Share News

బీజేపీ గెలుపునకు కృషి చేయాలి : ఈటల

ABN , Publish Date - May 05 , 2024 | 12:12 AM

ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేసి బీజేపీ విజయానికి కృషి చేయాలని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మేడ్చల్‌ మండలంలోని రాయిలాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు గ్రామపెద్దలు, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు శనివారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు.

బీజేపీ గెలుపునకు కృషి చేయాలి : ఈటల
మేడ్చల్‌ టౌన్‌ : ఈటల సమక్షంలో బీజేపీలో చేరుతున్న రాయిలాపూర్‌ గ్రామస్తులు

మేడ్చల్‌ టౌన్‌, మే 4 : ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేసి బీజేపీ విజయానికి కృషి చేయాలని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మేడ్చల్‌ మండలంలోని రాయిలాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు గ్రామపెద్దలు, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు శనివారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి చేయాలని కోరారు. జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు నందారెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజ హరినాథ్‌, నాయకులు దొడ్డ మల్లికార్జున్‌ ముదిరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వల్ల ఒరిగిందేమీ లేదు

కుత్బుల్లాపూర్‌ : దేశాభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ఉగ్రవాదుల భయం లేకుండా ఉండాలన్నా, ఆర్థిక వ్యవస్థ మెరుగు పడాలన్నా, మౌలిక వసతులు సమకూరాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వల్ల ఒరిగిందేమీలేదని ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధి వెంకటేశ్వరనగర్‌, మోదీ బిల్డర్స్‌లో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనను మల్కాజిగిరి ఎంపీగా గెలిపించి ఆశీర్వదిస్తే ఇక్కడి సమస్యలపై నేరుగా ప్రధానితో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని అడుగుతున్న వారు ఇదే ప్రశ్నను అభినందన్‌ తల్లిని, మన నేవీ ఉద్యోగులను అడిగితే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహా ఏదీ నెరవేరలేదన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇక్కడ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లిన ప్రజలు ఆదరిస్తున్నారని, ఎంపీగా గెలవడం ఖాయమనే భరోసా ఇస్తున్నారని, గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మోదీ ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మల్లారెడ్డి, భరత్‌సింహారెడ్డి, వాసు, సీనియర్‌ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఆశీర్వదించి గెలిపించాలి

జోన్‌బృందం : గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తనను ఆశీర్వదించి గెలిపించాలని ఈటల అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్‌లోని అయోధ్యనగర్‌, కుత్బుల్లాపూర్‌, భూమిరెడ్డినగర్‌ తదితర ప్రాంతాల్లో కుత్బుల్లాపూర్‌ నాయకులతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలు మంగళహారతులతో రాజేందర్‌ను ఆశీర్వదించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో ఒకే చట్టం ఉండాలని ఎంతో కృషి చేశారని, కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, దాన్ని ప్రత్యేక రాష్ట్రంగా.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దేశంలో టెర్రలిస్టులకు, మిలిటెంట్లలకు సింహ స్వప్నంగా మారారని అన్నారు. సైనికులకు మోదీ అండగా నిలబడి, దేశ విదేశాల్లో వారి కీర్తి ప్రతిష్టలను పెంపొందించారన్నారు. నాయకులు డాక్టర్‌ ఎస్‌.మల్లారెడ్డి, భరత్‌సింహారెడ్డి, బక్క శంకర్‌రెడ్డి, తదితరులున్నారు.

బౌరంపేట, నిజాంపేట్‌లో ప్రచారం

ఈటల రాజేందర్‌కు మద్దతుగా జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్వరాచారి కౌన్సిలర్‌ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ ప్రధాని కార్యదర్శి నర్సింహాచారిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాజేందర్‌ను గెలిపించాలని కోరారు. నిజాంపేట్‌ 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రణీత్‌గ్రేటెడ్‌ కమ్యూనిటీ సర్కిల్లో ఈటలను గెలిపించాలని, నవభారత నిర్మాత నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ స్ధానికులతో ప్రచారం నిర్వహించారు. శ్రీనివాస్‌రెడ్డి, విజ్ఞాన్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, సోమశేఖర్‌ పాల్గొన్నారు.

ఎమర్జింగ్‌ భారత్‌ కార్యక్రమంలో ఈటల

సుచిత్రలో నిర్వహించిన ఎమర్జింగ్‌ భారత్‌ కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడుతూ భారత్‌ను ప్రధాని ప్రపంచ దేశాల్లో తలెత్తుకునే విధంగా చేశారన్నారు. మల్కాజిగిరిలో తనను ఆశీర్వదించి బీజేపీ గెలిచే 400 ఎంపీ స్థానాల్లో ఒకడిగా నిలబెట్టాలని ప్రజలను కోరారు.

ఈటల రాజేందర్‌ను గెలిపించాలి

హయత్‌నగర్‌ : ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కోరుతూ మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి డివిజన్‌ పరిధిలోని సీఎ్‌సఆర్‌ కాలనీ, గ్రీన్‌ సిటీ కాలనీ, ఛండీశ్వరి కాలనీ, గాయత్రినగర్‌ కాలనీ, వీరన్నగుట్ట కాలనీ, స్వాతి రెసిడెన్సీ, బొమ్మలగుడి ప్రధాన రోడ్డు వెంట ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకే ఓటు వేసి ఈటలను గెలిపించాలని కోరారు. బూత్‌ కమిటీ నాయకులున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:12 AM