Share News

బీజేపీని పాతరేయాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:14 PM

‘ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరులో బీజేపీని పాతరేయాలి. మహబూబ్‌నగర్‌ ఎంపీగా చల్లా వంశీచంద్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి.’ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు.

బీజేపీని పాతరేయాలి
కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

అరుణమ్మకు పేరు తెచ్చింది కాంగ్రెస్‌ కాదా?

ఆమె పాలమూరు కోసం మోదీని ఏనాడైనా అడిగారా?

వంశీచంద్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి

కొత్తకోట కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌/ మహబూబ్‌నగర్‌/ కొత్తకోట, మే 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరులో బీజేపీని పాతరేయాలి. మహబూబ్‌నగర్‌ ఎంపీగా చల్లా వంశీచంద్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి.’ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. పాలమూరు పెంచుకున్న బిడ్డని తానని చెప్పారు. మారుమూల నల్లమలలో పుట్టి, వనపర్తి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుకున్నానని, తాను మీలాంటి మధ్యతరగతి వాడినేనని అన్నారు. ఒక సామాన్యుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సోనియమ్మ, కాంగ్రెస్‌ పార్టీ రుణం తీర్చుకునేందుకు పాలమూరు బిడ్డలంతా తనకు అండగా ఉండాలని, వంశీచంద్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా, గజ్వేల్‌ నుంచి కేడీ వచ్చినా పాలమూరులో కాంగ్రె్‌సను ఓడించలేరని సవాల్‌ విసిరారు. వారంటే తనకు శత్రువులని, కానీ ఇంటివాళ్లే పరాయివాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డీకే అరుణమ్మ తనపై రేవంత్‌ పగబట్టారని చెబుతోందని, ఆమెపైన తనకెందుకు పగ ఉంటుందని అన్నారు. ఆమెకు తనకు గెట్టు పంచాయితీ కూడా లేదన్నారు. అరుణమ్మ మోదీ చేతిలో చురకత్తిలా మారి కాంగ్రె్‌సని ఖతం చేస్తానంటున్నారని, ఎందుకు కాంగ్రె్‌సని ఖతం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఆమెని జడ్పీటీసీగా గెలిపించినందుకా?.. గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసినందుకా, అరుణమ్మ అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినందుకా?.. ఎందుకు కాంగ్రె్‌సని ఖతం చేస్తారో చెప్పాలన్నారు. అరుణమ్మకు కాంగ్రెస్‌ ఏం అన్యాయం చేసిందని నిలదీశారు. చుట్టపు చూపులా వచ్చిపోయే మోదీని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఏనాడైనా అరుణమ్మ అడిగారా?, ప్రాజెక్టులకు రిపేర్లు చేయాలన్న ఆలోచన వచ్చిందా?, ఆర్డీఎస్‌ పూర్తి చేసి నీళ్లిద్దామని అనుకున్నారా? అని నిలదీశారు. తనపై కేసులు పెట్టి భయపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తానెందుకు భయపడతానని, గద్వాలలో కల్తీకల్లు దందాలు, క్రషర్‌ మిల్లులు, కాంట్రాక్టులు, సారా వ్యాపారాలు ఎవరివని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలన్నా, వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా దక్కాలన్నా, పాలమూరుకు జాతీయ హోదా రావాలన్నా, ముదిరాజ్‌లు బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మారాలన్నా కేంద్రంలో వంశీచంద్‌రెడ్డి ఉండాలని, ఆయన్ని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఉమ్మడి పాలమూరుకు ఏం కావాలో అన్నింటినీ చేసేందుకు ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రణాళికలు తయారు చేయిస్తున్నామన్నారు. మరోవైపున ఢిల్లీలో మనకు కావాల్సిన ప్రాజెక్టులు సాధించేందుకు అనుభవజ్ఞులు జితేందర్‌రెడ్డి ప్రత్యేక ఽప్రతినిధిగా కృషి చేస్తున్నారని చెప్పారు. వారిద్దరినీ సమన్వయం చేస్తూ వంశీచంద్‌రెడ్డి పాలమూరు అభివృద్ధికి దోహదపడతారని, ఆయన్ను లక్ష మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా సీనియర్‌ నేత డాక్టర్‌ మల్లు రవిని నాగర్‌కర్నూల్‌ ఎంపీగా గెలిపించాలని విన్నవించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్‌రెడ్డి, డాక్టర్‌ మల్లురవి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మగౌరవ ఎన్నిక: చల్లా వంశీచంద్‌రెడ్డి

ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికలు పాలమూరు ఆత్మగౌరవానికి సంబంధించినవని, పాలమూరు ముద్దుబిడ్డ రేవంతన్న బలాన్ని ఢిల్లీలో చూయించే ఎన్నికలని అని అన్నారు. పాలమూరు భవిష్యత్తుకు, పాలమూరు భవిష్యత్తు తరాలకు చెందిన ఎన్నికగా అభివర్ణించారు. అందుకే ఈ ఎన్నికను కార్యకర్తలు ఆశామాషిగా తీసుకోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు.

పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి: జీఎంఆర్‌

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు అయినా పూర్తి చేయలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని, అదేవిధంగా కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలని కోరారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి వంశీచంద్‌రెడ్డికి 30 వేల నుంచి 40 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

సీఎం సభ సక్సెస్‌

మహబూబ్‌నగర్‌/ కొత్తకోట: కొత్తకోటలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ విజయవంతం అయ్యింది. రోడ్‌ షోకు జనం అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దారి పొడవున బారులు తీరిన జనాలకు ముఖ్యమంత్రి అభివాదం చేశారు. సీఎంకు నాయకులు ఘన స్వాగతం పలికారు. రేవంత్‌ రాకకు ముందు నాలుగు గంటలకే అధిక సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. దాంతో కొత్తకోట సర్కిల్‌ జనసంద్రంగా మారింది.

Updated Date - May 04 , 2024 | 11:14 PM