Share News

అధినేతల రాక

ABN , Publish Date - May 03 , 2024 | 11:27 PM

పార్లమెంట్‌ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్ర నేతల పర్యటనలు పెరుగుతున్నాయి. ఈ నెల ఐదున ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొననుండగా, ప్రధాని మోదీ ఈ నెల 10న నారాయణపేటకు రానున్నారు.

అధినేతల రాక
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో రాహుల్‌ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు; చిత్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

నేడు కొత్తకోటలో సీఎం రేవంత్‌రెడ్డి కార్నర్‌ మీటింగ్‌

రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌.. 10న ప్రధాని మోదీ..

మహబూబ్‌నగర్‌/కొత్తకోట/ఎర్రవల్లి/నారాయణపేట, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్లమెంట్‌ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్ర నేతల పర్యటనలు పెరుగుతున్నాయి. ఈ నెల ఐదున ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొననుండగా, ప్రధాని మోదీ ఈ నెల 10న నారాయణపేటకు రానున్నారు. నేడు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తకోటలో నిర్వహించనున్న కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే పలుమార్లు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సభలు నిర్వహించిన సీఎం ఎనిమిదో సారి జిల్లాకు వస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తరువాత కొడంగల్‌కు రెండు పర్యాయాలు, కోస్గి, మద్దూర్‌లో ఒక్కో సారి సభలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ సభలోనూ పాల్గొనగా, ఆ తరువాత అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చారు. నారాయణపేటలో బహిరంగ సభ తర్వాత ఇదే పార్లమెంట్‌ పరిధిలోని కొత్తకోటలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. దీంతో పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించేందుకు శ్రేణులను ఏర్పాట్లు చేస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సమీపంలోని నియోజకవర్గాలైన వనపర్తి, కొల్లాపూర్‌ల నుంచి కూడా ప్రజలు, కార్యకర్తలను తరలించనున్నారు. సీఎం జిల్లా, సొంత నియోజకవర్గం ఇదే పార్లమెంట్‌లో ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్‌ గెలుపును ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ మెజారిటీతో మహబూబ్‌నగర్‌తోపాటు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థులను గెలుపించుకోవడమే లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిల మధ్య బిగ్‌ఫైట్‌ నడుస్తోంది. ఇద్దరి మధ్య మాటల యుద్దం సాగుతోంది. దీంతో పార్లమెంట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో మే ఐదున నిర్వహించనున్న ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సభ ఏర్పాట్లను ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు దీపక్‌ ప్రజ్ఞ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభకు రాహుల్‌గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఎస్పీ రితిరాజ్‌ సభా స్థలాన్ని పరిశీలించారు.

నారాయణపేటలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 10న నారాయణపేటకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభా స్థలాన్ని కర్ణాటక కోలార్‌ ఎంపీ మునిస్వామి నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, డోకుర్‌ పవన్‌కుమార్‌ శుక్రవారం పరీశీలించారు. నారాయణపేటలోని క్రీడా మైదానంలో సభను నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై వారు చర్చించారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌, రఘవీర్‌యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:27 PM