Share News

ఆటలతో.. ఆహ్లాదం ఆరోగ్యం

ABN , Publish Date - May 04 , 2024 | 11:25 PM

చదువుతో కుస్తీ పట్టిన చిన్నారులు వేసవి సెలవుల్లో ఆటవిడుపునకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. చాలా మంది పిల్లలు క్రికెట్‌పై నే మక్కువ చూపుతున్నారు. కొందరు చదరంగం, ఖోఖో, మార్షల్‌ ఆర్ట్స్‌, డాన్స్‌, గల్లీ ఆటలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు.

ఆటలతో.. ఆహ్లాదం ఆరోగ్యం

వేసవి సెలవుల్లో ప్రాధాన్యమిస్తున్న పిల్లలు

ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఆటలతో సృజనాత్మకతకు పదును

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు

కోదాడ: చదువుతో కుస్తీ పట్టిన చిన్నారులు వేసవి సెలవుల్లో ఆటవిడుపునకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. చాలా మంది పిల్లలు క్రికెట్‌పై నే మక్కువ చూపుతున్నారు. కొందరు చదరంగం, ఖోఖో, మార్షల్‌ ఆర్ట్స్‌, డాన్స్‌, గల్లీ ఆటలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతికి వెళ్లనున్న విద్యార్థులు సెలవుల్లో సిలబ్‌సపై పట్టు సాధించి మెరుగైన ఫలితాల సాధన కు కృషి చేస్తున్నారు. మరి కొంత మంది చిత్రలేఖనం, స్విమ్మింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌పై పరిజ్ఞానంపై దృష్టి సారించారు. అయితే వారికి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇస్తే మెళకువలు నేర్చుకోవడంతోపాటు సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లల్లో సామాజిక దృక్పథం పెంపొందించే పనులను సైతం వారితో చేయించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి. చి న్నారులకు భవిష్యత్తులో ఉపయోగపడే కొన్ని క్రీడలు, పట్టుసాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని ఏంటో చూద్దాం..

తైక్వాండో..

తైక్వాండో(కరాటే)లో శిక్షణ తీసుకోవడం వల్ల చిన్నారుల బంగారు భవిషత్‌కు భద్రత ఉంటుంది. నాలుగేళ్ల వయసున్న పిల్లల నుంచి మొదలు ఇంటర్‌ విద్యార్థులు సైతం తైక్వాండోలో శిక్షణ పొందవచ్చు. కరాటేలో శిక్షణ తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేగాక రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా వారి పనులను వారు చురుకుగా చక్కబెట్టుకుంటారు. చదువులో ఏకగ్రత, క్రమశిక్షణ అలవడుతుంది, ప్రత్యార్థుల నుంచి ఎదురయ్యే సమస్యలను అధిగమించే నైపుణ్య సాధనలో తైక్వాండో శిక్షణ సహాయపడుతుంది.

ఖోఖో..

సంవత్సరం మొత్తం పుస్తకాలతో కుస్తీ పడిన విద్యార్థులు వేసవిలో క్రీడలతో చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖోఖోతో శరీరం మొత్తం కదిలి వ్యాయామం అవుతుంది. ఈ ఆటలో పిల్లలు అధికంగా పరుగెత్తడం ఉంటుంది. దీని ద్వారా శరీరంలో రక్త ప్రసరణ పెరిగి, ఆరోగ్యం మెండుగా మారుతుంది. ఈ ఆటలో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య కూడా ఎక్కువ కావడం వల్ల జట్టుగా పనిచేసే, కలివిడితనంగా ఉండే గుణం అబ్బుతుంది.

కబడ్డీ..

గ్రామీణ ఆట ల్లో కబడ్డీ ఒకటి. ఈ క్రీడకు కాస్త ఆదరణ తగ్గిన సమయంలో ప్రో కబడ్డీతో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరగడం ప్రారంభమైంది. జట్టుగా ఆడే క్రీడ ఇది. ఈ ఆటతో శరీర దృఢత్వం పెరగడంతో పాటు వేగంగా ఆడే ఆటకావడంతో రక్తప్రసరణ వృద్ధి చెందుతుంది. ఎముకలు బలపడతాయి.

క్రికెట్‌ ..

విద్యార్థులు ప్రస్తుతం అత్యంత గా ఇష్టపడే ఆటల్లో క్రికెట్‌ ఒకటి. సెల వు వచ్చిందంటే చాలు బ్యాట్‌, బాల్‌ పట్టుకొని గల్లీలో క్రికెట్‌ ఆడే పిల్లలు చాలా మంది కనిపిస్తుంటారు. నలుగురు ఫ్రెండ్స్‌ గుమికూడారంటే గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడుతూనే ఉంటారు. అంతగా క్రికెట్‌ ఆదరణ పొందింది. కాగా, క్రికెట్‌తో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతోపాటు, చురుకుదనం పెరుగుతుంది. అంతేగాక క్రికెట్‌తో శారీరక దృఢత్వం, జట్టుగా పనిచేసే గుణం అలవడుతుంది.

స్విమ్మింగ్‌..

నేటి పిల్లలకు స్విమ్మింగ్‌(ఈత) నేర్చుకోవడం చాలా అవసరం. ఈవేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఈత నేర్చుకొనేందుకు స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకుంటే మంచిది. స్వి మ్మింగ్‌ ద్వారా తమను తాము రక్షించుకొనే మానసిక దృఢత్వం అలవడుతుంది.అంతేగాక బావులు, నదులు, సముద్రాలవద్దకు పిక్‌నిక్‌, టూర్‌లకు వెళ్లినప్పుడు సిమ్మింగ్‌ వచ్చి ఉంటే నీటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

కంప్యూటర్‌పై పట్టు

నేటి పోటీ ప్రపంచంలో అంతా టెక్నాలజీ మయమైంది. దాని ప్రాధాన్యాన్ని గుర్తించి వేసవిలో పిల్లలకు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తే మంచిది. అదేవిధంగా చిన్నారుల సైతం కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉత్సుకత చూపుతుంటారు. పాఠశాలలు ప్రారంభమైతే కంప్యూటర్‌ పరిజ్ఞానం నేర్చుకునేందుకు వీలుకాదు. అందుకే వేసవిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అదేవిధంగా కంప్యూటర్‌ పరిజ్ఞానం పేరుతో పిల్లలు వీడియో గేమ్స్‌కు అలవాటు పడకుండా, భవిష్యత్‌లో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజెస్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ నేర్పించడం మంచిది.

చదరంగం..

పిల్లల్లో మేధస్సుకు పనిచెప్పే ఆటల్లో చదరంగం ముఖ్యమైనది. ఈ క్రీడతో పిల్లల్లో సమయస్ఫూర్తి, ఆలోచనాశక్తి, సమస్యకు పరిష్కారం చేసే నైపుణ్యం అలవడుతుంది. ఇంటి వద్దనే పిల్లలు శిక్షకుడి సహాయంతో ఈ ఆటను నేర్చుకోవచ్చు.

క్యారమ్‌..

ఏకాగ్రతతో లక్ష్యానికి ఎలా గురిపెట్టాలో నేర్పే ఆట క్యారమ్‌. పిల్లలు వేసవిలో ఇంటి వద్దే ఈ ఆటను నేర్చుకోవచ్చు. ఈ ఆటతో చదువులో ఏకాగ్రతో పెరుగుతుంది.

పోటీ పరీక్షలకు సన్నద్ధం

పిల్లల భవిష్యత్‌ పోటీ పరీక్షలతో ముడిపడి ఉంది. పదో తరగతి, ఇంటర్‌ పూర్తయినవారు పోటీ పరీక్షల్లో రా ణించేందుకు కోచింగ్‌ ఇప్పించడం మంచిది. పోటీ పరీక్ష లు ఐటీఐ, పాలిటెక్నిక్‌, టీఎ్‌సఆర్‌జేసీ లాంటి పరీక్షలకు సన్నద్ధం చేయించాలి. అంతేగాక గణితంలో పట్టు సాధించేందుకు క్వాంటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఆల్‌జీబ్రాలో కోచింగ్‌ ఇప్పించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

వాకింగ్‌, పరుగు..

నేటి పిల్లలు అధికంగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డా రు. పాఠశాల సమయంలో కేక్‌టు, పఫ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు, చిప్స్‌ తదితర జంక్‌ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. విద్యార్థులు వేసవిలో వాకింగ్‌, పరుగు చేయడం వల్ల చక్కని శరీర ఆకృతి ఏర్పడుతుంది. అంతేగాక వాకింగ్‌, పరుగు ఆరోగ్యానికి మంచిది.

స్పోకెన్‌ ఇంగ్లీష్‌

ఉజ్వల భవిష్యత్‌కు కమ్యూనికేషన్‌ సిల్క్స్‌ ఎంతో అవసరం. విద్యార్థులు మున్ముందు చదువుకొనే కోర్సుల్లో ఉత్తమమైన ప్రతిభ, పోటీ పరీక్షలో రాణించేందుకు అవసరమైన ఇంగ్లీష్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వే సవిలో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ ఉపయోగకరం.

ఈ ఆటలపై ఓ కన్నేద్దాం

గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటలు ఎన్నో నేడు కనుమరుగవుతున్నాయి. గోళీకాయ, జిల్లాగోనే, దాగుడుమూతలు, అష్టాచెమ్మా, పచ్చీసు, తోక్కుడు బిళ్ల, చెమ్మచక్క, పిచ్చిబంతి, కోతికొమ్మచ్చి, గుజ్జనగూళ్లు, గుడు గుడుగుంజం, దాడి, నేలబండ, పులిజూదం, రాముడుసీత, వామన గుంటలు లాంటి ఆటలు ప్రస్తుత కంప్యూటర్‌ కాలంలో కనుమరుగవుతున్నాయి. నేటి చిన్నారులు బండే డు పుస్తకాలతో కుస్తీ పట్టడమే తప్పా ఆటలు తెలియని పరిస్థితి నెలకొంది. సమయం దొరికితే తల్లిదండ్రుల సెల్‌ ఫోన్‌లో ఆటలు ఆడటం తప్ప గ్రామీణ ఆటలు వారికి పరిచయమే ఉండటం లేదు. ఈ ఆటల పేర్లే తెలియడం లేదు. మానసిక ఉల్లాసాన్ని, సామాజిక దృక్పథాన్ని నేర్పే గ్రామీణ క్రీడలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆటలు, వాటి తీరుతెన్నులు ఇలా..

సీసం గోళీ

ఈ ఆటను మూడు విభాగాలుగా విభజిస్తారు. ఒకటి గుంట ఆట, రెండు ఆస్‌ ఆట, మూడు బొంబాయి ఆట. వీటిని ఎంతమందైనా ఆడవచ్చు. గుం ట ఆటలో దూరం నిచ్చి గోళీకాయ విసురుతారు. ఎవరైతే గుంటకు దగ్గర గోళీ వేయగలరో వారు మిగ తా వారు గెలిచినట్టు. ఆస్‌ ఆట దీర్ఘచతుర్రస ఆకారంలో ఉన్న ఒక చట్రంలో గోళీలను ఉంచుతారు. సుమారు మూడు మీటర్ల దూరం నుంచి తమ దగ్గర ఉన్న మరో గోళీని చట్రంలో ని గోళీలకు విసురుతారు. ఇలా చట్రంలోపల ఉన్న గోళీలను బయటికి కొడుతూ విజయం సాధిస్తారు. బొంబాయి ఆటలో ఓ వృత్తం గీసి అందులో గోళీలు ఉంచుతారు. దూరం నుంచి ఆగీతకు దగ్గరకు ఎవరు గోళీ వేస్తారో వారు మొదట వృత్తంలోని గోళీలను కొట్టాల్సి ఉంటుంది. వృత్తంలో వచ్చిన గోళీలు వారి సొంతమవుతాయి.

జిల్ల గోనె

జిల్లగోనెలో రెండు జట్లు ఉంటాయి. ప్రతీ జట్టులో 11 మంది సభ్యులు ఉంటారు. రెండు జట్ల కెప్టెన్లలో ఒకరు జిల్లను విసిరివేస్తే రెండో వ్యక్తి దాన్ని కొట్టాలి. అతడు కొట్టిన జిల్లను రెండో జట్టు వాళ్లు అందుకోవాలి. అప్పుడు వారు ఆడాలి. జిల్లను అందుకోలేకపోతే మొదటి జట్టు వాళ్లే ఆటను కొనసాగిస్తారు. ఇలా ఆడుతున్న సమయంలో గూటికి జిల్ల విసిరితే ఎదుటివారు దాన్ని ఎగరేసి కొట్టాల్సి ఉంటుంది. అలా కొట్టిన తరువాత గోనేతో కంటే, రూళ్లు, మూళ్ల, నాళ్ల, ఐదుళ్ల, ఆరుళ్ల, ఏడుళ్ల, ఎనిమిదళ్ల, తొమ్మిదళ్ల, బిల్లా అంటూ లెక్కిస్తారు. అలా పది లెక్కేశాక ఒక పాయింట్‌ వస్తుంది. జిల్లను రెండుసార్లు గాలిలో ఎగరేసి కొడితే రెట్టింపు పాయింట్లు వస్తాయి. ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే వారు విజయం సాధించినట్టు.

ఏడు పెంకులాట

గ్రామ్లాలో చిన్నారులు వీధుల్లో ఎక్కువగా ఆడే ఆట పెంకులాట. రెండు జట్ల మధ్య ఆడే ఈ ఆటలో ఏడుపెంకులు (నాపరాళ్ల ముక్కలు) బంతితో కొడతారు. పెంకులను పడేశాక తిరిగి వాటిని పేర్చాలి. ఈ క్రమంలో అవతలి జట్టువారు బంతితో కొడతారు. బంతి తాకకుండా పెంకులు పేరిస్తే విజయం సాధించినట్టు.

కోతికొమ్మచ్చి

ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎంచుకుంటారు. మిగతా వారిలో ఒకరు వృత్తాకారం గడి నుంచి కర్రను విసురుతారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిని తాకడానికి ప్రయత్నిస్తాడు. మిగతా వారు అతడికి దొరకుండా గిరి దగ్గరికి వస్తారు. ఇలా ఆటా కొనసాగుతూ ఉంటుంది.

గుజ్జన గూళ్లు

ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో పప్పలు, మరమరాలు, బెల్లం, పంచదారతో ఆడుకొనే ఆట ఇది. ఉమ్మడి కుటుంబాలకు నాందిపలికిన ఆట గుజ్జన గూళ్ల ఆట.

గుడు గుడుగుంజం

బాలబాలికలు ఇష్టపడే ఆట ఇది. పిల్లలందరూ ఓ చోట కూర్చుని రెండు చేతులు పిడికిళ్లు బిగించి ఒకరి పిడికిలి మీద, మరొకరు పిడికిలి ఉంచుతారు. ఆటలో పెద్దగా ఉండే ఒకరు పిడికిలిలో తన చూపుడు వేలును ఉంచి ఆడి స్తూ పాటను పాడుతూ ఉత్సాహంగా ఆటను కొనసాగిస్తారు.

తొక్కుడు బిళ్ల

గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు అధికంగా ఆడే ఆట తొక్కుడుబిళ్ల. నాలుగు నిలువుగళ్లు, రెండు ఆడ్డగళ్లు గీచి, బిళ్లను దీర్ఘచతురస్ర గడుల్లో వేసి కాలు మడిచి ఎనిమిది గడుల నుంచి బిళ్లను బయటకు తీసుకొచ్చే ఆట ఇది.

దాగుడు మూతలు

కళ్లు మూసుకొని అంకెలు లెక్కపెట్టెలోగా మిగతా వారు రహస్య ప్రదేశాలలో దాక్కుంటారు. వారిని కనిపెట్టే ఆట దాగుడు మూతల ఆట.

నెలబండ

నెల మీద దొంగ, మిగతా వారు బండ మీద ఉండి ఆడే ఆట నెలబండ. బండమీద ఉంటూ దొంగను ఆటపట్టిస్తు ఈ ఆటను ఆడుతుంటారు. నెల మీదకు వచ్చిన వారిని దొంగ పట్టుకొవాలి. అతడికి దొరికిన వారు దొంగగా ఆడాల్సి ఉంటుంది.

Updated Date - May 04 , 2024 | 11:25 PM