Share News

ఫెసిలిటేషన్‌ సెంటర్లో అధికార పార్టీ నాయకులకేం పని?

ABN , Publish Date - May 05 , 2024 | 12:12 AM

నూజివీడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడు తోందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఫెసిలి టేషన్‌ సెంటర్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఫెసిలిటేషన్‌ సెంటర్లో అధికార పార్టీ నాయకులకేం పని?
అధికారులను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు

నూజివీడు టౌన్‌, మే 4: నూజివీడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడు తోందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఫెసిలి టేషన్‌ సెంటర్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా నూజివీడు జడ్పీటీసీ ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గుడిమెళ్ళ కృష్ణంరాజుతో పాటు నూజివీడు మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ ఉండటంపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రభావితం చేసేలా గుడిమెళ్ళ కృష్ణంరాజు అక్కడ ఉండటం తగదని, నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి, టీడీపీ నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమ వద్ద పాస్‌లు ఉన్నాయని అధికార పార్టీ నాయకులు పేర్కొనగా ఈ విషయాన్ని నూజివీడు ఆర్వో వై.భవానీశంకరి దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు చేరుకున్న ఆమె సదరు పాస్‌లు చెల్లుబాటుకావని, వారిని తక్షణం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నుంచి బయటకు వెళ్ళాల్సిందిగా సూచించారు. వాస్తవంగా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు కావలసి ఉండగా, సరైన భద్రతా ఏర్పాట్లు చేయటంలో అధికారులు అక్కడ పూర్తిగా విఫలం అయ్యారని, ఎవరు అధికారులో, ఎవరు ఓటర్లో తెలియని పరిస్థితి కూడా నెలకొని ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - May 05 , 2024 | 12:12 AM