Share News

ఓటుహక్కును వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 05 , 2024 | 12:11 AM

వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ సంక్షేమ అధికారి జ్యోతి పద్మ తెలిపారు.

ఓటుహక్కును వినియోగించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ

వికారాబాద్‌, మే 4: వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ సంక్షేమ అధికారి జ్యోతి పద్మ తెలిపారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల సాధికారత శాఖ, స్వీప్‌ సంయుక్తంగా వారికి కలెక్టరేట్‌లో లోక్‌సభ ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మే 13న జరిగే చేవెళ్ల పార్లమెంటరీ ఎన్నిక ఉన్నందున వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లు జిల్లావ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద వీల్‌చైర్లు, ర్యాంప్‌ల సౌకర్యాలు కల్పించామని చెప్పారు. అదేవిధంగా వయోవృద్ధులు, దివ్యాంగులకు ఓటు వేయడానికి ఉచిత రవాణా సదుపాయంతో పాటు వీరికి సహాయం నిమిత్తం వలంటీర్లను నియమించినట్లు తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు పోలింగ్‌ బూత్‌లు వేర్వేరు వరుసల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి సత్తార్‌, షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి మల్లేశం, తెలంగాణ సీనియర్‌ సిటిజన్‌ అధ్యక్షుడు మురారి, ట్రాంజెండర్స్‌ జిల్లా అధ్యక్షుడు హరిజన్‌ రమ్య, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్‌ బలరాం, ట్రాన్స్‌జెండర్‌ స్పెషలిస్ట్‌ వరలక్ష్మి, బాబు, జిల్లా ఫీల్డ్‌ రెస్పాన్స్‌ ఆఫీసర్‌ మెరుపురి వెంకటేష్‌ పాల్గొన్నారు.

కొడంగల్‌: లోక్‌ సభ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై భరత్‌రెడ్డి అన్నారు. అధికారులు శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐతో పాటు పోలీస్‌ సిబ్బంది స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తాండూరులో హోం ఓటింగ్‌ పూర్తి

తాండూరు: తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కి సంబందించి నాలుగు రూట్‌లలో శనివారం హోం ఓటింగ్‌ పూర్తిచేశారు. ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్న 16మంది వయోవృద్ధులు, 25మంది దివ్యాంగులు కాగా మొత్తం 41 ఓటర్లకు గాను 40 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫారం 12ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న పెద్దేముల్‌ మండలం ఓటరు ఒకరు వారం రోజుల కిందట మృతిచెందడంతో 40మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆదివారం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో కమిషనింగ్‌ చేసి ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేస్తున్నట్లు తాండూరు సహాయ రిటర్నింగ్‌ ఎన్నికల అధికారి శ్రీనివాస రావు తెలిపారు.

పోస్టల్‌బ్యాలట్‌ను వినియోగించుకున్న ఉపాద్యాయులు

పెద్దేముల్‌: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాద్యాయులకు శుక్రవారం నుండి పోస్టల్‌బ్యాలట్‌ ప్రారంభమైంది. ఉద్యోగ, ఉపాద్యాయులు వారి వీలును బట్టి పోస్టల్‌బ్యాలట్‌ ఉపయోగించుకుంటున్నారు. తాండూరు పట్టణంలోని నం 1 పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో రెండవరోజు శనివారం ఉద్యోగ, ఉపాద్యాయులు పోస్టల్‌బ్యాలట్‌ను ఉపయోగించుకున్నారు. పెద్దేముల్‌ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాద్యాయులు సుమారు 30 మంది వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:11 AM