Share News

జిల్లాను రద్దు చేస్తే మళ్లీ ఉద్యమం

ABN , Publish Date - May 03 , 2024 | 11:35 PM

జోగుళాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హెచ్చరించారు.

జిల్లాను రద్దు చేస్తే మళ్లీ ఉద్యమం
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల న్యూటౌన్‌, మే 3 : జోగుళాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజాభీష్టం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. గద్వాల నియోజకవర్గంలో సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగా 2016 ఆక్టోబరు 16వ జోగుళాంబ గద్వాల జిల్లాను సాధించుకున్నామన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తున్నారని తమకు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 140 రోజులకే రాష్ట్రంలో తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి అయినా అధికారులతో సమీక్షలు జరిపి అభివృద్ధిపై దృష్టి సారించాలి తప్ప, కక్షపూరిత ధోరణిలో వ్యవహ రించడం తగదన్నారు. ప్రజా సమస్యలపై ఏనాడూ అధికారులతో సమావేశం నిర్వహించలేదు కానీ, జిల్లాల రద్దుకు కమిటీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, గద్వాల పట్టణ అధ్యక్షుడు గోవిందు, నాయకులు కురుమన్న, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:35 PM