Share News

Kumaram Bheem Asifabad: ఉగ్ర భానుడు.. ‘ఉపాధి’ పనులు

ABN , Publish Date - May 04 , 2024 | 11:24 PM

బెజ్జూరు, మే 4: గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. కూలీలకు క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు అందక పోవడంతో మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారు.

Kumaram Bheem Asifabad:  ఉగ్ర భానుడు.. ‘ఉపాధి’ పనులు

- మండుటెండతో ఉపాధి కూలీలు సతమతం

- నీడ లేదు.. ఇంటి నుంచే తాగునీరు

- పనిప్రదేశాల్లో కనీస వసతులు కరువు

బెజ్జూరు, మే 4: గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. కూలీలకు క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు అందక పోవడంతో మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు భానుడి ఉగ్రరూపం కారణంగా పనికి వెళ్లే కూలీలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక కూలీలు నీరసిస్తున్నారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు లేక ఎండకు కూలీలు అల్లాడుతున్నారు. దీంతో ఉపాధి కూలీలు పనికి వెళ్లేందుకు భయపడుతున్నారు. పది రోజులుగా భానుడు ఉగ్రరూపం దాలుస్తుండటంతో గ్రామాల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పనికి వెళ్తే వడదెబ్బ తగులుతుందేమోనని కూలీలు జంకుతున్నారు. ఇప్పటికే మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎండ తీవ్రత పెరుగుతున్నా పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న కూలీలు మండుటెండలో పనిచేస్తూ అస్వస్థతకు గురవుతున్నారు.

పత్తాలేని మెడికల్‌ కిట్లు..

గ్రామాల్లో వేసవిలో వ్యవసాయ పనులు తగ్గుతుండటంతో చాలా మంది ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఎండాకాలంలో ఉపాధి పనులు చేయడం చాలా కష్టం. దీంతో ప్రభుత్వం నిబంధనలు సడలించింది. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12వరకు కూలీలు పనులు చేసి ఇళ్లకు చేరుతున్నారు. అయితే ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి పనుల్లో ఎక్కువగా చెరువు పూడికతీత, మట్టి కట్టలు పోయడం వంటివి చేపిస్తున్నారు. అయితే పని ప్రదేశంలోని పరిసరాల్లో చెట్ల నీడ కూడా లేకపోవడంతో ఎండకు నీరసించిపోతున్నారు. భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేద తీరడానికి ప్రభుత్వం గుడారాలను పంపిణీ చేసేది. వాటిని క్షేత్రసహాయకులు నిత్యం పని ప్రదేశానికి తీసుకెళ్లి నీడ ఏర్పాటు చేయాలి. తాగునీటిని తెచ్చుకునేవారికి నగదు కూడా చెల్లించేది. 2017తర్వాత ఉపాధి పథకంలో మెడికల్‌ కిట్లు, షామియానాల పంపిణీ లేకుండా పోయింది. గతంలో పథకంలో శాశ్వత శ్రమశక్తి సంఘాలుగా ఉన్నప్పుడు గడ్డపారలు, పార, తట్టలను అందించారు. ఇప్పుడు వాటి పంపిణీ కూడా లేకుండా పోయింది. కూలీలకు గాయాలైన ప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు ప్రథమచికిత్స చేయడానికి కిట్లను ఉపయో గించేవారు. ప్రస్తుతం వాటి పంపిణీ కూడా లేకపోవడంతో కేవలం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది అదికూడా లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పరిస్థితి ఇలా..

జిల్లా వ్యాప్తంగా మొత్తం జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాలు 1,23,423, నమోదైన కూలీల సంఖ్య 2,47,870, మహిళలు 1,21,912, పురుషులు 1,25,950మంది ఉన్నారు. ఇందులో హాజరవుతున్న వారు 93,068మంది కూలీలు ఉన్నారు. జిల్లాలో కూలీల సంఖ్య పెంచడంపై అధికారులు, సిబ్బంది నిత్యం సమీక్షలు చేస్తున్నారు. కానీ కూలీలకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టల నిర్మాణం, మొక్కల సంరక్షణ తదితర పనులు చేస్తున్నారు. కానీ పనిప్రదేశాల్లో ఏమాత్రం సౌకర్యాలు లేక కూలీలు ఎండకు అల్లాడుతు న్నారు. ప్రభుత్వం మాత్రం కూలీలు పనిచేసే చోట అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదని కూలీలు పేర్కొంటున్నారు.

వేతనం పెంచినా కానరాని వసతులు..

తాజాగా కూలీలకు చెల్లించే మొత్తాన్ని రోజుకు రూ.300లకు పెంచారు. కానీ పనిప్రదేశాల్లో సౌకర్యాల కల్పనలో విఫలమవుతున్నారు. వేసవి ఎండలు ముదరడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తక్కువ సంఖ్యలోనే కూలీలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి నీడ, నీటి సౌకర్యాలు కనిపించడం లేదు. దీంతో ఉపాధి పనులు చేపట్టాలంటేనే ఇబ్బందిగా ఉందని కూలీలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పనిప్రదేశంలో వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.

సమస్యలు తీర్చాలి..

- గుర్లె లింగుమేర, ఉపాధి కూలీ

పని చేసేచోటికి ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం. గుడారాలు లేకపో వడంతో ఎండకు తీవ్రఇబ్బందులు పడుతున్నాం. ఈ మండుటెండల్లో పనిప్రదేశంలో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు.

అస్వస్థతకు గురవుతున్నాం..

- చిప్పకుర్తి వెంకటి, ఉపాధి కూలీ

ప్రతిరోజు ఉదయం 7గంటలకు బయల్దేరి 11గంటల వరకు పని చేస్తున్నాం. ఉదయం 8గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో పనులు చేయలేకపోతున్నాం. ఈ తీవ్రమైన ఎండలకు ఉపాధి పనులు చేస్తున్న కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. పని ప్రదేశంలో నీటివసతితో పాటు గుడారాలు ఏర్పాటు చేయాలి.

Updated Date - May 04 , 2024 | 11:24 PM