Share News

హైదరాబాద్‌-విజయవాడ మధ్య ర్యాపిడ్‌ రైలు

ABN , Publish Date - May 04 , 2024 | 12:37 AM

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఆధునిక ర్యాపిడ్‌ రైల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ (టీపీసీసీ) హామీ ఇచ్చింది.

హైదరాబాద్‌-విజయవాడ మధ్య ర్యాపిడ్‌ రైలు

పీసీసీ మ్యానిఫెస్టోలో ప్రాజెక్టు

దీనిక కోసం పలుమార్లు కేంద్రాన్ని కోరిన మంత్రి ఉత్తమ్‌

కేంద్రీయ, నవోదయ విద్యాలయాలకు హామీ

స్థానిక సంస్థలకు నేరుగా కేంద్రం నిధులు

నల్లగొండ, మే 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఆధునిక ర్యాపిడ్‌ రైల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ (టీపీసీసీ) హామీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ ఇచ్చిన ‘పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారంటీ’లకు అనుబంధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పథకాలపై పీసీసీ ప్రత్యేకంగా 23 అంశాలపై రూపొందించిన మ్యానిఫెస్టోను పీసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తదితరులు శుక్రవారం ఆవిష్కరించారు.

నల్లగొండ ఎంపీగా పనిచేసిన సమయంలో ప్రస్తుత రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ర్యాపిడ్‌ రైలు కోసం పలుమార్లు డిమాండ్‌ చేయడంతో పాటు, ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. తాజాగా, పీసీసీ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే ఢిల్లీ-మీరట్‌ మధ్య ప్రస్తుత ఉన్న ర్యాపిడ్‌ రైల్వే వ్యవస్థ ఇక్కడ రానుంది. దీంతో ఈ మార్గంలో రైళ్లు గంటకు 160కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైల్వే స్టేషన్లల్లో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు తరహా సేవలు, సదుపాయాలు అందుబాటులో వస్తాయి. కీలకమైన ఈ ప్రాజెక్టు దక్కితే ఈ మార్గంలో ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ-బీబీనగర్‌ వరకు అభివృద్ధికి ఆస్కారం ఉందని పలువురు భావిస్తున్నారు. దీంతోపాటు డ్రైపోర్టులను కూడా ఏర్పాటుచేస్తామని టీపీసీసీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ ప్రాంతాలు డ్రైపోర్టులకు అనువైనవని గతంలోనే ప్రభుత్వం గుర్తించింది.

కేంద్రీయ, నవోదయ పాఠశాలల రెట్టింపునకు హామీ

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కేంద్రీయ పాఠశాలలు, నవోదయ పాఠశాలలను రెట్టింపు చేస్తామని పీసీసీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో ఒక నవోదయ పాఠశాలతో పాటు, నల్లగొండ, మిర్యాలగూడలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. భువనగిరి, సూర్యాపేటలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు ఏర్పా టు చేయాలనే డిమాండ్ల సాధనకు ఈ హామీలు తోడ్పడనున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో నాలుగు సైనిక్‌ స్కూళ్లను సైతం ఏర్పాటు చేయిస్తామనే కాంగ్రెస్‌ హామీ అమలైతే ఉమ్మడి జిల్లాకు ఒక సైనిక్‌ స్కూల్‌ దక్కే అవకాశముంది. దీంతోపాటు స్థానిక సంస్థలైన పంచాయతీ లు, మునిసిపాలిటీలకు నేరుగా కేంద్రం నుంచి నిధులను ఇస్తామని పీసీసీ ప్రకటించింది.

Updated Date - May 04 , 2024 | 12:37 AM