Share News

కరెంట్‌ కోతలు... మంచినీళ్లకు గోస

ABN , Publish Date - May 05 , 2024 | 12:34 AM

కరెంట్‌ కోతలు, మంచినీళ్ల గోస చాలయింది. సిరిసిల్లలో మరమగ్గాలు బందువడ్డాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారకరామారావు అన్నారు.

కరెంట్‌ కోతలు... మంచినీళ్లకు గోస
సిరిసిల్ల రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌

సిరిసిల్ల, మే 4 (ఆంధ్రజ్యోతి): కరెంట్‌ కోతలు, మంచినీళ్ల గోస చాలయింది. సిరిసిల్లలో మరమగ్గాలు బందువడ్డాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారకరామారావు అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. సిరిసిల్ల రైతుబజార్‌, మార్కెట్‌, లేబర్‌ అడ్డా, వెంకంపేట, బీవైనగర్‌ కార్మిక వాడల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు అని రాష్ట్రాన్ని ఆగం చేసి అరచేతితో వైకుంఠం చూపి ఎన్నికల ముందు అభయహస్తం, తరువాత భస్మాసుర హస్తమేనని అన్నారు. ఐదేళ్ల కింద బండి సంజయ్‌ అనే పెద్దమనిషిని గెలిపిస్తే సిరిసిల్లకు ఒక్కరూపాయి పనిచేశాడా, ఏ గల్లీలో అయినా బండి సంజయ్‌ శిలాఫకం చూపిస్తారా అని సవాల్‌ విసిరారు. సిరిసిల్లకు నేను ఏమి పనిచేశానో చూపిస్తానన్నారు. బీజేపీ ఒక్క పనిచేసింది చూపించి ఓటు అడగాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు మీ ఓటుతోనే సమధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంఇచె శ్రీనివాస్‌, సెస్‌ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దిడ్డి రమాదేవి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గుడ్ల మంజుల, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, అగ్గిరాములు, దిడ్డి శ్రీనివాస్‌, మ్యాన రవి, తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ శనివారం ఉదయం 6.30 గంటలకే సిరిసిల్ల రైతు బజార్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రైతులతో మాట్లాడుతు సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్ధా.. విధ్వంసమా.. ఆలోచించండి..

- బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌/గంగాధర: అభివృద్ధి కావాలో... విధ్వంసం కావాలో తేల్చుకొని ఆలోచించి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. గంగాధర మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. సింగాపూర్‌ తరహా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం తన లక్ష్యమన్నారు. అబద్దాల పునాదులపై అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మోసాన్ని ఓటర్లు గుర్తించారని, మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఎంపీగా బండి సంజయ్‌ కేంద్రం నుంచి ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

Updated Date - May 05 , 2024 | 12:34 AM