Share News

మరికల్‌లో భారీ దొంగతనం

ABN , Publish Date - May 04 , 2024 | 11:15 PM

నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌ వెనకాల ఉన్న కుర్వ గౌడ పుల్ల రాములు ఇంట్లో దొంగలు పడి 40 తులాలు బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు అపహరించారు.

మరికల్‌లో భారీ దొంగతనం
చోరీ జరిగిన ఇంటి వద్ద జాగిలంతో తనిఖీ చేస్తున్న పోలీసులు

40 తులాల బంగారం.. రూ.10 లక్షలు నగదు అపహరణ

తాళం తీసి దొంగతనం చేసి మళ్లీ తాళం వేసిన దుండగులు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

మరికల్‌, మే 4: నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌ వెనకాల ఉన్న కుర్వ గౌడ పుల్ల రాములు ఇంట్లో దొంగలు పడి 40 తులాలు బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు అపహరించారు. ఇంటి తాళం తీసి, నగదు, నగలు దొంగతనం చేసి.. మళ్లీ తాళం వేసి తాళాలు అక్కడే పెట్టి వెళ్లడం గమనార్హం. బాధితుడు రాములు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యుల 40 తులాల బంగారం, ఇటీవల పశువుల అమ్మకం ద్వారా వచ్చిన రూ.10 లక్షలు నగదును బీరువాలో ఉంచారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు భోజనం చేశాక వేసవి కావడంతో ఉక్కపోత వల్ల ఇంటికి తాళం వేసి, ఇంటి ఆవరణలో నిద్ర పోయారు. రాములు రాత్రి 12 గంటల ప్రాంతాంలో ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకుని, ఇంటికి తాళం వేశాడు. తాళాలు కిటికీ వద్ద పెట్టి, పడుకున్నాడు. శనివారం ఉదయం లేచి తాళం తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి కనిపించాయి. అందులో బంగారం, నగదు కనిపించలేదు. దాంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌, డీఎస్పీ లింగయ్య, సీఐ రాజేంధర్‌రెడ్డి, ఎస్‌ఐ మురళి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాల ద్వారా తనిఖీ చేశారు. క్లూస్‌ టీమ్‌ ద్వారా వేలి ముద్రలు సేకరించారు. జాగిలాలు సంఘటన స్థలం నుంచి కల్లు దుకాణం వరకు వెళ్లి ఆగిపోయాయి. కేసును ఛేదించడానికి డీఎస్పీ పర్యవేక్షణలో, సీఐ ఆధ్వర్యంలో మూడు టీమ్‌లను ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 04 , 2024 | 11:15 PM