Share News

భార్య మంగళసూత్రాలు అమ్ముకున్నోడికి వందల కోట్లు ఎక్కడివి?

ABN , Publish Date - May 04 , 2024 | 01:45 AM

నామినేషన్‌ వేసేందుకు భార్య మంగళసూత్రాలు అమ్ముకున్న ఎంపీ బండి సంజయ్‌కి నేడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ రాజీవ్‌చౌక్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు.

భార్య మంగళసూత్రాలు అమ్ముకున్నోడికి వందల కోట్లు ఎక్కడివి?

- బండి సంజయ్‌ ఆరోపణలు నిజమైతే మహాలక్ష్మి దేవాలయానికి రావాలి

- నీలా శానిటేషన్‌ కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తినలేదు

- రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, మే 3: నామినేషన్‌ వేసేందుకు భార్య మంగళసూత్రాలు అమ్ముకున్న ఎంపీ బండి సంజయ్‌కి నేడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ రాజీవ్‌చౌక్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే మండలాల్లో ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి బండి సంజయ్‌ అసహనానికి గురవుతున్నాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రకటించక ముందు బండి సంజయ్‌ నాదే రాజ్యం అనుకున్నాడు.. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థితో ప్రచారంలోకి దిగగానే అసహనంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంజయ్‌ చేసిన ఆరోపణలు నిజమైతే మహాలక్ష్మి టెంపుల్‌కు పచ్చి బట్టలతోరావాలని మంత్రి సవాల్‌ విసిరారు. సంజయ్‌లాగా శానిటేషన్‌ కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తిన్న వెధవను కాదని తీవ్ర వాఖ్యలు చేశారు. మే 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజేందర్‌రావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్‌లో 10 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించామని, కేసీఆర్‌ ప్రభుత్వంలో గంగుల కమలాకర్‌ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్రూం ఇవ్వలేదని ఆరోపించారు. తాము నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇస్తామని, ఇప్పుడున్న పెన్షన్లు 4 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుం దని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ప్రజలకు అండగా ఉంటామని, సమస్యలు పరిష్కరించే బాధ్యత జిల్లా మంత్రిగా నాదేనని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి రూ 5 లక్షలు ఇస్తామన్నారు. బండి సంజయ్‌ హిందువులు అంటున్నాడు.. శివాలయం, హనుమాన్‌ టెంపుల్‌, వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కు ఏమైనా ఇచ్చాడా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రజలందరికీ అందరికీ న్యాయం చేస్తుందన్నారు. రాజీవ్‌ చౌక్‌ నుంచి అడుగుతున్నా.. నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అవినీతికి పాల్పడ్డావని తీసేశారా లేదా అన్నారు. వినోద్‌కుమార్‌ స్థానికేతరులు ప్యాక్‌ ఐపోయాడన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు తండ్రి జగపతిరావు ఈ జిల్లాను అభివృద్ధి చేశాడని, రాజేందర్‌రావు చదువుకున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఎంపీగా ఏం చేశావో అది చెప్పాలని, ఏది పడితే అది అసహనంతో మాట్లాడవద్దని అన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్‌ చేయనిది నాలుగు నెలల్లో చేశామన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేసి రాజేందర్‌రావును గెలిపించాలని కోరారు.

కరీంనగర్‌ ప్రజల మధ్యనే ఉంటా

- కరీంనగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి వెలిచాల రాజేందర్‌రావు

మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు చివరి కోరిక ప్రకారం కరీంనగర్‌ ప్రజల మధ్య ఉండి వారితో మమేకం అయ్యేం దుకే ఎంపీగా పోటీ చేస్తున్నానని కరీంనగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాజీవ్‌చౌక్‌లో కార్నర్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తన తండ్రి చనిపోయే ముందు చివరి కోరికగా తనను దగ్గరకు తీసుకుని కరీంనగర్‌ ప్రజల మధ్య ఉండి సేవలందించాలని తనతో ఒట్టు తీసుకున్నాడని తెలిపారు. తండ్రికి ఇచ్చన మాట ప్రకారం తన చివరిరక్తపు బొట్టు ఉన్నంత వరకు కరీంనగర్‌ ప్రజలకు సేవలందిస్తానన్నారు. తనను కరీంనగర్‌ ప్రజలు ఆశీర్వదించి, ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరారు. తన కుటుంబానికి కరీంనగర్‌లో 60 ఎకరాల భూమి ఉండేదని, తన తండ్రి ఎమ్మెల్యేగా ప్రజలకు శక్తిమేరకు సేవలు చేస్తూవచ్చారని, ఎవరి వద్ద ఒక పైసా తీసుకోకుండా నిజయితీగా బతికామని, నేడు 5 ఎకరాల భూమి మిగింలిదన్నారు. ఎంపీ బండి సంజయ్‌ 2014లో నామినేషన్‌ కోసం భార్య పుస్తెలతాడును అమ్మినట్లు చెప్పాడని, అటువంటి వ్యక్తి నేడు వేల కోట్లకు పడగలెత్తాడన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు, రైతులకు పెన్షన్లు ఇస్తామని అబద్దాల పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాముడు అంటూ ఓట్ల కోసం దేవుడి పేరును వినియోగిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, నగరకాంగ్రెస్‌ అధ్యక్షులు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ మల్లిఖార్జున రాజేందర్‌, కాంగ్రెస్‌ నాయకుడు రాచర్ల ప్రసాద్‌, మునిగంటి అనిల్‌, దన్నాసింగ్‌, తదితర నాయకులున్నారు.

కరీంనగర్‌ను కోహినూర్‌ మాదిరిగా మార్చుతా

కరీంనగర్‌రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తే కరీంనగర్‌ను కోహినూర్‌ మాదిరిగా తీర్చిదిద్దుతానని కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ప్రమాణం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ తనకు పార్లమెంట్‌లో కరీంనగర్‌ జిల్లా ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తానని మాటిచ్చారు. కరీంనగర్‌ తన జన్మభూమి అని ఇక్కడ ప్రజలంతా తన కుటుంబ సభ్యులని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రతిపాదనతో మీముందుకు వచ్చిన తనను హస్తం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. అయితే బీజేపి, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టేనని అన్నారు. ప్రజాభిమానం లేకుంటే ఎంత డబ్బున్న వారైనా ప్రజల చేత ఓడిపోక తప్ప దని అన్నారు. జగపతిరావు తనయుడిగా ఆపై మీకున్న అభిమానం గురించి చాటి చెప్పేలా హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కొమటి రెడ్డి నరేందర్‌రెడ్డి ,మాజి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్‌ కాశెట్టి లావణ్య- కాశెట్టి శ్రీనివాస్‌, రాచర్ల ప్రసాద్‌,మూల రవీందర్‌రెడ్డి, కృష్ణరెడ్డి, మూల ప్రభాకర్‌రెడ్డి, గంగపల్లి మల్లయ్య, దేవేందర్‌పటేల్‌, కొలగాని అనిల్‌, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 01:45 AM