Share News

చివరి నిమిషంలో కేటీఆర్‌ రోడ్‌షో రద్దు

ABN , Publish Date - May 05 , 2024 | 12:13 AM

ఎన్నికల వేళ పార్టీ కేడర్‌లో జోష్‌ నింపాలన్న ఉద్దేశ్యంతో మేడ్చల్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌తో శనివారం నిర్వహించతలచిన రోడ్‌షో చివరి నిమిషాల్లో రద్దయ్యింది. ఫలితంగా నాలుగు గంటల పాటు తమ నేత కోసం ఎదురుచూసిన బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు, అభిమానులు నిరుత్సాహంతో వెను దిరిగారు.

చివరి నిమిషంలో కేటీఆర్‌ రోడ్‌షో రద్దు

నిరుత్సాహపడిన బీఆర్‌ఎస్‌ కేడర్‌.. ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రసంగం

మేడ్చల్‌ టౌన్‌, మే 4 : ఎన్నికల వేళ పార్టీ కేడర్‌లో జోష్‌ నింపాలన్న ఉద్దేశ్యంతో మేడ్చల్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌తో శనివారం నిర్వహించతలచిన రోడ్‌షో చివరి నిమిషాల్లో రద్దయ్యింది. ఫలితంగా నాలుగు గంటల పాటు తమ నేత కోసం ఎదురుచూసిన బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు, అభిమానులు నిరుత్సాహంతో వెను దిరిగారు. మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కేటీఆర్‌ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శనివారం సాయంత్రం 4:30 గంటలకు మేడ్చల్‌లో నిర్వహించాల్సిన రోడ్‌షోను ఎండ వేడిమి కారణంగా 7:30 గంటలకు నిర్వహించటానికి ఏర్పాట్లు చేపట్టారు. నాలుగు గంటల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున జనాలను వివేకానంద చౌరస్తా వద్దకు తరలించారు. కుత్బుల్లాపూర్‌ రోడ్‌షోలో ఉన్న కేటీఆర్‌.. చివరకు రావటం లేదని నాయకులు ప్రకటించారు. కాగా, అధికారంలోకి రాక ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల కోసం అరవై అబద్దాలు చెప్పి.. ప్రజలను మోసం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేసే స్థితిలో కాంగ్రెస్‌ లేదన్నారు. భాస్కర్‌ యాదవ్‌, దయానంద్‌ యాదవ్‌, తదితరులున్నారు.

‘బీజేపీని ఓడించి ‘ఇండియా’ను గెలిపించండి’

వికారాబాద్‌, మే 4: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ‘ఇండియా’ కూటమిని గెలిపించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై.మహేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, పదేళ్ల కాలంలో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బును జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వసూలు చేసి పెట్టుబడుదారులకు కట్టబెడుతోందన్నారు. 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు శ్రీనివాస్‌, రాములు, శ్రీకాంత్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:13 AM