Share News

హోరెత్తుతున్న ప్రచారం

ABN , Publish Date - May 05 , 2024 | 12:52 AM

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండడంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

హోరెత్తుతున్న ప్రచారం

- నియోజకవర్గంలో అభ్యర్థుల సుడిగాలి పర్యటనలు

- సీఎం రేవంత్‌రెడ్డి సభ, కేసీఆర్‌ రోడ్‌ షోతో జోష్‌

- నేడు పెద్దపల్లిలో జేపీ నడ్డా సభ

- ప్రచారానికి వారంరోజులే గడువు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండడంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గానికి మున్నెన్నడూ లేనివిధంగా 42 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీఆర్‌ఎస్‌ నుంచి కొప్పుల ఈశ్వర్‌, బీజేపీ నుంచి గొమాసే శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. ఒకరిపైనొకరు పైచేయి సాధించేందుకు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఈనెల 3న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తరపున సీఎం రేవంత్‌రెడ్డి ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని రాజారాంపల్లిలో జన జాతర సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తిపాక రిజర్వాయర్‌, పాలకుర్తి లిఫ్ట్‌ఇరిగేషన్‌ చేపడుతామని, రామగుండంలో బీ థర్మల్‌లో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు, నేతకాని కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. అదేరోజు గోదావరిఖనిలో, శనివారం మంచిర్యాలలో రోడ్‌షో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ సింగరేణి సంస్థను తామే కాపాడామని, తాగు, సాగునీరు తీసుకవచ్చామని, అనేక సంక్షేమ పథకాలను అమలుచేశామని, కేంద్రంలో బీజేపీ చేసిందేమీ లేదని, కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చిన పథకాలను అమలుచేయడం లేదని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్‌ ఓటు వేయవద్దని, ప్రశ్నించే గొంతు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కే ఓటువేయాలని పిలుపునిచ్చారు.

ఫ పని ప్రదేశాల వద్దకే అభ్యర్థులు..

బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఈనెల 5న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లికి వస్తున్నారు. జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహ, ప్రతివ్యూహాలతో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వాలు చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వస్తున్నారు. ఎండలు మండుతున్నా కూడా వాటిని లెక్క చేయకుండా అభ్యర్థులు ఉదయం 6గంటలకే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ఉదయమే పెద్దఎత్తున మహిళలు ఉపాధిహామీ పనులకు వెళుతుండడంతో పని చేస్తున్న ప్రదేశాల వద్దకే అభ్యర్థులు వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. పట్టణాల్లో షాపుల వెంబడి తిరగడంతో పాటు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఒకరిపైనొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. 42మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఒక్కో పోలింగ్‌ బూతులో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు నమూనా బ్యాలెట్‌లు చూపి ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రధాన పార్టీలు గాకుండా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు పోటీ పడుతున్నప్పటికీ, పెద్దగా ప్రచారం నిర్వహించడం లేదు. ఈనెల 13వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. పోలింగ్‌కు 48 గంటలలోపు అంటే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఓటర్లు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:52 AM