రూ.275కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లెదర్‌ పార్కు నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేశారు. అయితే ప్రతిపాదనలు అటకెక్కటంతో 2002లో టీడీపీ ప్రభుత్వ హయంలో 25 ఎకరాల్లో మినీ లెదర్‌ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు .10కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఇందుకోసం తొలి విడతలో స్థానికంగా ఆసక్తితో ఉన్న 50మందికి చెన్నైలో చెప్పులు తయారు చేయటం, లెదర్‌ బ్యాగులు, ఇతర లెదర్‌ ఉత్పత్తుల తయారీపై శిక్షణ కూడా ఇప్పించారు. 2003లో రూ.10లక్షలతో లెదర్‌ పరిశ్రమ కోసం ఓ భవనం కూడా నిర్మించారు. మరో రెండు విడతల్లో 120మందికిపైగా లెదర్‌ ఉత్పత్తుల తయారిపై చైన్నైలో శిక్షణ కూడా ఇచ్చారు. అయినప్పటికి ఇప్పటి వరకు లెదర్‌ పార్కుకు మోక్షం లేదు. ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులు స్టేషన్‌ఘనపూర్‌తో సంబంధాలున్న నేతలే కావడంతో గెలిచిన వెంటనే లెదర్‌ పార్కును పూర్తి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. వెయ్యి కుటుంబాలకు పైగా లెదర్‌ పార్కుతో ఉపాధి లభించే అవకాశాలున్నాయి.

అగమ్యగోచరంగా సైనిక్‌ స్కూల్‌ పరిస్థితి

కేంద్ర ప్రభుత్వం 2016లో వరంగల్‌కు సైనిక్‌ స్కూల్‌ను మంజూరు చేసింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం కారణంగా పునాదులు కూడా పడటం లేదు. సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు కావాల్సిన భూమి, భవనాల నిర్మాణం, ఇతర మౌళిక వసతుల కల్పన కోసం రూ.కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ధర్మసాగర్‌ మండలం ఎల్కుర్తిలో ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ 229 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో 50 ఎకరాలను సైనిక్‌ స్కూల్‌కు కేటాయించాలని అధికారులు ప్రయత్నించారు. ఆ భూములను తీసుకుని రైతులకు పరిహరం ఇస్తామని అధికారులు చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. భూ కేటాయింపుల నిర్లక్ష్యంతో వరంగల్‌కు వచ్చిన సైనిక్‌ స్కూల్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు తరలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రాజకీయ పార్టీలు దృష్టిసారించి వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌కు మోక్షం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరికొన్ని అభివృద్ధి పనులు, సమస్యలు

  • మడికొండలో వీవర్స్‌ పార్కు అభివృద్ధికి చేయూతనిచ్చేలా కేంద్రం నుంచి తీసుకురావాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

  • వరంగల్‌ మహానగరంలో ఐటీ టవర్స్‌ను తీసుకరావటంతో పాటు కొత్త పరిశ్రమలు వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని వరంగల్‌వాసులు ఆకాంక్షిస్తున్నారు.

  • వరంగల్‌ ప్రాంత విద్యార్థులకు పెద్ద దిక్కుగా ఉన్న కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొత్త కోర్సులు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా దృష్టి పెట్టాలని విద్యార్థులు విన్నవిస్తున్నారు.

  • ఖిలా వరంగల్‌ కోటను మరింత అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

  • భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు అత్యధికంగా ఉండటంతో ఇక్కడ మైనింగ్‌ విద్యాలయంతో పాటు ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు కూడా చొరవ చూపాలన్న డిమాండ్‌ ఉంది.

  • జనగామ నుంచి పాలకుర్తి మీదుగా మహబూబాబాద్‌కు వెళ్లే సుమారు 110కి.మీ రోడ్డును విస్తరించి నాలుగు లైన్ల రోడ్డును అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

  • వర్ధన్నపేటలో ఉన్న 30 పడకల అస్పత్రిని వందపడకల అస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనం నిర్మించాలని స్థానికులు విన్నవిస్తున్నారు.

  • స్టేషన్‌ఘనపూర్‌ను మునిసిపాలిటీగా మార్చాలని. 30 పడకల అస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలని ఇక్కడి ప్రజలు కోరతున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:02 AM