Share News

దంచి కొడుతున్న ఎండలు

ABN , Publish Date - May 05 , 2024 | 12:48 AM

దంచి కొడుతున్న ఎండలతో జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ, ఇతర మండల కేంద్రాల్లో మధ్యాహ్నం వేళ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

    దంచి కొడుతున్న ఎండలు

- పగటి వేళల్లో నిర్మానుష్యంగా రద్దీ ప్రదేశాలు

- వడదెబ్బతో ఇప్పటికి నలుగురు మృతి

- వడగాలులతో ప్రజలు ఉక్కిరి..బిక్కిరి

- జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌

- 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

దంచి కొడుతున్న ఎండలతో జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ, ఇతర మండల కేంద్రాల్లో మధ్యాహ్నం వేళ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పది గంటల తరువాత ఇళ్లలో నుంచి కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు. రెండు రోజులుగా సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాలు రెడ్‌ అలర్ట్‌లో కొనసాగాయి. శనివారం మాత్రం జిల్లా మొత్తం ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించారు. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 37.5, గరిష్ఠ ఉష్ణోగ్రత 44.4 డిగ్రీలుగా నమోదైంది. వడగాలుల తీవ్రత పెరిగింది. ఇంట్లో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరి..బిక్కిరి అయ్యారు. జిల్లాలోని సిరిసిల్లలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా ఇల్లంతకుంటలో 44.2, గంభీరావుపేట, వీర్నపల్లి 44.0, రుద్రంగి 43.9, వేములవాడ రూరల్‌ 43.6, ముస్తాబాద్‌, బోయినపల్లి 43.5, వేములవాడ 43.3 తంగళ్లపల్లి 43.1, కోనరావుపేట 42.8, ఎల్లారెడ్డిపేటలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమదయ్యాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక జిల్లాలో ఇప్పటి వరకు వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. చందుర్తిలో మట్కం గంగారాం, లింగంపల్లి మొగ్గవ్వ, వేములవాడ రూరల్‌ మండలంలో నాగుల బాలయ్య, శంకర్‌ మరణించారు. ఎండ తీవ్రతకు వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు.

మధ్యాహ్నం వ్యాపారాలు వెలవెల

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జిల్లా కేంద్రానికి వివిధ మండలాల నుంచి ప్రజలు రావడం తగ్గిపోయింది. జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇంటికే పరిమితం అవుతుండడంతో వ్యాపార సంస్థలు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాయంత్రం వేళల్లో కొద్దిమేరకే రద్దీ కనిపిస్తోంది.

ప్రచారాల జోరకు బ్రేక్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా ఎండలు బ్రేక్‌ వేస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం వేళ ఆరు తర్వాత మళ్లీ ప్రచారానికి వెళ్తున్నారు. ఎండ తీవ్రతతో ఎన్నికల ప్రచార సందడి కనిపించడం లేదు.

Updated Date - May 05 , 2024 | 12:48 AM