Share News

కాంగ్రెస్‌ ప్రత్యేక వ్యూహం

ABN , Publish Date - May 05 , 2024 | 12:57 AM

కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ నియోజకవర్గంలో తిరిగి పాగా వేయాలని ప్రత్యేక వ్యూహాలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నది. అభ్యర్థిని ప్రకటించడంలో తీవ్ర జాప్యం కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నది.

కాంగ్రెస్‌ ప్రత్యేక వ్యూహం

- తొమ్మిది మంది సహా ఇన్‌చార్జిల నియామకం

- ముమ్మరంగా ప్రచారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ నియోజకవర్గంలో తిరిగి పాగా వేయాలని ప్రత్యేక వ్యూహాలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నది. అభ్యర్థిని ప్రకటించడంలో తీవ్ర జాప్యం కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు పేరును ప్రతిపాదించి ఆయనకు టికెట్‌ ఇప్పించుకోవడంలో సఫలమైన మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే ఆయనను గెలిపించుకునే బాధ్యత పడింది. మాజీ శాసనసభ్యులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, కోడూరి సత్యనారాయణగౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌, డీసీసీ మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌, సిటీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కొండూరు గాంధీరావు, కె చక్రధర్‌రెడ్డిని పీసీసీ పార్లమెంట్‌ నియోజకవర్గ సహ ఇన్‌చార్జిలుగా నియమించి ప్రచార బాధ్యతలను అప్పగించింది.

చేరికలకు గేట్లు ఎత్తివేత

మరోవైపు ఇంతకాలం ఇతర పార్టీల వాళ్లను చేర్చుకోవడంలో ఆచితూచీ వ్యవహరిస్తున్న నాయకత్వం ప్రస్తుతం చేరికలకు గేట్లు తెరిచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం సిరిసిల్లలో జరిగిన జన జాతర సభలో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ళ ప్రసాద్‌, పిట్టల శ్రీనివాస్‌, గంట కల్యాణి శ్రీనివాస్‌, ఆకుల నర్మద నర్సయ్యపటేల్‌. కె భూమాగౌడ్‌, మెండి శ్రీలత చంద్రశేఖర్‌, మాజీ కార్పొరేటర్‌ పత్తెం మోహన్‌, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌ కాంగ్రెస్‌లో చేరారు. వీరి చేరికకు ముందే కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్‌, కాశెట్టి లావణ్య శ్రీనివాస్‌, ఆకుల పద్మ ప్రకాశ్‌, సీనియర్‌ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణగౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, వహజొద్దీన్‌, పార్టీలో చేరారు. ఘర్‌ వాపసీ నినాదంతో వీరంతా మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు కాంగ్రెస్‌ మేనిఫెస్టోతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నారు. తన సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో తిరిగి పాగా వేయాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటీ పడుతున్నాయి.

Updated Date - May 05 , 2024 | 12:57 AM