Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభమెప్పుడు?

ABN , Publish Date - May 05 , 2024 | 12:14 AM

వరి కోతలు పూర్తయ్యాక రైతులు ధాన్యం విక్రయాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తుందోనని రైతువేదికల వద్ద నిరీక్షిస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభమెప్పుడు?
మంబాపూర్‌లో రైతువేదిక వద్ద ధాన్యం రాశులు

అకాల వర్షాలతో అన్నదాతల భయాందోళన

కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్న రాశులు

పెద్దేముల్‌, మే 4 : వరి కోతలు పూర్తయ్యాక రైతులు ధాన్యం విక్రయాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తుందోనని రైతువేదికల వద్ద నిరీక్షిస్తున్నారు. అధికారులు మాత్రం ఎన్నికల హడావిడిలో పడిపోయి రైతుల సంగతి మరిచినట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దేముల్‌ మండలంలో సుమారు 3,500 ఎకరాల్లో రైతులు వరిని సాగుచేశారు. గతేడాది వర్షాకాలం చివరలో నెలరోజుల పాటు వర్షాలు కురవలేదు. దాంతో చెరువులు, కుంటల్లో పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. భూగర్భజలాలు కూడా అంతంతమాత్రంగానే ఉండిపోయాయి. చెరువుల కింద వర్షాకాలంలో పంటలు సాగుచేసుకున్న రైతులు నీరులేక రబీపంటలు సాగుచేయలేదు. బోరుబావుల కింద కొందరు రైతులు వరి సాగుచేశారు. వరికోతలు ప్రారంభమై పదిహేను రోజులు కావస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే స్థలానికి చేర్చి రాశులుగా పోశారు. అయితే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆలస్యం అవుతుండడంతో పాటు ఎండలకు ధాన్యం తూకం తక్కువవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ధాన్యం రాశులవద్ద కాపలా ఉండడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. అంతేకాకుండా అకాల వర్షాలు ముంచెత్తితే ఉన్న ధాన్యం కూడా పాడైపోతుందని భయపడుతున్నారు. కాంగ్రె్‌స పార్టీ అధికారంలోకి రాగానే ధాన్యానికి క్వింటాలుకు బోనస్‌ కింద రూ.500 ఇస్తామని చెప్పడంతో రైతులు ఆశలు పెంచుకున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:14 AM