Share News

ప్రతీ ఎకరాకు సాగునీరు

ABN , Publish Date - May 03 , 2024 | 11:32 PM

‘పాలమూరులో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు, రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డి, మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలు కృషి చేస్తా. పార్లమెంట్‌ పరిధిలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేందుకు పరిశ్రమలు, టూ టైర్‌ ఐటీ హబ్‌లను డెవలప్‌ చేస్తా. నారాయణపేటకు దక్కకుండా పోయిన సైనిక్‌ స్కూల్‌ను మంజూరు చేయిస్తా. అన్ని సమస్యలు పరిష్కరించి, పార్లమెంట్‌లో పాలమూరు గొంతును వినిపిస్తా.

ప్రతీ ఎకరాకు సాగునీరు

రెండేళ్లలో పీఆర్‌ఎల్‌ఐ, పేట- కొడంగల్‌ పథకాలతో సాగునీరు

పరిశ్రమలు, ఐటీ హబ్‌ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు

నా వ్యక్తిత్వం, చిత్తశుద్ధిలో తప్పులు దొరక్క నాన్‌లోకల్‌ డ్రామాలు

కాంగ్రెస్‌ ప్రాజెక్టులు కడితే.. తాను తెచ్చానని అరుణ ప్రగల్భాలు

పాలమూరు ప్రజల సహకారంతో రెండు లక్షల మెజారిటీతో విజయం

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘పాలమూరులో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు, రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డి, మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలు కృషి చేస్తా. పార్లమెంట్‌ పరిధిలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేందుకు పరిశ్రమలు, టూ టైర్‌ ఐటీ హబ్‌లను డెవలప్‌ చేస్తా. నారాయణపేటకు దక్కకుండా పోయిన సైనిక్‌ స్కూల్‌ను మంజూరు చేయిస్తా. అన్ని సమస్యలు పరిష్కరించి, పార్లమెంట్‌లో పాలమూరు గొంతును వినిపిస్తా. పాలమూరు ప్రజల సహకారంతో రెండు లక్షల మెజారిటీతో విజయం సాధిస్తా’ అని అంటున్నారు మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

ప్రశ్న : ప్రచారం ఎలా సాగుతోంది.. విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

వంశీచంద్‌ : పాలమూరు పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా సాగుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనను హర్షిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి అండగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ముదిరాజులు బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’కు మార్పు, మంత్రి పదవి హామీతో సంతోషంగా ఉన్నారు. గొల్లకురుమలతో డీడీలు కట్టించుకుని కేసీఆర్‌ మోసం చేస్తే.. వాటిని వాపస్‌ ఇచ్చి రేవంత్‌ సర్కారు సహకరించిందనే అభిప్రాయంతో ఉన్నారు.

ప్రశ్న : పాలమూరులో ప్రాజెక్టులను తానే తెచ్చానని డీకే అరుణ అంటున్నారు..

వంశీచంద్‌ : ఉమ్మడి పాలమూరులో ప్రతీ ప్రాజెక్టు కాంగ్రెస్‌ హయాంలో వచ్చిందే. ఆ ప్రాజెక్టులు వచ్చినప్పుడు అరుణమ్మ కూడా కాంగ్రె్‌సలోనే ఉన్నారు. నీడ కోసం కుక్క బండి కింద నడుస్తూ.. తానే బండి బరువును మోసిందన్న చందంగా అరుణమ్మ మాట్లాడుతున్నారు. రాజకీయ అవసరాలకు కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులను అనుభవించి, బీజేపీకి అమ్ముడుపోయారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి రైల్వే పాసేజ్‌లు తెచ్చిందా?.. రైల్వేలైన్‌ తెచ్చిందా?.. సైనిక్‌ స్కూల్‌ పోతుంటే అడ్డుకుందా?.. పీఆర్‌ఎల్‌ఐకి జాతీయ హోదా తెచ్చిందా?.. కృష్ణా జలాల్లో రావాల్సిన 570 టీఎంసీల వాటా కోసం పీఎం మోదీని అడిగిందా? అరుణమ్మ సమాధానం చెప్పాలి.

ప్రశ్న : మీరు నాన్‌ లోకల్‌.. తాను లోకల్‌ అంటున్నారు ఎలా చూస్తారు?

వంశీచంద్‌ : నాది షేరి అప్పారెడ్డిపల్లి, కల్వకుర్తి నియోజకవర్గం. నేను పాలమూరు బిడ్డగా ఇక్కడ పోటీ చేస్తున్నా. గద్వాలలో సరిత అభ్యర్థిగా నిల్చుంటే ఆమె నాన్‌లోకల్‌ అని డీకే అరుణ చెప్పారు. అదే డీకే అరుణ పాన్‌గల్‌లో జడ్పీటీసీగా గెలిచినప్పుడు అక్కడ లోకల్‌.. గద్వాలలో ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ లోకల్‌.. ఇప్పుడు పార్లమెంట్‌లో ఇక్కడ లోకల్‌. అంటే ఆమెకు మూడు అవతారాలు ఉన్నాయా? నాన్‌ లోకల్‌ అనే దానికి కొలబద్ద ఏంటి? నరేంద్రమోదీ వారణాసిలో, ఈటల రాజేందర్‌ మల్కాజిగిరిలో లోకలా? ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది. నా వ్యక్తిత్వం, రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవలో చిత్తశుద్ధిలో తప్పులు లేక.. నాన్‌ లోకల్‌ అని డ్రామా చేస్తున్నారు. ఆమె సెల్ఫ్‌ గోల్‌ అయ్యింది.

ప్రశ్న : జీవో 69ని అరుణమ్మ అడ్డుకుందని రేవంత్‌రెడ్డి అన్నారుగా.. అందులో నిజమెంత?

వంశీచంద్‌ : జీవో 69ని అమలు చేసేందుకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తే ముమ్మాటికీ అరుణమ్మ అడ్డుకుంది. సైనిక్‌ స్కూల్‌ నారాయణపేట నుంచి పోతుంటే వేడుక చూశారు. భారత్‌మాల రహదారిలో నిర్వాసితులు అడ్డుకుంటే వారికి అన్యాయం చేశారు. ఆమె తండ్రి పేరుతో ఉన్న సంగంబండ వద్ద బండ పగులగొట్టకుండా అడ్డుకున్నారు. ఇవాల కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు న్యాయం చేసింది నేను. 1.30 లక్షల ఎకరాలకు నీరిచ్చే మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని రూ.4 వేల కోట్లతో మంజూరు చేశాం. రెండేళ్లలో ఈ పథకం పూర్తి చేసి, ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం.

ప్రశ్న : ఆడపడుచును ఓడించడానికి కుట్ర చేస్తున్నారని అంటున్నారు కదా.. మీరేమంటరు?

వంశీచంద్‌ : శాసనసభలో గౌరవ స్పీకర్‌ స్థానంలో ఉన్న పద్మా దేవేందర్‌రెడ్డిని ఆరోజు సంస్కారం లేని వ్యక్తి అని చెప్పి.. ఆమె కంటతడి పెట్టుకున్నప్పుడు ఆడపడుచు అని గుర్తుకు రాలేదా? ఒక ఆడపడుచు సరితమ్మ పోటీ చేస్తే.. అల్లుడి కోసం బోయ వాల్మీకి బిడ్డను నిలబెట్టి, ఆయనకు ఓట్లు పడకుండా వెన్నుపోటు పొడిచినప్పుడు సరితమ్మ ఆడపడుచు అని గుర్తుకు రాలేదా? ఒక ఇంటర్వ్యూలో చేతకాకపోతే గాజులు తొడుక్కోండి అంటూ మహిళలను కించపరిచేలా మాట్లాడిన అరుణమ్మ.. ఆడపడుచును ఓడించడానికి కుట్ర చేస్తున్నారనడం హాస్యాస్పదంగా ఉంది.

ప్రశ్న : బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అనే ఆరోపణల్లో వాస్తవమెంత?

వంశీచంద్‌ : ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒక్కటే. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీకి అమ్ముడు పోయారు. మా పని అయిపోయింది.. కాంగ్రె్‌సను ఓడగొట్టాలని కుమ్మక్కయ్యారు. నిజంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు సాధించుకోవాలి. తమ అభ్యర్థికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ప్రచారంలో సైలెంట్‌గా ఉండి.. బీజేపీకి ఓట్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రశ్న : మీరు గెలిస్తే ఎలా అభివృద్ధి చేస్తారు?

వంశీచంద్‌ : ప్రతీ ఎకరాకు కృష్ణా నీళ్లు తెచ్చేందుకు పీఆర్‌ఎల్‌ఐ, మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలను రెండేళ్లలో పూర్తి చేయిస్తా. కృష్ణా-వికారాబాద్‌ రైల్వేలైన్‌ను ఏడాలో పట్టాలెక్కిస్తా. మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషనల్‌.. ఐటీ హబ్‌గా, షాద్‌నగర్‌ను లాజిస్టికల్‌ హబ్‌గా, జడ్చర్లను ఇండస్ర్టియల్‌ హబ్‌గా, దేవరకద్రను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా, నారాయణపేటను టెక్స్‌టైల్‌ హబ్‌గా, మక్తల్‌ను టూరిజం హబ్‌గా మారుస్తాను. జూరాల, సంగంబండ, కోయిల్‌సాగర్‌, చంద్రఘడ్‌ పోర్టును అభివృద్ధి చేసి.. పర్యాటక ప్రాంతంగా మారుస్తా. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. కేంద్రీయ విశ్వవిద్యాలయం, సైనిక్‌ స్కూల్‌ తెస్తా. ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీలో ప్రతినిధిగా ఉంటా. ముదిరాజులను బీసీ- ఏలోకి మారుస్తా. మాదాసి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్‌ వచ్చేందుకు కృషి చేస్తా. షాద్‌నగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ తెప్పిస్తా. జడ్చర్లకు ఔటర్‌ లేదా బైపాస్‌ మంజూరు చేయిస్తా. అన్ని సమస్యలు పరిష్కరించి, పాలమూరు గొంతును పార్లమెంట్‌లో వినిపిస్తా.

Updated Date - May 03 , 2024 | 11:32 PM