Share News

యర్కారంలో టెన్షన టెన్షన

ABN , Publish Date - May 04 , 2024 | 11:43 PM

సూర్యాపేట మండల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి మృతికి నివాళిగా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం 12మంది ఇళ్లపై దాడికి కారణమైంది.

యర్కారంలో టెన్షన టెన్షన
యర్కారం గ్రామంలో ఎల్లయ్య అభిమానుల దాడిలో ధ్వంసమైన సామాగ్రి

ఉద్రిక్తతకు దారితీసిన ర్యాలీ

నేడు సంతాప సభ

సూర్యాపేట రూరల్‌, మే 4: సూర్యాపేట మండల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి మృతికి నివాళిగా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం 12మంది ఇళ్లపై దాడికి కారణమైంది. దీంతో సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలో యర్కారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మాజీ నక్సలైట్‌, సూర్యాపేట మండల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య గత నెల 18న భార్యాభర్తల పంచాయితీని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట వెళ్లి హత్యకు గురయ్యాడు. ఎల్లయ్యకు నివాళిగా ఆయన అభిమానులు యర్కారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమ ంలో ర్యాలీకి ఎదురుపడిన ఎల్లయ్య ప్రత్యర్థులు గ్రామానికి ఆయన చేసిందేమీ లేదని వాగ్వాదానికి దిగారు. ర్యాలీని ఆపాలని ఎదురుతిరిగారు. అయితే అప్పటికే గ్రామంలో ఉన్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి సద్దుమణిగేలా చేశారు. రాత్రి 9గంటల తర్వాత ఎల్లయ్య వర్గీయులు గ్రామంలోని ఆయన ప్రత్యర్థుల ఇళ్లపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సుమారు 12మంది ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై గ్రామస్థుడు పల్స లక్ష్మణ్‌ శనివారం ఉదయం ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ బాలునాయక్‌ తెలిపారు.

దాడి ఘటనలో 27మంది అరెస్టు, రిమాండ్‌

ఎల్లయ్య అనుచరులు గ్రామంలోని ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేశారన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ బాలునాయక్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడిలో పాల్గొన్న 27మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. పాతకక్షలతో గ్రామంలో అల్లర్లు సృష్టిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

గ్రామంలో నాలుగేళ్లుగా పికెటింగ్‌

సూర్యాపేట మండలంలో యర్కారం గ్రామం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. నాలుగేళ్ల కిందట సర్పంచ ఒంటెద్దు వెంకన్నను హత్య చేసిన ఘటనలో ఎల్లయ్య ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హత్య అనంతరం గ్రామంలో ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు గ్రామంలో పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు. మొదట్లో 10మంది పోలీసులు విడతల వారీగా గ్రామంలో పికెటింగ్‌ నిర్వహించేవారు. ఎల్లయ్య కిడ్నా్‌పకు గురయ్యే నాటి వరకు నలుగురు కానిస్టేబుళ్లు పికెటింగ్‌ పాల్గొనేవారు. గ్రామపంచాయతీ భవనం వద్ద ఇద్దరేసి చొప్పున ఉంటూ, గ్రామంలో పర్యటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణను చూస్తుండేవారు. ఎల్లయ్య కిడ్నాప్‌ అయిన రోజు నుంచి గ్రామంలో 50 మంది పోలీసులతో భారీ పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లయ్య హత్య, సంతాపంగా ర్యాలీ, అనంతరం జరిగిన ఇళ్లపై జరిగిన దాడితో గ్రామంలో మరోసారి టెన్షన వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే గ్రామంలో శాంతి నెలకొంటున్న సమయంలో ఎల్లయ్య హత్యకు గురికావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నేడు ఎల్లయ్య సంతాప సభ

పంచాయితీ సెటిల్‌మెంట్‌ పేరుతో కిడ్నా్‌పకు గురై 14 రోజుల తర్వాత హత్యకు గురైనట్లు తెలిసిన వడ్డే ఎల్లయ్య సంతాప సభను ఆదివారం గ్రామంలో నిర్వహించేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లుచేశారు. ఈ సభకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రులు దామోదర్‌రెడ్డి, జానారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు హాజరవుతున్నట్లు ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గ్రామంలో తీసే ర్యాలీ సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాలని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Updated Date - May 04 , 2024 | 11:43 PM